లక్నో: నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష అమలు త్వరలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో నిర్భయ దోషుల్ని ఉంచిన తీహార్ జైలు అధికారులు ఇద్దరు తలారుల్ని పంపవలసిందిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. దీనికి స్పందించిన యూపీ అదనపు డైరెక్టర్ జనరల్ (జైళ్లు) ఆనంద్ కుమార్ తాము తలారుల్ని పంపడానికి సిద్ధంగా ఉన్నామని గురువారం విలేకరులకు వెల్లడించారు. తీహార్ జైల్లో ఉరిశిక్ష అమలు చేయడానికి తలారులు లేరు. అందుకే అవసరమైతే అతి తక్కువ కాల వ్యవధిలో చెప్పినా తలారుల్ని పంపాలంటూ ఢిల్లీ జైళ్ల శాఖ నుంచి తమకు డిసెంబర్ 9న ఫ్యాక్స్ ద్వారా ఒక లేఖ అందిందని ఆనంద్ కుమార్ వెల్లడించారు. అయితే ఆ లేఖలో నిర్భయ దోషుల ఉరి ప్రస్తావన లేదు. తలారుల అవసరం ఉందని మాత్రమే ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, లక్నో జైళ్లలో మాత్రమే తలారులు ఉన్నారు.
17న అక్షయ్ రివ్యూ పిటిషన్‌పై విచారణ
నిర్భయ దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ మరణ శిక్షను సమీక్షించాల్సిందిగా సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు 17న విచారణ జరపనుంది. ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతూ ఉండడంతో అందరి ఆయుష్షు తగ్గిపోతోందని, ఇక ఉరి తియ్యడమెందుకని అక్షయ్ ఆ పిటిషన్‌లో ప్రశ్నించారు. దీనిపై ఈ నెల 17, మధ్యాహ్నం ఓపెన్ కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే మిగిలిన దోషులు వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్ సింగ్‌లను ఉరి తియ్యడానికి న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. 2012 డిసెంబర్ 16 రాత్రి ఢిల్లీ బస్సులో నిర్భయను పాశవికంగా హత్యాచారం చేసిన విషయం తెలిసిందే.
‘ఉన్నావ్’ కన్నా ఘోరంగా చంపుతా!
బాగ్‌పత్: ‘నాకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెబితే.. ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కన్నా దారుణంగా చంపేస్తా’అని ఓ అత్యాచారం కేసులో నిందితుడు ఏకంగా బాధితురాలి ఇంటి గోడపై పోస్టర్ అతికించాడు. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో భయానికి గురైన బాధితురాలు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి, లేఖపై దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది ఢిల్లీలోని ముఖర్జీనగర్‌లో బాధితురాలు అత్యాచారానికి గురైనట్లు ఎస్పీ ప్రతాప్ గోపేంద్ర తెలిపారు. తన గ్రామానికే చెందిన నిందితుడు సోహ్రాన్ సింగ్ తన ఇంటి గోడపై బెదిరింపు లేఖ అతికించినట్లు బాధితురాలు పేర్కొన్నట్లు వివరించారు. గతేడాది ముఖర్జీనగర్‌లో బాధితురాలిని సోహ్రాన్ ఓ స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడని, పైగా వీడియో తీసి బెదిరిస్తున్నాడని తెలిపారు. ఈ కేసు ఢిల్లీ కోర్టులో శుక్రవారం విచారణకు రానుంది. ఈ కేసులో సోహ్రాన్ బుధవారమే బెయిల్‌పై బయటకు వచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment