కూతురి ఫొటోతో ప్రసాద్
నిర్భయకు ముందు .. తర్వాతా ఎలాంటి మార్పూ రాలేదు అమ్మాయిల గౌరవ మర్యాదలకు సంబంధించి! నిర్భయ తాలూకు ప్రకంపనలు పార్లమెంట్ ఆవరణను తాకినా ఇంటా, బయటా ఎక్కడా మహిళలకు భద్రత లేదు! ముంబైలో తెలుగు అమ్మాయి ఎస్తర్ అనూహ్య, హాజీపూర్‌లో అక్కాచెల్లెళ్లు, వరంగల్‌లో తొమ్మిదినెలల పాప, నిన్నటికి నిన్న మానస, టేకుల లక్ష్మి, దిశ.. పసిపిల్ల దశ నుంచే రక్షణ కరువు! తన బిడ్డను పోగొట్టుకున్న బాధ తెలిశాక ఇంకే బిడ్డా ఇలాంటి ఘోరానికి బలికావద్దు.. మరే తల్లి, తండ్రికీ ఈ వేదన మిగలకూడదు అనుకున్నాడు ఎస్తర్ అనూహ్య తండ్రి.. ఎస్.జి.ఎస్ ప్రసాద్. దిశ సంఘటన నేపథ్యంలో తాము మింగిన విషాదాన్ని గుర్తు చేసుకుంటూ.. సమాజానికి ఈ విశ్రాంత అధ్యాపకుడు చేస్తున్న విన్నపం ఆయన మాటల్లోనే...
‘‘దిశ ఇన్సిడెంట్ గురించి కంప్లయింట్ ఇవ్వడానికి ఆ అమ్మాయి తల్లిదండ్రులు స్టేషన్ కు వెళ్లడం, పోలీసుల ప్రవర్తన అన్నీ మా అమ్మాయి ఇన్సిడెంట్‌నే గుర్తుచేశాయి. 2014లో మాదీ ఇలాంటి విషాదమే. మా అమ్మాయి ముంబైలో టీసీఎస్‌లో వర్క్ చేసేది. సెలవుమీద డిసెంబర్లో మచిలీపట్టణం వచ్చిన.. జనవరి 4న (2014) మళ్లీ ముంబైకి బయలుదేరింది. అయిదో తారీఖు ఉదయం కల్లా చేరుకోవాలి. ఏడుగంటలకు తన సెల్‌కి కాల్ చేశా. రింగ్ అవుతోంది కాని రిప్లయ్ లేదు. అమ్మాయి రూమ్మేట్‌కీ ఫోన్ చేశా. ఇంకా చేరుకోలేదని చెప్పింది. మనసు కీడు శంకించి వెంటనే ముంబై వెళ్లాం. రైల్వే పోలీసులు.. ట్రాక్‌కి అవతల ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లమన్నారు. వెళ్లి కంప్లయింట్ ఇచ్చాం. ‘మిస్సింగ్ కేస్’గా నమోదు చేసుకొని.. ‘‘కనపడితే ఇన్ ఫామ్ చేస్తాం’’ అని చాలా నింపాదిగా చెప్పారు. పోలీసుల నుంచి దిశ పేరెంట్స్ ఎదుర్కొన్న ప్రశ్నలనే నాడు మేమూ ఎదుర్కొన్నాం.
‘‘ఏ ఫ్రెండ్‌తోనో వెళ్లుంటుంది’’ అని, ‘‘కంగారు పడకండి.. రెండు రోజుల్లో అమ్మాయి నుంచి మీకుఫోన్ వస్తుంది పెళ్లి చేసుకున్నట్టుగా..’’ అంటూ కామెంట్స్ చేశారు. ‘‘మా అమ్మాయితో మేం చాలా ఫ్రెండ్లీగా ఉంటామండీ.. అలాంటిదేదైనా ఉంటే మాతో చెప్పేంత చనువు తనకు ఉంది’’ అని చెప్పినా వాళ్ల తీరు మారలేదు. మా టెన్షన్ , భయాన్ని అర్థంచేసుకోలేదు, పట్టించుకోలేదు. టీసీఎస్‌లోని హయ్యరఫీషియల్స్ ఇన్వాల్వ్ అయితేనే రెస్పాన్స్ వచ్చింది. అప్పటికీ మా బంధువులు, స్నేహితులు అందరూ రంగంలోకి దిగి మా అమ్మాయి సెల్ ఫోన్ సిగ్నల్స్‌ను ట్రేస్ చేశారు. ఇలా అన్ని వైపుల నుంచి అన్నిరకాల సమాచారం తీసుకొని పోలీసులకు అందిస్తే అప్పుడు దాన్ని పట్టుకొని వాళ్లు ముందుకెళ్లారు. పదో రోజుకి మా అమ్మాయి దొరికింది! అప్పటికే మీడియా ప్రచారం, పొలిటికల్ ప్రెజర్ పెరిగి ఉండడం వల్ల ట్రయలప్పుడు మాత్రం చురుగ్గా కదిలారు. సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ తప్ప ఏమీ లేదు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు అయింది. యేడాదిలోగా నేరస్తుడికి శిక్ష పడింది. ఇంకా అమలు కాలేదు.
స్టేషన్‌లోని ఎస్తర్ సీసీ ఫుటేజ్ దృశ్యం
►2014, జనవరి అయిదో తారీఖు తెల్లవారు జామున ముంబై, కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినస్‌లో దిగిన ఎస్తర్ అనూహ్య ఒక టూ వీలర్ ట్యాక్సీలో తన రూమ్‌కి బయలుదేరింది. పదో రోజున ముంబై శివార్లలో అస్థిపంజరమై కనిపించింది. డ్రాప్ చేస్తానని చెప్పిన ఆ టూ వీలర్ రైడర్ చంద్రభాన్ సానప్ ఆమె మీద లైంగిక దాడి, హత్య చేశాడని రుజువైంది. అతనికి మరణ శిక్ష ఖరారైంది.
సున్నితంగా ఆలోచించరు ఎందుకు?
పోలీసులు ఇంట్రెస్ట్ పెడితే తప్పకుండా చేయగలరు. అమ్మాయి కనపడట్లేదు అని తల్లిదండ్రులు కంప్లయింట్ ఇస్తే ఈ స్టేషన్ కాదు ఇంకో స్టేషన్ అని తప్పించుకోవడం ఎందుకు? ఇన్సిడెంట్ ఎక్కడ జరిగినా.. జ్యురిస్ సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్ లో అయినా రిపోర్ట్ తీసుకోవాలి అని స్పష్టంగా ఉంది కదా! సుప్రీం కోర్టే ఆర్డర్ ఇచి్చంతర్వాత కూడా ఈ కాలయాపన ఎందుకు? ఆడపిల్ల కనిపించకుండా పోయింది అనేది చాలా సీరియస్, సెన్సిటివ్ విషయం. ‘‘మీ అమ్మాయికి బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా?, లవ్ మ్యాటరా?, రెండ్రోజులాగి తనే వస్తుందిలెండి, పెళ్లిచేసుకొని మీకు ఫోన్ చేస్తుంది..’’ లాంటి ప్రశ్నలు అడగొచ్చా? బాయ్‌ఫ్రెండే ఉన్నాడనుకోండి, పెళ్లిచేసుకోవడానికే వెళ్లిందనుకోండి.
పోలీసులు ముందు ప్రమాదాన్నయితే శంకించి జాడ తీయాలి కదా! సున్నితంగా ఆలోచించరెందుకు? ఫ్రెండ్లీ పోలీసే కాదు.. బాధ్యత గల పోలీసులూ కావాలి. ఏమైంది ఈ రోజు? మరో తల్లికి, తండ్రికి శోకం తప్ప ఏం మిగిలింది? నా బిడ్డ పోయినప్పుడు అనుకున్నాను.. ఇంకే పేరెంట్స్‌కీ ఇలాంటి అనుభవం ఎదురుకావొద్దు. మరే తల్లిదండ్రులకూ మా బాధ రాకూడదు అని. ఇప్పుడు దిశ వాళ్ల అమ్మానాన్నా అదే అనుకుంటున్నారు. నాడు నిర్భయ తల్లిదండ్రులూ అదే కోరుకున్నారు. కాని ఆగలేదు. దిశను తిరిగి తేలేం. ఆ అమ్మాయి తల్లిదండ్రుల బాధనూ తీర్చలేం. నిబ్బరంగా ఉండండి అని చెప్పడం తప్ప ఏం చేయగలుగుతున్నాం?
కోపంగా, ఆవేశంగా కాదు...
మాకు జరిగిన దారుణం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే ఇలాంటివెన్నో వింటున్నాం. అమ్మాయిలు బాగా చదివి, జీవితంలో చక్కగా స్థిరపడాలని కోరుకోవడం తప్పు కాదుకదా! ఆడపిల్లలు మగపిల్లలతో పోటీపడి ముందుండాలనుకోవడమూ పొరపాటు కావొద్దు కదా! ఇవన్నీ చూస్తుంటే ఆడపిల్లలను మళ్లీ గడపకే పరిమితం చేస్తారేమోననే దిగులు. ఓ బిడ్డను పోగొట్టుకున్న తండ్రిగా ఈ సమాజానికి నాదొక్కటే విన్నపం.. ఆడపిల్లల్ని బతకనిద్దాం. మనం సంట్రేట్ చేయాల్సింది ఆడపిల్లల మీద కాదు. మగపిల్లల మీద, వాళ్ల పెంపకం, ప్రవర్తన మీద. మగపిల్లాడు ఏం చేసినా చెల్లుతుంది అనే భావన పెంచొద్దు. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ సమానమే. ఇద్దరికీ ఒకే రెస్పెక్ట్ ఉండాలని తెలియచేయాలి.
బాధను అనుభవించిన వాళ్లు చెబితే అర్థం అవుతుందని, అర్థం చేసుకుంటారని ముందుకొచ్చాను. ఒక అమ్మాయిని కోల్పోవడం ఆ కుటుంబానికే కాదు సమాజానికీ లోటే. ఒక అబ్బాయి నేరస్తుడవుతే ఇంటికే కాదు సమాజానికీ ప్రమాదమే! ఇలాంటి సంఘటనలు జరగగానే కోపం,ఆవేశం రావడం సహజమే. ఆ భావోద్వేగంలో నేరస్తులను పట్టుకొని నడిరోడ్డుమీద కొట్టాలి, చంపాలి అంటారు. నా బిడ్డ పోయినప్పుడు నాకూ అలాగే అనిపించింది. కాని ఇలాంటి ఆటవిక న్యాయం మరెన్నో ఘోరాలకు కారణమవుతుంది. మనకు చట్టాలున్నాయి. ఇలాంటి దారుణాలు మళ్లీ జరక్కుండా చూసే తీర్పులు కావాలి. అలాంటి చట్టాలు రావాలి. సత్వరంగా న్యాయం అందేలా ఉండాలి’’ అంటున్నారు మచిలీపట్టణంలోని నోబుల్ కాలేజ్ పొలిటికల్ సైన్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌గా రిటైరైన ఎస్.జి.ఎస్.ప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment