
అనూహ్య హత్య కేసులో అనుమానితుడి చిత్రాలు విడుదల
సాక్షి, ముంబై: ముంబైలో దారుణ హత్యకు గురైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య కేసులో నిందితునిగా భావిస్తున్న వ్యక్తి చిత్రాలను పోలీసులు తాజాగా విడుదల చేశారు. హత్య జరిగి నెలరోజులైనా దర్యాప్తులో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు. ముంబైలోని కుర్ల రైల్వే టెర్మినస్‌లో సీసీటీవీలో ఫుటేజీల్లో అనూహ్యతో ఉన్న వ్యక్తిపైనే పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
దర్యాప్తు అంతా అతడు ఎవరు? అన్న విషయం చుట్టూనే తిరుగుతోంది. అతడి ఆచూకీ తెలుసుకునేందుకు ఇప్పటికే ముంబై పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లోనూ విచారించి వచ్చారు. స్థానికంగానూ ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో అతడి చిత్రాలను విడుదల చేశారు. నిందితుని ఆచూకీ తెలిపిన వారికి రూ. 5 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచి డీసీపీ అంబాదాస్ పోటే ‘సాక్షి’కి తెలిపారు.
మద్యం మత్తులో?
సీసీటీవీ ఫుటేజీల్లో అనూహ్యతో కనిపించిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. అనూహ్య రాకముందు నుంచి అతడు అక్కడే ఉన్నాడని.. అనూహ్య వచ్చిన తర్వాత కూడా 30 నిమిషాలపాటు కుర్ల రైల్వే టెర్మినస్‌లో ఉన్నట్టు తెలిసింది. దీంతో పోలీసులు సమీపంలోని వైన్ షాప్‌లలో అతడి చిత్రాలను చూపించి ఆరా తీసినా వివరాలు తెలియరాలేదు.
అత్యాచారం జరగలేదు..
అనూహ్య రక్త నమూనాల్లో ఆమె డీఎన్‌ఏ తప్ప వేరెవరి డీఎన్‌ఏ లభించలేదని.. దాంతో అనూహ్యపై అత్యాచారం జరగలేదని భావిస్తున్నారు. కాగా, అనూహ్య మృతదేహం బాగా కుళ్లిపోవడంతో అన్ని నమూనాలనూ పరీక్షించాల్సి వస్తోందని.. అందువల్లే నివేదికలో జాప్యమవుతోందని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ డెరైక్టర్ మాల్వే ‘సాక్షి’కి శుక్రవారం ఫోన్‌లో తెలిపారు.