మృతురాలు అనుహ్య (ఫైల్ ఫోటో)
ముంబైలో దారుణహత్యకు గురైన మచిలీపట్నం యువతి అనుహ్య కేసులో నగర పోలీసులు కీలక పురోగతి సాధించారు. అనుహ్య కేసుకు సంబంధించి నలుగురు ఆటో డ్రైవర్లను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ నలుగురు డ్రైవర్లను పోలీసు స్టేషన్కు తరలించి పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ముంబైలోని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా అనుహ్య పని చేస్తుంది.
అయితే క్రిస్టమస్ సెలవులు నేపథ్యంలో అనుహ్య స్వస్థలం వచ్చింది. సెలవులనంతరం ఆమె ఈ నెల మొదటివారంలో ముంబై పయనమైంది. ఆ క్రమంలో అనుహ్య ఆచూకీ తెలియకుండా పోయింది. దాంతో ఆమె తండ్రి హరి ప్రసాద్ తీవ్ర ఆందోళన చెందారు. దాంతో ఆయన ముంబై వచ్చి అనుహ్య కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా ఆయన ముంబై పోలీసులను ఆశ్రయించారు. వారిని నుంచి సరైన స్పందన లేకపోవడంతో హరిప్రసాద్ తన బంధువులతో గాలించారు.
దీంతో నగరంలోని కంజూర్‌మార్గ్ ప్రాంతంలో కాలిపోయిన ఉన్న మృతదేహన్ని అనుహ్యగా గుర్తించారు. అనుహ్య మరణంపై ముంబై పోలీసులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించారని ఆమె తండ్రి హరిప్రసాద్ శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలసి విజ్ఞప్తి చేశారు. దాంతో ఆ కేసుపై దర్యాప్తు వేగవంతం చేయాలని మహారాష్ట్ర సీఎంకు షిండే ఆదేశాలు జారీ చేశారు. ఆ క్రమంలో నలుగురు ఆటో డ్రైవర్లను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.