నిందితుడు చంద్రభాన్ - పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా
ముంబై: సంచలనం సృష్టించిన సాప్ట్వేర్ ఇంజనీర్ సింగవరపు ఎస్తేర్ అనూహ్య హత్య కేసు వివరాలను ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా ఈరోజు వెల్లడించారు. విజయవాడ నుంచి జనవరి 4న లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లిన అనూహ్య 5వ తేదీన ముంబైలో రైలు దిగి అదృశ్యమై, ఆ తరువాత దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నాసిక్కు చెందిన చంద్రభాన్ సాసప్ను పోలీసులు అరెస్ట్ చేసి ముంబైలోని ఖిల్లా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఈ నెల 15 వరకు నిందితుడికి పోలీస్ కస్టడి విధించింది. నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది.
పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా కథనం ప్రకారం చంద్రభాన్ ఓ రైల్వే కూలీ కుమారుడు. తండ్రి మరణం తరువాత అతని లైసెన్సును తన పేరుపై మార్చుకొని కొంత కాలం రైల్వే కూలీగా పని చేశాడు. ఆ తరువాత అతను కొంతకాలం కాల్ సెంటర్లకు క్యాబ్ డ్రైవర్గా పని చేశాడు. ప్రస్తుతం అతను తన మూడవ భార్యతో నాసిక్లో నివాసం ఉంటున్నాడు. అక్కడే ట్రాన్స్పోర్ట్స్ డ్రైవర్గా చేస్తున్నాడు.
చంద్రభాన్కు రైల్వేస్టేషన్లో బ్యాగులు, సెల్ ఫోన్లు దొంగిలించే అలవాటు ఉంది. అమ్మాయిలను వేధించే అలవాటు కూడా అతనికి ఉంది. అతనిపై ముంబై, మన్మాడ్ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు కూడా నమోదయ్యాయి. 5వ తేదీ ఉదయం తన మిత్రులతో కలసి ముంబై రైల్వే స్టేషన్కు వచ్చాడు. అనూహ్య అతని కంటపడింది. 300 రూపాయలు ఇస్తే ఆమెను ఇంటి వద్ద దింపుతానని చెప్పాడు. ఆమె బయటకు వచ్చేసరికి అతను మోటార్ బైకు తెచ్చాడు. దాంతో ఆమె వెనకాడింది. అయితే ఆమెకు అతను నచ్చజెప్పాడు. తన బైకు నంబర్, సెల్ నంబర్ నోట్ చేసుకోమని చెప్పాడు. అనూహ్య అమాయకంగా నమ్మి బైకు ఎక్కి వెళ్లింది. ఆమెను తిలక్ నగర్ వైపు తీసుకువెళ్లాడు. ఆ తరువాత బైకులో పెట్రోల్ అయిపోయిందని బైకును నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో ఆపి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. అనూహ్య ప్రతిఘటించింది. దాంతో ఆమెను చావబాది హత్య చేశాడు.