అనూహ్య కేసులో న్యాయం
దేశంలో ఆడవాళ్లపై అడ్డూ ఆపూ లేకుండా పెరుగుతున్న అఘాయిత్యాల గురించి ఆందోళనపడుతున్నవారికి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసులో నేరగాడికి ముంబై ప్రత్యేక సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ శుక్రవారం వెలువరించిన తీర్పు ఉపశమనం కలిగిస్తుంది. ముంబై శివారులో ఉన్న టీసీఎస్‌లో ఉద్యోగిని అయిన అనూహ్య... సెలవులకు స్వస్థలమైన కృష్ణాజిల్లా మచిలీపట్నం వచ్చి తిరిగి వెళ్తూ నిరుడు జనవరి 5న కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినస్‌నుంచి అదృశ్యం కావడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
రోజులు గడుస్తున్నా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో కన్నవారు తల్లడిల్లారు. చివరకు 55 రోజుల తర్వాత ఆమె మృతదేహం నిర్జన ప్రదేశంలో లభ్యమైంది. 2,500 మందిని విచారించి, 36 సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులు చివరకు చంద్రభాన్ సానాప్ హంతకుడన్న నిర్ణయానికొచ్చారు. మూడేళ్లక్రితం ఢిల్లీలో చోటుచేసుకున్న నిర్భయ ఉదంతం తర్వాత కఠినమైన చట్టం అమల్లోకి వచ్చినా, ఆ మాదిరి ఉదంతాల్లో తగ్గుదల కనిపించకపోవడం సమాజంలో అందరినీ కలవరపెడుతున్నది. ఇప్పుడు అనూహ్య హత్య కేసులో ముంబై ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు ఆ అంశాన్ని మరోసారి చర్చలోకి తీసుకొచ్చింది.
మహిళలపై జరిగే నేరాల విషయంలో అలసత్వం వహించడంవల్లే అవి పదే పదే జరుగుతున్నాయని మహిళా సంఘాలు ఆరోపిస్తాయి. వెనువెంటనే దర్యాప్తు జరిపి నేరాన్ని రుజువు చేయగలిగితే...సాధ్యమైనంత త్వరగా శిక్ష పడేటట్లు చేయగలిగితే ఇలాంటి నేరాలు నియంత్రణలోకొస్తాయని ఆ సంఘాలు అంటాయి. దాంతోపాటు సమాజంలో మానవీయ విలువల్ని పెంపొందించడం, మహిళలను కించపరిచే ఆలోచనా ధోరణులను రూపుమాపడం అవసరమని చెబుతాయి. దురదృష్టవశాత్తూ అవేమీ జరగడంలేదు.
మీడియాలో విస్తృత ప్రచారం పొందిన కొన్ని కేసులు మినహా...మిగిలినవి నత్తనడకన సాగుతున్నాయి. డబ్బూ, పలుకుబడీ ఉన్నవారు నిందితులైన పక్షంలో కేసుల నమోదే అసాధ్యమవుతున్నది. కొన్నేళ్లక్రితం సినీ నటి ప్రత్యూష మరణం కేసులో ఏమైందో అందరికీ తెలుసు. ప్రలోభాలకు, ఇతర ఒత్తిళ్లకు లొంగి దర్యాప్తు సక్రమంగా జరపకపోవడంవల్లనే తన కుమార్తెకు న్యాయం జరగలేదని అప్పట్లో ఆమె తల్లి ఆరోపించారు. మన దేశంలో నిరుడు 3 లక్షల 38వేల లైంగిక నేరాలు నమోదయ్యాయని జాతీయ క్రైం రికార్డుల బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. అంతకు ముందు సంవత్సరం కన్నా ఇది 9 శాతం ఎక్కువ.
అనూహ్య కేసు విషయంలో పోలీసులు పకడ్బందీగా దర్యాప్తు జరిపారు. అత్యాచారానికి ప్రయత్నించి, ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో హతమార్చాడని రుజువు చేశారు. న్యాయస్థానంలో కూడా విచారణ వేగంగా జరిగింది. కానీ ఇదంతా సవ్యంగా సాగడానికి అనూహ్య తల్లిదండ్రులూ, అయినవారూ ఎంత కష్టపడ్డారో...సమాజంలోని భిన్న వర్గాలవారు ఏ రకంగా ఒత్తిళ్లు తెచ్చారో గుర్తుంచుకోవడం అవసరం. అసలు కేసు నమోదు చేసుకోవడానికే పోలీసులు ముందుకు రాలేదు. మా పరిధిలోకి రాదంటే...మా పరిధిలోకి రాదంటూ తప్పించుకోవాలని చూశారు.
అనూహ్య అదృశ్యమైన రోజే ముంబైలోని ఆమె బంధువు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు ఆమె తండ్రి విజయవాడ పోలీసులను ఆశ్రయించడం, వారు కుర్లా పోలీస్ స్టేషన్‌కు లేఖ పంపడం పర్యవసానంగా కేసు నమోదైంది. ఇంత జాప్యం చోటు చేసుకుంటే కన్నవారు ఎంత క్షోభకూ, మానసిక వేదనకూ గురవుతారో వేరే చెప్పనవసరం లేదు. ఎక్కడో తమ బిడ్డ ఇంకా క్షేమంగా ఉండి ఉండొచ్చని...పోలీసులు వెంటనే కదిలితే ఆమె సురక్షితంగా బయటపడే అవకాశం ఉంటుందని వారు ఆశిస్తారు. అనూహ్య మృతదేహం ఆచూకీ కనుగొన్నది కూడా ఆమె బంధువులే తప్ప పోలీసులు కాదు. వీటన్నిటినీ లోక్‌సభలో ప్రస్తావించడం, కేసు సక్రమంగా దర్యాప్తు చేసేలా చూడమని అప్పటి కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను కోరడం...మీడియాలో విస్తృతంగా కథనాలు వెలువడటం వంటి కారణాలవల్ల పోలీసులు కదిలారు.
దానికితోడు బొంబాయి హైకోర్టు కూడా ఈ విషయంలో పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఓ యువతి అదృశ్యమైందని ఫిర్యాదు వస్తే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ చీవాట్లు పెట్టింది. ఇందుకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. శాంతిభద్రతల్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించాల్సిన పోలీసు వ్యవస్థ ఆ పనిని సక్రమంగా నిర్వర్తించడం కోసం ఎంతమంది ఎన్ని విధాలుగా శ్రమించవలసి వచ్చిందో అనూహ్య ఉదంతం చూస్తే అర్థమవుతుంది.
నిజానికి అన్ని కేసులూ ఇలా త్వరితగతిన పూర్తయితే నేర మనస్తత్వం ఉండేవారిలో భయం ఏర్పడుతుంది. నేరం చేస్తే తప్పించుకోవడం సాధ్యంకాదని అర్ధమవుతుంది. సమాజంలో నేర నియంత్రణకు అదెంతగానో తోడ్పడుతుంది. ఈమధ్యే మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఒక కేసులో తీర్పునిస్తూ నేరస్తులకు మగతనాన్ని తొలగించే విధంగా నేర శిక్షాస్మృతిలో నిబంధనను చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
మరణశిక్ష అయినా, మగతనాన్ని తొలగించే శిక్షయినా అత్యాచారాలను అరికట్టగలవనుకోవడం సరైంది కాదని మానవ హక్కుల సంఘాలు వాదిస్తాయి. దోషులను దండించడం, చట్టమంటే అందరిలోనూ భయం కలిగేలా చేయడం అవసరమే. దాన్నెవరూ కాదనరు. కానీ నేరాలకు దోహదం చేస్తున్న ధోరణులనూ, పరిస్థితులనూ పెకిలించకుండా... అందుకవసరమైన చైతన్యాన్ని పెంచకుండా నేరాలను అరికట్టగలమా? ఈ విషయంలో జస్టిస్ జేఎస్ వర్మ నేతృత్వంలోని కమిటీ ఎన్నో సూచనలు ఇచ్చింది. అలాంటి సూచనలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. అప్పుడు మాత్రమే లైంగిక నేరాలకు అడ్డుకట్టవేయడం సాధ్యమవుతుంది.