Esther Anuhya murder case
-
మరే తల్లి, తండ్రికీ ఈ వేదన మిగలకూడదు
నిర్భయకు ముందు .. తర్వాతా ఎలాంటి మార్పూ రాలేదు అమ్మాయిల గౌరవ మర్యాదలకు సంబంధించి! నిర్భయ తాలూకు ప్రకంపనలు పార్లమెంట్ ఆవరణను తాకినా ఇంటా, బయటా ఎక్కడా మహిళలకు భద్రత లేదు! ముంబైలో తెలుగు అమ్మాయి ఎస్తర్ అనూహ్య, హాజీపూర్‌లో అక్కాచెల్లెళ్లు, వరంగల్‌లో తొమ్మిదినెలల పాప, నిన్నటికి నిన్న మానస, టేకుల లక్ష్మి, దిశ.. పసిపిల్ల దశ నుంచే రక్షణ కరువు! తన బిడ్డను పోగొట్టుకున్న బాధ తెలిశాక ఇంకే బిడ్డా ఇలాంటి ఘోరానికి బలికావద్దు.. మరే తల్లి, తండ్రికీ ఈ వేదన మిగలకూడదు అనుకున్నాడు ఎస్తర్ అనూహ్య తండ్రి.. ఎస్.జి.ఎస్ ప్రసాద్. దిశ సంఘటన నేపథ్యంలో తాము మింగిన విషాదాన్ని గుర్తు చేసుకుంటూ.. సమాజానికి ఈ విశ్రాంత అధ్యాపకుడు చేస్తున్న విన్నపం ఆయన మాటల్లోనే... ‘‘దిశ ఇన్సిడెంట్ గురించి కంప్లయింట్ ఇవ్వడానికి ఆ అమ్మాయి తల్లిదండ్రులు స్టేషన్ కు వెళ్లడం, పోలీసుల ప్రవర్తన అన్నీ మా అమ్మాయి ఇన్సిడెంట్‌నే గుర్తుచేశాయి. 2014లో మాదీ ఇలాంటి విషాదమే. మా అమ్మాయి ముంబైలో టీసీఎస్‌లో వర్క్ చేసేది. సెలవుమీద డిసెంబర్లో మచిలీపట్టణం వచ్చిన.. జనవరి 4న (2014) మళ్లీ ముంబైకి బయలుదేరింది. అయిదో తారీఖు ఉదయం కల్లా చేరుకోవాలి. ఏడుగంటలకు తన సెల్‌కి కాల్ చేశా. రింగ్ అవుతోంది కాని రిప్లయ్ లేదు. అమ్మాయి రూమ్మేట్కీ ఫోన్ చేశా. ఇంకా చేరుకోలేదని చెప్పింది. మనసు కీడు శంకించి వెంటనే ముంబై వెళ్లాం. రైల్వే పోలీసులు.. ట్రాక్‌కి అవతల ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లమన్నారు. వెళ్లి కంప్లయింట్ ఇచ్చాం. ‘మిస్సింగ్ కేస్’గా నమోదు చేసుకొని.. ‘‘కనపడితే ఇన్ ఫామ్ చేస్తాం’’ అని చాలా నింపాదిగా చెప్పారు. పోలీసుల నుంచి దిశ పేరెంట్స్ ఎదుర్కొన్న ప్రశ్నలనే నాడు మేమూ ఎదుర్కొన్నాం. ‘‘ఏ ఫ్రెండ్‌తోనో వెళ్లుంటుంది’’ అని, ‘‘కంగారు పడకండి.. రెండు రోజుల్లో అమ్మాయి నుంచి మీకుఫోన్ వస్తుంది పెళ్లి చేసుకున్నట్టుగా..’’ అంటూ కామెంట్స్ చేశారు. ‘‘మా అమ్మాయితో మేం చాలా ఫ్రెండ్లీగా ఉంటామండీ.. అలాంటిదేదైనా ఉంటే మాతో చెప్పేంత చనువు తనకు ఉంది’’ అని చెప్పినా వాళ్ల తీరు మారలేదు. మా టెన్షన్ , భయాన్ని అర్థంచేసుకోలేదు, పట్టించుకోలేదు. టీసీఎస్‌లోని హయ్యరఫీషియల్స్ ఇన్వాల్వ్ అయితేనే రెస్పాన్స్ వచ్చింది. అప్పటికీ మా బంధువులు, స్నేహితులు అందరూ రంగంలోకి దిగి మా అమ్మాయి సెల్ ఫోన్ సిగ్నల్స్‌ను ట్రేస్ చేశారు. ఇలా అన్ని వైపుల నుంచి అన్నిరకాల సమాచారం తీసుకొని పోలీసులకు అందిస్తే అప్పుడు దాన్ని పట్టుకొని వాళ్లు ముందుకెళ్లారు. పదో రోజుకి మా అమ్మాయి దొరికింది! అప్పటికే మీడియా ప్రచారం, పొలిటికల్ ప్రెజర్ పెరిగి ఉండడం వల్ల ట్రయలప్పుడు మాత్రం చురుగ్గా కదిలారు. సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ తప్ప ఏమీ లేదు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు అయింది. యేడాదిలోగా నేరస్తుడికి శిక్ష పడింది. ఇంకా అమలు కాలేదు. స్టేషన్‌లోని ఎస్తర్ సీసీ ఫుటేజ్ దృశ్యం ►2014, జనవరి అయిదో తారీఖు తెల్లవారు జామున ముంబై, కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినస్‌లో దిగిన ఎస్తర్ అనూహ్య ఒక టూ వీలర్ ట్యాక్సీలో తన రూమ్‌కి బయలుదేరింది. పదో రోజున ముంబై శివార్లలో అస్థిపంజరమై కనిపించింది. డ్రాప్ చేస్తానని చెప్పిన ఆ టూ వీలర్ రైడర్ చంద్రభాన్ సానప్ ఆమె మీద లైంగిక దాడి, హత్య చేశాడని రుజువైంది. అతనికి మరణ శిక్ష ఖరారైంది. సున్నితంగా ఆలోచించరు ఎందుకు? పోలీసులు ఇంట్రెస్ట్ పెడితే తప్పకుండా చేయగలరు. అమ్మాయి కనపడట్లేదు అని తల్లిదండ్రులు కంప్లయింట్ ఇస్తే ఈ స్టేషన్ కాదు ఇంకో స్టేషన్ అని తప్పించుకోవడం ఎందుకు? ఇన్సిడెంట్ ఎక్కడ జరిగినా.. జ్యురిస్ సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్ లో అయినా రిపోర్ట్ తీసుకోవాలి అని స్పష్టంగా ఉంది కదా! సుప్రీం కోర్టే ఆర్డర్ ఇచి్చంతర్వాత కూడా ఈ కాలయాపన ఎందుకు? ఆడపిల్ల కనిపించకుండా పోయింది అనేది చాలా సీరియస్, సెన్సిటివ్ విషయం. ‘‘మీ అమ్మాయికి బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా?, లవ్ మ్యాటరా?, రెండ్రోజులాగి తనే వస్తుందిలెండి, పెళ్లిచేసుకొని మీకు ఫోన్ చేస్తుంది..’’ లాంటి ప్రశ్నలు అడగొచ్చా? బాయ్‌ఫ్రెండే ఉన్నాడనుకోండి, పెళ్లిచేసుకోవడానికే వెళ్లిందనుకోండి. పోలీసులు ముందు ప్రమాదాన్నయితే శంకించి జాడ తీయాలి కదా! సున్నితంగా ఆలోచించరెందుకు? ఫ్రెండ్లీ పోలీసే కాదు.. బాధ్యత గల పోలీసులూ కావాలి. ఏమైంది ఈ రోజు? మరో తల్లికి, తండ్రికి శోకం తప్ప ఏం మిగిలింది? నా బిడ్డ పోయినప్పుడు అనుకున్నాను.. ఇంకే పేరెంట్స్‌కీ ఇలాంటి అనుభవం ఎదురుకావొద్దు. మరే తల్లిదండ్రులకూ మా బాధ రాకూడదు అని. ఇప్పుడు దిశ వాళ్ల అమ్మానాన్నా అదే అనుకుంటున్నారు. నాడు నిర్భయ తల్లిదండ్రులూ అదే కోరుకున్నారు. కాని ఆగలేదు. దిశను తిరిగి తేలేం. ఆ అమ్మాయి తల్లిదండ్రుల బాధనూ తీర్చలేం. నిబ్బరంగా ఉండండి అని చెప్పడం తప్ప ఏం చేయగలుగుతున్నాం? కోపంగా, ఆవేశంగా కాదు... మాకు జరిగిన దారుణం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే ఇలాంటివెన్నో వింటున్నాం. అమ్మాయిలు బాగా చదివి, జీవితంలో చక్కగా స్థిరపడాలని కోరుకోవడం తప్పు కాదుకదా! ఆడపిల్లలు మగపిల్లలతో పోటీపడి ముందుండాలనుకోవడమూ పొరపాటు కావొద్దు కదా! ఇవన్నీ చూస్తుంటే ఆడపిల్లలను మళ్లీ గడపకే పరిమితం చేస్తారేమోననే దిగులు. ఓ బిడ్డను పోగొట్టుకున్న తండ్రిగా ఈ సమాజానికి నాదొక్కటే విన్నపం.. ఆడపిల్లల్ని బతకనిద్దాం. మనం సంట్రేట్ చేయాల్సింది ఆడపిల్లల మీద కాదు. మగపిల్లల మీద, వాళ్ల పెంపకం, ప్రవర్తన మీద. మగపిల్లాడు ఏం చేసినా చెల్లుతుంది అనే భావన పెంచొద్దు. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ సమానమే. ఇద్దరికీ ఒకే రెస్పెక్ట్ ఉండాలని తెలియచేయాలి. బాధను అనుభవించిన వాళ్లు చెబితే అర్థం అవుతుందని, అర్థం చేసుకుంటారని ముందుకొచ్చాను. ఒక అమ్మాయిని కోల్పోవడం ఆ కుటుంబానికే కాదు సమాజానికీ లోటే. ఒక అబ్బాయి నేరస్తుడవుతే ఇంటికే కాదు సమాజానికీ ప్రమాదమే! ఇలాంటి సంఘటనలు జరగగానే కోపం,ఆవేశం రావడం సహజమే. ఆ భావోద్వేగంలో నేరస్తులను పట్టుకొని నడిరోడ్డుమీద కొట్టాలి, చంపాలి అంటారు. నా బిడ్డ పోయినప్పుడు నాకూ అలాగే అనిపించింది. కాని ఇలాంటి ఆటవిక న్యాయం మరెన్నో ఘోరాలకు కారణమవుతుంది. మనకు చట్టాలున్నాయి. ఇలాంటి దారుణాలు మళ్లీ జరక్కుండా చూసే తీర్పులు కావాలి. అలాంటి చట్టాలు రావాలి. సత్వరంగా న్యాయం అందేలా ఉండాలి’’ అంటున్నారు మచిలీపట్టణంలోని నోబుల్ కాలేజ్ పొలిటికల్ సైన్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా రిటైరైన ఎస్.జి.ఎస్.ప్రసాద్. -
చంద్రభాన్కు ఈ నెల 30న శిక్ష ఖరారు
-
అనూహ్య వస్తువుల కోసం అన్వేషణ
సాక్షి, ముంబై: సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసులో నిందితుడు చంద్రభాన్ సానప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇప్పుడు ఆమె వస్తువుల ఆచూకీని కనుగొనడంపై దృష్టి సారించారు. అనూహ్యను హత్యచేసిన తరువాత చంద్రభాన్ ఆమె ల్యాప్‌టాప్, బ్యాగును తీసుకుని వెళుతూ.. మార్గం మధ్యలో ల్యాప్‌టాప్‌ను కల్యాణ్-షాపూర్ రహదారిపై విసిరేశాడు. బ్యాగును త్రయంబకేశ్వర్‌లో గుడి మెట్ల దగ్గర అడుక్కుంటున్న వృద్ధురాలికి ఇచ్చాడు. అనూహ్య బ్యాగును స్వాధీనం చేసుకున్నప్పటికీ.. అందులోని దుస్తులు లభించలేదు. దర్యాప్తులో భాగంగా ఆమె దుస్తులతోపాటు, ల్యాప్‌టాప్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు.. చంద్రభాన్ అనూహ్యను హత్యచేసిన తర్వాత ఆ విషయాన్ని తన భార్య, తల్లితోపాటు సన్నిహితులకు కూడా చెప్పినట్లు విచారణలో వెల్లడించాడు. తాగిన మైకంలో అఘాయిత్యానికి పాల్పడ్డానని, ఇక నుంచి మద్యాన్ని ముట్టుకోనని... మంచి మనిషిగా బతుకుతానని భార్య, తల్లికి హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. మచిలీపట్నానికి చెందిన అనూహ్య ఈ ఏడాది జనవరిలో ముంబైలో హత్యకు గురికాగా, దాదాపు రెండు నెలల తర్వాత నిందితుడు చంద్రభాన్‌ను పోలీసులు కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
అనూహ్య బ్యాగ్, లాప్టాప్ ఎత్తుకెళ్లాలనుకున్నాడు
-
బ్యాగ్, లాప్టాప్ ఎత్తుకెళ్లాలనుకున్నాడు
* అనూహ్య హంతకుడిమొదటి ఉద్దేశం ఇదే * సామగ్రితో బైక్‌పై ఉడాయించాలనుకున్నాడు * అవకాశం లేకపోవడంతోనే ఆమెను ఎక్కించుకున్నాడు ముంబై: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య (23) హత్య కేసులో నిందితుడైన చంద్రభాన్ సనప్ పోలీసుల విచారణలో కీలక వివరాలు వెల్లడించినట్లు ఓ జాతీయ ఆంగ్ల చానల్ తమ వెబ్సైట్లో పొందుపరిచింది. ముంబై క్రైం బ్రాంచికి చెందిన ఓ అధికారి తెలిపిన వివరాల ప్రకారం...వాస్తవానికి చంద్రభాన్ అనూహ్య బ్యాగ్, ల్యాప్‌టాప్‌ను చోరీ చేయాలనే పథకం వేసుకున్నాడు. ఆమెపై అత్యాచారయత్నం లేక హత్య చేయాలన్న ఉద్దేశం ఎంతమాత్రం లేదు. ప్లాట్ఫారం నుంచి బైక్ ఉన్న చోటుకు ఆమెను తీసుకొచ్చాక వస్తువులతో అతను ఉడాయించాలనుకున్నాడు. ఆమె బ్యాగ్‌ను లాక్కొని పెట్రోల్ ట్యాంక్‌పై పెట్టుకొని ఇంజిన్ స్టార్ట్ చేశాడు. దీంతో అతను సామానుతో ఉడాయిస్తాడని కంగారుపడిన అనూహ్య వెంటనే బైక్‌పై ఎక్కి కూర్చుంది. ఆమె స్పర్శ తగలడంతో చంద్రభాన్కు అనూహ్యను రేప్ చేయాలన్న దుర్బుద్ధి పుట్టింది. ట్యాక్సీలో తీసుకెళ్తానన్న చంద్రభాన్ చివరకు బైక్‌పై తీసుకెళ్తాననేసరికి అనూహ్య అవాక్కైందని అధికారి చెప్పారు. విచారణలో చంద్రభాన్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం వారిద్దరి మధ్య సంభాషణ ఇలా సాగింది. చంద్రభాన్: మేడం...మీరు ఎక్కడకి వెళ్లాలి?. అతని మాటలను అనూహ్య తొలుత పట్టించుకోలేదు. చంద్రభాన్: మేడం...ఎక్కడికి వెళ్లాలో చెప్పండి? నేను ట్యాక్సీ డ్రైవర్‌ను. చౌకగానే తీసుకెళ్తా అనూహ్య: అంధేరీ వెస్ట్ చంద్రభాన్: మంచిదైంది. నేను కూడా అంధేరీ వెళ్తున్నా. నా ట్యాక్సీ కూడా అక్కడిదే. 300 తీసుకుంటా. చంద్రభాన్ మాటలకు అనూహ్య స్పందించేలోగానే అతను ఆమె ట్రాలీ బ్యాగ్‌ను లాక్కుంటూ నడవడం మొదలుపెట్టాడు. దీంతో అనూహ్య అతని వెంట నడవడం మొదలుపెట్టింది. సెల్ఫోన్లో కుటుంబ సభ్యుడితో మాట్లాడుతూ అతని వివరాలు చెబుతున్నట్లు నటించింది. వారిద్దరూ స్టేషన్ బయటకు వచ్చాక ట్యాక్సీ బదులు బైక్ వద్ద చంద్రభాన్ నిలబడటం చూసి అనూహ్య అవాక్కైంది. ‘‘ట్యాక్సీ అని చెప్పావు ఇది బైక్ కదా’’ అంది. అందుకు చంద్రభాన్ స్పందిస్తూ ‘‘మేడం...ఇంత చౌకగా ట్యాక్సీలో ఈ వేళ ఎవరు దింపుతారు. పదండి. నా దగ్గర పెట్రోల్ కొట్టించేందుకు డబ్బులు కూడా లేవు. అందుకే ప్రయాణికుల కోసం వెతుకుతున్నా’’ అన్నాడు. అయితే ఆటో లేక ట్యాక్సీ కోసం అనూహ్య కాసేపు చూసినా ఏదీ కనిపించలేదు. దీంతో చంద్రభాన్ ఆమె బ్యాగ్‌ను వాహనంపై పెట్టుకున్నాడు. దీంతో ఆమె అతని బైక్ ఎక్కి కూర్చుంది. ఆ తర్వాత ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే జంక్షన్‌పై కంజూర్‌మార్గ్ వద్ద చంద్రభాన్ బైక్‌ను ఎడమ వైపు మలుపు తిప్పకపోవడంతో కంగారుపడిన అనూహ్య అతన్ని ప్రశ్నించింది. ‘‘ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తన్నావు? దీనికి చంద్రభాన్ బదులిస్తూ ‘‘మేడం ఇది షార్ట్‌కట్. మిమ్మల్ని 10 నిమిషాల్లో అంధేరీకి చేరుస్తా’’ అన్నాడు. అనూహ్య తండ్రిని కలిసిన ముంబై పోలీసు అధికారి మచిలీపట్నం, న్యూస్‌లైన్: అనూహ్య హత్య కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ముంబై