న్యాయం చేయండి
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనూహ్య హత్యకేసులో ఆమె కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని మచిలీపట్నంలోని పలు కళాశాలల విద్యార్థినులు డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించారు. కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. విజయవాడలోనూ విద్యార్థినులు ప్రదర్శన, మానవహారం కార్యక్రమాలు నిర్వహించారు.
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఎస్తేరు అనూహ్య హత్యకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని పట్టణంలోని పలు కళాశాలల విద్యార్థులు డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద పలు కళాశాలల మహిళా విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ముంబై పోలీసుల డౌన్.. డౌన్... అనూహ్య కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. 15 రోజులు గడుస్తున్నా దోషులను పట్టుకోవడంలో ముంబై పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. అనూహ్య ఆచూకీ కోసం ఆమె తండ్రి ప్రసాద్ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, పోలీసులు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అనూహ్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనూహ్య కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి సాయం అందించాలని కోరారు. మహిళలు పనిచేస్తున్న ప్రాంతాల్లో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి భద్రత కల్పించాలన్నారు. ధర్నాలో పట్టణంలోని ఆర్‌కే, లేడియాంప్తిల్, హిందూ కళాశాలల విద్యార్థినులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అనూహ్య హత్యకు నిరసనగా విజయవాడలో స్టెల్లా కాలేజీ విద్యార్థులు మంగళవారం ప్రదర్శన నిర్వహించారు. బెంజిసర్కిల్ వద్ద మానవహారం నిర్వహించి అనూహ్య కేసులో నిందితులను వెంటనే పట్టుకోవాలని, కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు.