
ఢిల్లీ: యెమెన్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారతీయ నర్సుకు నిరాశే ఎదురైంది. ఆమె మరణశిక్షపై దాఖలు చేసిన అప్పీల్‌ను ఆ దేశ సుప్రీంకోర్టు తిరస్కరించింది. మరోవైపు తన కూతుర్ని విడిపించడానికి యెమెన్ వెళ్లాలని బాధితురాలి తల్లి చేసిన అభ్యర్థనపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని గురువారం కోరింది.
కేరళకు చెందిన నిమిషా ప్రియ అనే మహిళ తన పాస్‌పోర్ట్‌ను తిరిగి పొందే ప్రయత్నంలో తలాల్ అబ్దో మహదీ అనే వ్కక్తికి మత్తుమందు ఇచ్చి చంపినట్లు కోర్టు దోషిగా తేల్చింది. మరణశిక్ష విధించింది. ఈ కేసులో 2017 నుంచి నిమిషా ప్రియ యెమెన్‌లో జైలు శిక్ష అనుభవిస్తోంది.
అరబ్ దేశంలో అంతర్యుద్ధం కారణంగా 2017 నుంచి భారతీయ పౌరులకు ప్రయాణ నిషేధం ఉంది. అయినప్పటికీ యెమెన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ ప్రియా తల్లి ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రియను విడుదల చేయడానికి మహదీ కుటుంబంతో నష్టపరిహారం గురించి చర్చలు జరపడానికి యెమెన్ వెళ్లాలని కోరుకుంటోంది.
తన బిడ్డను కాపడటానికి తప్పకుండా యెమెన్ వెళ్లాల్సి ఉందని ధర్మాసనానికి ప్రియ తల్లి విన్నవించుకున్నారు. అందుకు ప్రయాణ నిషేధం అడ్డుగా ఉందని పేర్కొన్నారు. యెమెన్ ప్రయాణ నిషేధాన్ని సడలించవచ్చని ప్రభుత్వ తరుపు న్యాయవాది తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల్లో భారతీయులు యెమెన్ వెల్లడానికి ప్రభుత్వం అంగీకరించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
ప్రియా విడుదల కోసం "సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్" అనే బృందం 2022లో హైకోర్టును ఆశ్రయించింది. నిమిషా ప్రియను రక్షించేందుకు దౌత్యపరమైన జోక్యం చేసుకోవడంతో పాటు కేంద్రం చర్చలు జరపాలని కోరింది. అయితే.. ప్రియాను రక్షించడానికి పరిహారం గురించి చర్చలు జరపాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేయలేమని హైకోర్టు తెలిపింది. ఆమెను దోషిగా నిర్ధారించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని ధర్మాసనం వెల్లడించింది.
ఇదీ చదవండి: లాటరీలో రూ.45 కోట్లు గెలుచుకున్న కేరళవాసి
Comments
Please login to add a commentAdd a comment