కుర్లా పోలీస్‌స్టేషన్ క్రైం బ్రాంచ్ సీనియర్ ఇన్స్పెక్టర్ రాణే బుధవారం మచిలీపట్నం వచ్చారు. అనూహ్య తండ్రి ప్రసాద్‌ను కలిసి తమ వద్ద ఉన్న సమాచారాన్ని తెలిపి, ఫొటోలను చూపారు. అనూహ్య రైల్వే స్టేషన్లో దిగిన సమయంలో సీసీ కెమెరా ఫుటేజ్‌లు, ఆమె పక్కనే నడుస్తున్న చంద్రభాన్ ఫోటోను చూపారు. అనూహ్య హత్య తర్వాత చంద్రభాన్ గడ్డం పెంచుకుని, వేషం మార్చుకుని తిరిగిన విధానాన్ని వివరించారు. అనూహ్య మృతదేహం లభ్యమైన రెండో రోజునే చంద్రభాన్‌ను అదుపులోకి తీసుకున్నామని, అప్పటికి అతను గడ్డం పెంచుకుని ఉండటంతో గుర్తించలేకపోయామని వివరించారు. -
అనూహ్య హంతుకుడి అరెస్ట్
- రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిన ఆగంతుకుడే ఈ హంతకుడు - చంద్రభాన్ సానాప్ నాసిక్ నివాసి.. గతంలో రైల్వే కూలీ.. పాత నేరస్తుడు సాక్షి, ముంబై/మచిలీపట్నం: తెలుగమ్మాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య ముంబైలో దారుణ హత్యకు గురైన కేసును ఛేదించామని.. నిందితుడిని అరెస్ట్ చేశామని ముంబై పోలీసులు సోమవారం ప్రకటించారు. నిందితు డు పాత నేరస్థుడని.. అతడి పేరు చంద్రభాన్ సానాప్ అలియాస్ చౌక్యాసుదామ్ సానాప్ (28) అని గుర్తించామన్నారు. భాందూప్ సబర్బన్‌లోని కాంజూర్మార్గ్లో నిందితుడ్ని అదుపులోకి తీసుకుని ముంబైలోని ఖిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. నిందితుడిని ఈ నెల 15 వరకూ పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్మారియా చెప్పారు. అయితే.. తమ కుమార్తె హత్య కేసును ఛేదించినట్లు ముంబై పోలీసులు కట్టుకథ అల్లుతున్నారని అనూహ్య తండ్రి ఆరోపించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నివాసి అయిన సురేంద్రప్రసాద్ కుమార్తె, ముంబై సబర్బన్ గోరేగావ్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో పనిచేస్తున్న ఎస్తేర్ అనూహ్య (23) జనవరి ఐదో తేదీన ముంబై కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ) చేరుకున్న అనూహ్య అదృశ్యమై, ఆ తర్వాత శవమై కనిపించిన సంగతి తెలిసిందే. అనూహ్య అదృశ్యమైన 55 రోజుల తర్వాత, ఆమె మృతదేహం లభించిన 45 రోజుల తర్వాత.. సీసీటీవీ దృశ్యాల్లో కనిపించిన అనుమానితుడిని చంద్రభాన్ సానాప్గా గుర్తించామని.. అతడిని ఆదివారం కంజూర్‌మార్గ్ ఈస్ట్‌లో అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. నిందితుడు విచారణలో నేరం అంగీకరించాడన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు వాస్తవానికి కంజూర్‌మార్గ్‌లో స్లమ్ నివాసి. ప్రస్తుతం నాసిక్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలోని మఖమలాబాద్లో నివసిస్తున్నాడు. మద్యానికి బానిసై రైల్వేకూలీ బ్యాడ్జిని అమ్మేశాడు. ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తూ దొంగతనాలు, నేరాలకు పాల్పడుతుండేవాడు. అతడిపై.. ముంబైలోని గావ్‌దేవి పోలీస్‌స్టేషన్‌తో పాటు నాసిక్, మన్మాడ్, ఇటారసీ తదితర రైల్వే పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయి. ట్యాక్సీ అని చెప్పి మోటార్‌సైకిల్‌పై తీసుకెళ్లాడు!: ‘‘చంద్రభాన్ జనవరి నాలుగో తేదీన తన మిత్రులతో కలిసి మద్యం సేవించాడు. ఐదో తేదీ వేకువజామునే కుర్లాలోని ఎల్టీటీకి వచ్చి దొంగతనం చేసేందుకు ప్రయత్నించసాగాడు. అదే సమయంలో ఒంటరిగా ఉన్న అనూహ్యను చూశాడు. ఆమె అంధేరి వెళ్లనున్నట్లు తెలుసుకుని రూ. 300 చార్జీకి ఆమెను అంధేరిలో దింపుతానని చెప్పాడు. స్టేషన్ వెలుపల పార్కింగ్ ప్రదేశంలోకి వెళ్లాక.. ట్యాక్సీకి బదులు తన మోటారుసైకిల్ మీద అంధేరీ వెస్ట్‌కు తీసుకెళ్లి వదిలిపెడతానని నిందితుడు చెప్పాడు. అనూహ్య తొలుత నిరాకరించారు. అయితే నిందితుడు ఎలాంటి భయం అవసరం లేదంటూ ఆమెకు తన ఫోన్ నెంబరు, మోటర్ సైకిల్ నెంబరు ఇచ్చి ఒప్పించాడు. ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై గల కంజూర్‌మార్గ్ వరకు వెళ్లిన తర్వాత పెట్రోల్ అయిపోయినట్లుందని చెప్పి సర్సీస్ రోడ్డు పైకి బైకును మళ్లించాడు. అక్కడ నిర్జన ప్రదేశంలో ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. అనూహ్య తీవ్రంగా ప్రతిఘటించటంతో ఆమె తలను నేలకేసి కొట్టి, చున్నీ/స్కార్ఫ్‌తో ఆమె గొంతుకు ఉరి బిగించి చంపేశాడు. ఆ తర్వాత ల్యాప్‌టాప్‌తో ఉన్న బ్యాగ్‌ను తీసుకుని కంజూర్‌మార్గ్‌లోకి వెళ్లాడు. ఆమె వద్ద ఉన్న ఫోన్లో తన సెల్ నెంబరు ఉంటుందని భయపడి మళ్లీ ఘటనా స్థలానికి వచ్చాడు. అయితే ఆమె సెల్‌ఫోన్ కనిపించలేదు. దీంతో మోటర్‌సైకిల్‌లోని పెట్రోల్‌ను కొంత తీసి ఆమె జీన్స్‌పై పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించాడు. అనంతరం అక్కడి నుంచి కంజూర్‌మార్గ్‌లోని మిత్రుడు నందకిషోర్‌ను కలిసి అతని మోటర్‌సైకిల్ అతనికి ఇచ్చేశాడు. నందకిషోర్‌కు జరిగిందంతా చెప్పి అదే రోజు నాసిక్‌కు వెళ్లిపోయాడు. అనూహ్యకు సంబంధించిన లగేజీని భిక్షాటన చేసే ఓ మహిళకు ఇచ్చేశాడు’’ అని పోలీసులు వివరించారు. దర్యాప్తులో.. నిందితుడి నుంచి హతురాలి ట్రాలీ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కూడా చెప్పారు. అలాగే.. నిందితుడు వినియోగించిన మోటర్ సైకిల్ యజమాని నందకిషోర్ షావును సోమవారం జార్ఖండ్‌లో అదుపులోకి తీసుకుని ముంబైకి తెచ్చామన్నారు. నిందితుడ్ని పట్టుకునేందుకు సుమారు 36 సీసీటీవి ఫుటేజ్‌లను పరిశీలించామని, 2,500 మందిని విచారించామని, ఎట్టకేలకు సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో నిందితుడి ఆచూకీ కనుగొన్నామని పేర్కొన్నారు. అయితే.. చంద్రభాన్‌ను కేసు దర్యాప్తు మొదట్లోనే రైల్వే పోలీసులు విచారించి అనుమానం వ్యక్తంచేశారని.. దీనిపై కంజూర్‌మార్గ్ పోలీసులు స్పదించలేదని తెలుస్తోంది. ఈ విషయంపై విలేకరులు ప్రశ్నించినప్పటికీ.. పోలీస్ కమిషనర్ మారియా దాటవేసేందుకు యత్నించారు. కట్టుకథ అల్లారు: అనూహ్య తండ్రి అనూహ్య హత్య కేసులో నిందితుడి అరెస్ట్ అంటూ ముంబై పోలీసులు కట్టు కథ అల్లారని ఆమె తండ్రి సురేంద్రప్రసాద్ ఆరోపించారు. ఆయన సోమవారం మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. అనూహ్య రైల్వేస్టేషన్ నుంచి గుర్తుతెలియని వ్యక్తితో మోటార్‌సైకిల్‌పై వెళ్లినట్లు చెప్పటం నమ్మశక్యంగా లేదన్నారు. అనూహ్య వద్ద రెండు బ్యాగులు ఉన్నాయని.. ఒకటి పది కిలోల బరువు ఉంటుందని, ల్యాప్‌టాప్ ఉన్న మరో బ్యాగు ఐదు కిలోల బరువు ఉందని.. ఈ రెండు బ్యాగులతో మోటార్‌సైకిల్‌పై వెళ్లటం సాధ్యం కాదని ఆయన స్పష్టంచేశారు. అనూహ్యకు సంబంధించిన బ్యాగు లు, వాటిలోని వస్తువులు, ల్యాప్‌టాప్‌ను ముంబై పోలీసులు ఇంతవరకూ చూపలేదన్నారు. రైల్వేస్టేషన్ సీసీ కెమెరా ఫుటేజీలలో అనూహ్య ఫోన్లో మాట్లాడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని.. ఆ సమయంలో ఆమె ఏ నంబరుతో మాట్లాడిందీ.. ఆ నంబరు ఎవరిదీ.. అనే విషయాలు కూడా పోలీసులు వెల్లడించలేదని పేర్కొన్నారు. -
అనూహ్య హత్య కేసులో అనుమానితుడి చిత్రాలు విడుదల
సాక్షి, ముంబై: ముంబైలో దారుణ హత్యకు గురైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య కేసులో నిందితునిగా భావిస్తున్న వ్యక్తి చిత్రాలను పోలీసులు తాజాగా విడుదల చేశారు. హత్య జరిగి నెలరోజులైనా దర్యాప్తులో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు. ముంబైలోని కుర్ల రైల్వే టెర్మినస్‌లో సీసీటీవీలో ఫుటేజీల్లో అనూహ్యతో ఉన్న వ్యక్తిపైనే పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు అంతా అతడు ఎవరు? అన్న విషయం చుట్టూనే తిరుగుతోంది. అతడి ఆచూకీ తెలుసుకునేందుకు ఇప్పటికే ముంబై పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లోనూ విచారించి వచ్చారు. స్థానికంగానూ ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో అతడి చిత్రాలను విడుదల చేశారు. నిందితుని ఆచూకీ తెలిపిన వారికి రూ. 5 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచి డీసీపీ అంబాదాస్ పోటే ‘సాక్షి’కి తెలిపారు. మద్యం మత్తులో? సీసీటీవీ ఫుటేజీల్లో అనూహ్యతో కనిపించిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. అనూహ్య రాకముందు నుంచి అతడు అక్కడే ఉన్నాడని.. అనూహ్య వచ్చిన తర్వాత కూడా 30 నిమిషాలపాటు కుర్ల రైల్వే టెర్మినస్‌లో ఉన్నట్టు తెలిసింది. దీంతో పోలీసులు సమీపంలోని వైన్ షాప్‌లలో అతడి చిత్రాలను చూపించి ఆరా తీసినా వివరాలు తెలియరాలేదు. అత్యాచారం జరగలేదు.. అనూహ్య రక్త నమూనాల్లో ఆమె డీఎన్ఏ తప్ప వేరెవరి డీఎన్ఏ లభించలేదని.. దాంతో అనూహ్యపై అత్యాచారం జరగలేదని భావిస్తున్నారు. కాగా, అనూహ్య మృతదేహం బాగా కుళ్లిపోవడంతో అన్ని నమూనాలనూ పరీక్షించాల్సి వస్తోందని.. అందువల్లే నివేదికలో జాప్యమవుతోందని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ డెరైక్టర్ మాల్వే ‘సాక్షి’కి శుక్రవారం ఫోన్లో తెలిపారు. -
