మలుపు తిరుగుతున్న అనూహ్య కేసు!
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన మచిలీపట్నంకు చెందిన సాప్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య (23) హత్య కేసు మలుపులు తిరుగుతోంది. ముంబయి లోక్‌మాన్య తిలక్ టెర్మినల్ సీసీ ఫుటేజీ దర్యాప్తులో కీలకంగా మారింది. అనూహ్యతో ఓ వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రైలు దిగిన తర్వాత ఆమె ఓ వ్యక్తితో కలిసి వెయిటింగ్ రూమ్‌లోకి వెళ్లినట్టు గుర్తించారు. అతను అనుహ్యకు తెలిసిన వ్యక్తే అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తిని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది.
అయితే ఇంత వరకూ అతన్ని అదుపులోకి తీసుకోలేదని అంటున్నారు. అతన్ని పట్టుకుంటే హత్యకు సంబంధించిన కీలక సమాచారం లభిస్తుందని ముంబయి పోలీసులు భావిస్తున్నారు. మరో వైపు దర్యాప్తులో భాగంగా రైల్వే పోలీసులు, ముంబయు క్రైమ్ బ్రాంచ్ ప్రతినిధులు హైదరాబాద్ బయల్దేరినట్టు తెలుస్తోంది. అయితే వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
సింగవరపు ఎస్తేర్ అనూహ్య ఈనెల 5న అదృశ్యమైన 11 రోజుల తర్వాత కంజూర్‌మార్గ్‌కు సమీపంలో శవమై లభించిన విషయం విదితమే. హత్యకు ముందు ఆమెను ఐదు రోజుల పాటు లైంగిక దాడికి గురిచేశారని, చిత్రహింసలు పెట్టారని పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. కాగా ఈ కేసులో ఐదుగురు నిందితులను కుంజూర్‌మార్గ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ముగ్గురు క్యాబ్ డ్రైవర్లు, ఇద్దరు వ్యభిచారగృహ నిర్వాకులు ఉన్నారు. అయితే విచారణ అనంతరం వారిని విడిచి పెట్టారు.
అనూహ్య హత్య కేసులో పోలీసులకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. ఇది వస్తే అసలు హత్య ఎలా జరిగింది..? ఎప్పుడు జరిగింది..? దేనితో చేశారు..? మరోవైపు ఆ మృతదేహం అనూహ్యదేనా..? అనే తదితర ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. దీంతో పోలీసులు కూడా అనేక మంది అటో డ్రైవర్‌లతోపాటు రికార్డులో ఉన్న నేరస్తులను విచారించిన అనంతరం ఫోరెన్సిక్ నివేదిక కోసమే ఎదురుచూస్తున్నట్టుగా కన్పిస్తోంది. దీంతో ఈ నివేదికలో ఏమి ఉండనుందనే అంశంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.