jail department
-
చంద్రబాబుకు జైలే భద్రం
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించామని రాష్ట్ర జైళ్ల శాఖ పేర్కొంది. ఆయనకు భద్రతకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టంచేసింది. సెంట్రల్ జైల్లో తనకు భద్రత, ఆరోగ్యపరమైన ప్రమాదం ఉన్నందున హౌస్ రిమాండ్‌కు అనుమతించాలని కోరుతూ చంద్రబాబు న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో కల్పించిన భద్రత, వైద్య ఏర్పాట్లను వివరిస్తూ రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ హరీశ్‌కుమార్ గుప్తా లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాచారాన్ని అదనపు అడ్వొకేట్ జనరల్ విజయవాడ ఏసీబీ న్యాయస్థానానికి సమర్పించారు. ఆ వివరాల ప్రకారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు కల్పించిన భద్రత, వైద్యపరమైన ఏర్పాట్లు ఇలా ఉన్నాయి. ♦ రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు ప్రత్యేకంగా ఒక బ్లాక్‌లో వార్డ్ (గది) కేటాయించారు. ఆ బ్లాక్ ప్రధాన జైలుకు విడిగా ప్రత్యేకంగా ఉంటుంది. ♦ ఆ బ్లాక్‌ను, చంద్రబాబు ఉండే గదిని పూర్తిగా శానిటైజ్ చేసి శుభ్రపరిచారు. ♦ చంద్రబాబు ఉండే గది బయట సాయుధులైన సిబ్బందితో భద్రత కల్పించారు. 24 గంటలు భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ ప్రాంతానికి అనుమతి లేకుండా ఎవరినీ అనుమతించడం లేదు. ♦ చంద్రబాబు సమ్మతిస్తేనే ఆయన్ని కలిసేందుకు ఎవరినైనా అనుమతిస్తున్నారు. ♦ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌తోపాటు సీనియర్ అధికారులు భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ♦ ఆ గది బయట, చుట్టూ సీసీటీవీలు ఏర్పాటు చేసి 24 గంటలు భద్రతను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ♦ ఆ ప్రత్యేక గదికి సమీపంలోనే వైద్యబృందం 24 గంటలు అందుబాటులో ఉంది. ♦ న్యాయస్థానం ఆదేశాలమేరకు చంద్రబాబుకు పూర్తి భద్రత కల్పించి, తగిన వైద్యసేవలను అందుబాటులో ఉంచారు. -
ఏపీ జైళ్ల శాఖ అన్ని రాష్ట్రాలకు ఆదర్శం
దొండపర్తి(విశాఖదక్షిణ)/ఆరిలోవ(విశాఖ తూర్పు)/కొవ్వూరు: ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ డెవలప్మెంట్, ఏపీ జైళ్లశాఖ సంయుక్తంగా విశాఖపట్నంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న అన్ని రాష్ట్రాల జైళ్ల అధిపతుల 8వ జాతీయ సదస్సు మంగళవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జైళ్ల శాఖలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రధానంగా వర్చువల్ విధానంలో కోర్టు కేసుల విచారణను ప్రారంభించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందిందని చెప్పారు. ఖైదీలను దండించడానికే కాకుండా జైళ్లలో వారి సంక్షేమానికి కూడా చర్యలు తీసుకోవడం మంచి పరిణామమని ప్రశంసించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఖైదీలకు కార్పొరేట్ వైద్యంతోపాటు శిక్ష పూర్తయిన అనంతరం వారి జీవనోపాధికి ఉపయోగపడేలా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుండటం మంచి ఆలోచన అని అన్నారు. ఇటువంటి సంస్కరణలతో ఖైదీల్లో పరివర్తనతోపాటు పునరావాసానికి అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్ బాలాజీ శ్రీవాత్సవ్, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీ‹Ùకుమార్ గుప్తా, అన్ని రాష్ట్రాల జైళ్ల అధిపతులు పాల్గొన్నారు. జైలులో చంద్రబాబుకు పూర్తి భద్రత: హోంమంత్రి వనిత రాజమండ్రి కేంద్ర కారాగారంలో చంద్రబాబుకు పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. జైలులో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు ఉన్నాయని, అక్కడ చంద్రబాబుకు ఎలాంటి ప్రాణహాని లేదని స్పష్టంచేశారు. ఆయన భద్రత పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. చంద్రబాబు కుంభకోణాలు వరుసగా బయటపడుతున్నప్పటికీ ఇంకా ఆయన నిప్పు అంటూ ప్రజలను నమ్మించాలని టీడీపీ నేతలు, పచ్చమీడియా అష్టకష్టాలు పడుతున్నట్లు ఎద్దేవా చేశారు. ఇన్ని కుంభకోణాలకు పాల్పడిన బాబు నిప్పా? అని ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. స్కామ్‌లన్నీ బయటపడితే టీడీపీ ఉనికి కోల్పోతుందనే భయంతో లోకేశ్, బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని ధ్వజమెత్తారు. -
