అనూహ్య హత్య కేసులో స్థానికుల
సహకారం తీసుకోవాలని పోలీసుల యోచన
ఇప్పటివరకు సాధించింది శూన్యం
మృతురాలి తల్లిదండ్రులతో కొత్త కమిషనర్ భేటీ
త్వరలోనే కేసును ఛేదిస్తామని హామీ
సాక్షి, ముంబై: ఇటీవల సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య హత్య కేసు ఛేదించేందుకు పోలీసులు స్థానికుల సాయం తీసుకోవాలని నిర్ణయానికొచ్చారు. ఈ కేసుపై ఆమెతో ప్రయాణించిన ప్రయాణికులను, ఆటో, ట్యాక్సీ, రైల్వే సిబ్బందిని విచారించినప్పటికీ ఇంతవరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. చివరకు చేసేదిలేక పోలీసులు మృతదేహం లభించిన ప్రాంతం, లోకమాన్య తిలక్ (కుర్లా) టర్మినస్ ప్రాంతాల్లో స్థానికుల సహకారంతో ముందుకెళ్లాలని తుది నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. అప్పుడే ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని వారు భావిస్తున్నారు.
కుర్లా టర్మినస్‌లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌లో అనుమానాస్పదంగా కనిపిస్తున్న ఓ వ్యక్తి ఫొటోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాని ఇంతవరకు ఆ వ్యక్తి ఎవరనేది తెలియరాలేదు. బహుశా భయపడి సమాచారం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీంతో నిందితుడి ఆచూకీ ధైర్యంగా తెలియజేసేందుకు 9870205499, 9869028394, 022-25783999, 022-25963003 ఫొన్ నంబర్లను విడుదల చేశారు. ఆ వ్యక్తి ఆచూకీ తెలిస్తే నిర్భయంగా ఈ నంబర్లను సంప్రదించవచ్చని పోలీసులు తెలిపారు. నిందితుడి గురించి తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు. జనవరి నాలుగో తేదీన హైదరాబాద్ నుంచి బయలుదేరిన అనూహ్య ఐదో తేదీన తెల్లవారుజామున కుర్లా టర్మినస్‌లో రైలు దిగింది.
ఆ తర్వాత అదృశ్యమైన ఆమె కాంజూర్‌మార్గ్ ప్రాంతంలో జనవరి 15న శవమై కనిపించిన విషయం తెలసిందే. ఈ కేసులో పోలీసులు ఇంతవరకు ఎలాంటి పురోగతి సాధించకపోవడంతో ఈ హత్య మిస్టరీగానే మిగిలిపోయింది. కాని పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్‌ను బట్టి అనుమానిత వ్యక్తి జీన్ ప్యాంట్ జేబుకు వేలాడుతున్న తాళాల గుత్తిని బట్టి అతడు డ్రైవర్ కావచ్చని అనుమానిస్తున్నారు. అతడు మద్యం మత్తులో తూలుతున్నట్లు కదలికలను బట్టి గుర్తించారు. అతడి చేతిలో ప్లాస్టిక్ బాటిల్ ఉండడంతో అందులో మద్యం ఉండవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. టెర్మినస్‌లో రైల్వే సిబ్బందితో కొద్ది సేపు మాట్లాడుతున్నట్లు కెమెరాలో కనిపించింది. సిబ్బందిని విచారించినప్పటికీ ఎలాంటి ఫలితం దక్కలేదు. దీంతో ఇక సాధారణ జనం సహకారంతో ఈ కేసు దర్యాప్తు చేపట్టాలని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
ఇదిలాఉండగా ఇటీవల నగర పోలీసు కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన రాకేశ్ మారియా అనూహ్య కుటుంబసభ్యులతో భేటీ అయ్యారు. వారిని ఓదార్చి హంతకులను సాధ్యమైనంత త్వరగా పట్టుకునే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఇదివరకు చేపట్టిన దర్యాప్తు ఫైలు, పురోగతి వివరాలు అందజేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ఎటూ తేలని దర్యాప్తు
Published Tue, Feb 25 2014 11:07 PM | Last Updated on Sat, Sep 2 2017 4:05 AM
Advertisement
Advertisement