బందరులో ముంబై పోలీసుల విచారణ
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనూహ్య హత్య కేసుపై ముంబై పోలీసులు మచిలీపట్నంలో సోమవారం విచారణ నిర్వహించారు. ఈ కేసు విచారణ కోసం కంజూర్ పోలీస్‌స్టేషన్ సీఐ అశోక్, కోలీ, ఠాకూర్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఇక్కడికి వచ్చారు. స్థానిక పోలీసులకు కూడా తెలియకుండా పట్టణంలోని పలు ప్రాంతాల్లో తిరిగి అనూహ్యతో పాటు రైల్వేస్టేషన్లో నడిచి వెళ్లిన వ్యక్తి ఫొటో చూపి ‘ఈ వ్యక్తి ఈ ప్రాంతానికి చెందిన వాడేనా’ అంటూ ఆరా తీశారు. అనంతరం అనూహ్య తండ్రి ప్రసాద్ ఇంటికి వెళ్లి పోలీసులు రైల్వేస్టేషన్ సీసీ టీవీ నుంచి తీసుకున్న ఫుటేజీలను చూపి.. ‘అనూహ్యతో నడిచి వెళుతున్న వ్యక్తి మీకు తెలుసా లేదా, అనూహ్యతో పాటు నడిచి వెళ్లేది హేమంతేనా?’ అని ప్రశ్నించారు. అనూహ్యతో పాటు రైల్వేస్టేషన్లో నడిచి వెళ్లే వ్యక్తి హేమంత్ కాదని అనూహ్య తండ్రి ప్రసాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హేమంత్ తమ కుటుంబ సభ్యుల్లో ఒకడని, అసలు దోషులను వదిలేసి హేమంత్‌ను అనుమానించటం సరికాదని వారికి సూచించారు. అనూహ్య హత్య కేసులో పలువురిని అనుమానిస్తున్నామని, వారందరినీ విచారణ చేస్తామని, అందు లో హేమంత్ కూడా ఒకరని చెప్పి వెళ్లిపోయారు. ఐదు బృందాల గాలింపు... అనూహ్య హత్య కేసులో నిందితుల ఆచూకీ కోసం ఐదు పోలీసు బృందాలు వివిధ ప్రాంతాల్లో దర్యా ప్తు చేస్తున్నట్లు కంజూర్ పోలీస్ స్టేషన్ సీఐ అశోక్ విలేకరులకు తెలిపారు. అనూహ్య హత్య ఘటనపై కుంజూర్ పోలీస్‌స్టేషన్‌లోనే కేసు నమోదైందన్నారు. మచిలీపట్నంలో ఒక బృందం, హైదరాబాదులో రెండు బృందాలు అనూహ్య హత్య కేసులో నిందితులను కనుగొనేందుకు పర్యటిస్తున్నాయని ఆయన చెప్పారు. కుంజుమార్గ్ రైల్వేస్టేషన్‌లోని సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా అనూహ్యకు సమపంలో నడిచి వెళ్లే వ్యక్తి ఈ ప్రాంతానికి చెందిన వాడా, ఎవరికైనా ఇక్కడి వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయా అనే అంశంపై విచారించేందుకు వచ్చామన్నారు. 300 మందిని విచారించాం... అనూహ్య హత్యకేసులో ఇప్పటికి 300 మందిని విచారించామని సీఐ చెప్పారు. అనూహ్య స్నేహితుడు హేమంత్‌తో పాటు మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని ఆయన వివరించారు. మరో రెండు రోజుల పాటు ఈ ప్రాంతంలో ఉండి వివరాలు సేకరిస్తామన్నారు. బందరు డీఎస్పీ కేవీ శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ మురళీధర్, మచిలీపట్నం ఎస్సై శ్రీహరిలతో ముంబై నుంచి వచ్చిన పోలీసు బృందం సంప్రదింపులు జరుపుతోంది.