
ఆడపిల్లల జోలికి వెళ్లాలంటే భయపడాలి
అనూహ్య హత్యకేసులో దోషిగా తేలిన చంద్రభాన్‌కు ఉరిశిక్ష విధించడంపై అనూహ్య తండ్రి ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఇక మీదట ఎవరైనా ఆడపిల్లల జోలికి వెళ్లాలంటే భయపడాలని, అలాగే ఈ తీర్పు ఉందని ఆయన అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని తమ ఇంట్లో ఆయన శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
- ఈ నిర్ణయం నేరస్థులకు గుణపాఠంగా ఉంటుందని నమ్మకం కలిగిస్తోంది
- ఈ కేసు విషయంలో మాకు అండగా ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు
- తొలిసారి నన్ను చూసినప్పుడు నేను అనూహ్య తండ్రినని అతడికి తెలియదు
- నాకెందుకో అతడి మీద కోపం రాలేదు గానీ, నేరం చేశానన్న ఆలోచన గానీ, భయం గానీ కనపడలేదు
- అతడిని నేను చూడటం అదే మొదటిసారి, చివరిసారి
- మొదట్లో ఈ కేసు విచారణలో నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి
- అనూహ్య బైకు ఎందుకు ఎక్కుతుంది, అంత దూరం వెందుకు వెళ్తుందని అనిపించింది
- ఆమె రెండో ప్లాట్‌ఫారం మీద దిగి, నాలుగో ప్లాట్ ఫారం మీదకు వచ్చింది
- ముందు తనకు కారు ఉందని చెప్పాడు, తర్వాత బైకు మీద తీసుకెళ్లాడు
- బహుశా తన సామాన్లు పోతాయనే భయంతో ఆమె వెళ్లి ఉంటుందేమో
- తను చాలా సెన్సెటివ్‌గా ఉండేది.. ఎవరైనా గట్టిగా మాట్లాడినా ఏడ్చేసేది
- కోర్టు ఇచ్చిన తీర్పు సరిగ్గా ఉంది
- ఉరిశిక్ష వేయకూడదనే మానవతావాదులు, మానవహక్కుల వాళ్లు ఉన్నారు
- కానీ ఇలాంటి క్రూర మనస్తత్వం ఉన్నవాళ్లకు కూడా ఇలాంటి శిక్షలు వేయకపోతే ఏముంది, నాలుగు రోజులు జైల్లో ఉంటే సరిపోతుందేమో అనుకుంటారు
- ఇలాంటి వాళ్లకు ఉరిశిక్ష వేస్తేనే సరైనదని నేను ముందునుంచి భావించాను
- ఈ శిక్ష చూసిన తర్వాత ఆడపిల్ల జోలికి వెళ్లాలంటే భయపడాలి.. ఈవ్ టీజింగ్ చేసేవాళ్లు కూడా భయపడాలి
- టీజింగ్ గురించి సినిమాల్లో కూడా పాజిటివ్‌గా చూపిస్తున్నారు
- అక్కడంతా బాగానే ఉంటుంది కాబట్టి పర్వాలేదు గానీ, బయట సమాజంలో అలా లేదు
- సమాజంలో తెలివిగా ఉండాలని తెలియజేయాలి
- చంద్రభాన్ ఇక హైకోర్టుకు వెళ్లినా కూడా.. పోలీసుల వద్ద నూటికి నూరుశాతం ఆధారాలు ఉండటంతో అక్కడ కూడా మరణశిక్షను తప్పించుకునే అవకాశం లేదని అనుకుంటున్నాను
- అతడి కుటుంబ సభ్యులు కూడా సాక్ష్యం చెప్పారు
- కేసు జరుగుతున్నప్పుడు కూడా ముంబై పోలీసులు పిలిచి, నన్ను తీసుకెళ్లి తాము సేకరించిన సాక్ష్యాల గురించి వివరించారు. దాంతో నాకు నమ్మకం కలిగింది.