
'ఉరి శిక్ష విధిస్తారని అనుకోలేదు'
ముంబయి: ఉరి శిక్ష విధిస్తారని తాను అస్సలు ఊహించలేదని అనూహ్యపై అత్యాచారం చేసి ఆమెను హత్య చేసిన నేరస్తుడు చంద్రభాన్ అన్నాడు. తాను అసలు ఎలాంటి నేరం చేయలేదని అనవసరంగా తనపై ఈ నేరాన్ని రుద్దుతున్నారని చెప్పాడు. కోర్టు తీర్పు వినగానే కోర్టు హాల్లోనే కూలబడ్డ చంద్రభాన్ సనాప్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశాడు. మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అనూహ్యపై అత్యాచారం చేసి అనంతరం ఆమెను చంద్రభాన్ హత్య చేసినట్లు కోర్టు తేల్చిన విషయం తెలిసిందే.
ఈ కేసుకు సంబంధించి కోర్టు శుక్రవారం తీవ్రంగా స్పందించింది. ఈ కేసులో 2012నాటి ఢిల్లీ అత్యాచారానికి సంబంధించిన స్పందనే వచ్చిందని కోర్టు తెలిపింది. మహిళలకు సురక్షితంగా ఉన్న ముంబై ప్రతిష్టను ఈ నేరం దెబ్బతీసిందని కూడా కోర్టు పేర్కొంది. అతడు అరుదై నేరం చేశాడని, అందుకే ఉరి శిక్ష విధిస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు సమాజానికి ఓ సంకేతం కావాలని, గట్టి హెచ్చరిక గా ఉంటుందని పేర్కొంది.