Ongole: ఇది ఖైదీల బంక్..! రోజుకు రూ.5 లక్షల అమ్మకాలు..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు సంతపేటలోని జిల్లా జైలు వద్ద ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌ను ఖైదీలే నిర్వహిస్తున్నారు. వాహనాల్లో పెట్రోల్, డీజిల్ నింపేవారు.. వాహనాలకు గాలి పట్టే వారితోపాటు క్యాష్ కౌంటర్లో ఉండే వ్యక్తి వరకు అందరూ జీవిత ఖైదు అనుభవిస్తున్న వారే కావడం విశేషం. 2018లో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ బంక్ ఏర్పాటు చేయగా.. ఈ బంక్‌లో స్రత్పవర్తనతో పని చేయడం ద్వారా ఏడుగురు ఖైదీలు శిక్ష తగ్గి ఇళ్లకు వెళ్లిపోయారు. మరో నలుగురికి సైతం శిక్షలు తగ్గి ఇళ్లకు వెళ్లేందుకు అర్హత సాధించారు. ప్రస్తుతం ఇందులో 10 మంది పని చేస్తున్నారు. నిత్యం రూ.5 లక్షల విలువైన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక్కడ పని చేసినందుకు గాను ప్రతి ఖైదీ రోజుకు రూ.200 ఆదాయాన్ని కూడా సమకూర్చుకుంటున్నారు. ఈ బంక్ ద్వారా జైళ్ల శాఖకు నెలకు సుమారు రూ.2.50 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. ఇక్కడ పనిచేస్తే మంచి మార్కులు జీవిత ఖైదీలుగా శిక్ష అనుభవిస్తూ మంచి ప్రవర్తనతో మెలుగుతున్న వారిని మాత్రమే ఆరు బయట ఖైదీలుగా ఎంపిక చేసి పెట్రోల్ బంక్‌లో పనిచేసే అవకాశం కల్పిస్తోంది జైళ్ల శాఖ. బంక్‌లో నెల రోజులపాటు ఖైదీలు పనిచేస్తే 8 రోజుల చొప్పున శిక్ష తగ్గుతుంది. ఎన్ని నెలలు పనిచేస్తే అన్ని నెలలపాటు 8 రోజుల చొప్పున తగ్గించుకుంటూ వెళతారు. దీంతోపాటు ప్రత్యేకంగా సంవత్సరంలో మరో 30 రోజుల శిక్ష తగ్గించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. రాష్ట్ర ఉన్నతాధికారులు సైతం ప్రత్యేకంగా మరో 60 రోజులపాటు శిక్షను తగ్గించే వెసులుబాటు ఉంది. పెరోల్‌పై 14 రోజుల పాటు ఖైదీలు తమ ఇళ్లకు వెళ్లి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. ఆ కాలాన్ని కూడా శిక్షలో తగ్గించేలా వెసులుబాటు కలి్పస్తారు. మొత్తం మీద శిక్షపడిన మూడేళ్ల నుంచి ఈ తగ్గింపు శిక్ష కార్యక్రమాన్ని అమల్లోకి తెస్తారు. మొత్తం మీద శిక్షను తగ్గించే వెసులుబాటు విధించిన శిక్ష కంటే మూడో వంతుకు తక్కువగా ఉంటుంది. ద్విచక్ర వాహనాలకు గాలి పడుతున్న ఖైదీ సుబ్బయ్య స్రత్పవర్తనతో మెలుగుతున్నా హత్య కేసులో నాకు శిక్ష పడింది. ఇప్పటికే పదేళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాను. మంచి ప్రవర్తనతో మెలుగుతుండటంతో ఇక్కడి అధికారులు పెట్రోల్ బంక్‌లో పనిచేసే అవకాశం కల్పించారు. – డి.సుధాకర్, చీరాల, జీవిత ఖైదీ పశ్చాత్తాప పడుతున్నా క్షణికావేశంలో తప్పు చేశా. కుటుంబాలకు దూరమై బాధ పడుతున్నాం. జీవితంలో ఎలాంటి తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నా. ఖైదీలతోపాటు వారి కుటుంబాలు కూడా ఇళ్ల వద్ద ఉండి శిక్ష అనుభవిస్తున్నాయి. శిక్ష పడి ఏడేళ్లు పూర్తయింది. మంచి ప్రవర్తనతో మెలగడంతో పెట్రోల్ బంక్‌లో పనిచేసే అవకాశం కలిగింది. – జి.సుబ్బయ్య, అర్ధవీడు, జీవిత ఖైదీ పరివర్తన తీసుకొచ్చే దిశగా.. ఈ బంక్‌లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మూడు షిఫ్టుల్లో ఖైదీలు పని చేస్తారు. శిక్ష అనుభవిస్తున్న వారిలో పరివర్తన తీసుకొచ్చేలా తీర్చిదిద్దుతున్నాం. వారి ప్రవర్తనను బట్టి ఆరుబయట ఖైదీలుగా మెలిగే వెసులుబాటు కల్పిస్తున్నాం. జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిని మంచి ప్రవర్తనను బట్టి మార్కులు వేస్తాం. తదనుగుణంగా వారి శిక్షాకాలం తగ్గుతుంది. – పి.వరుణారెడ్డి, జైలు సూపరింటెండెంట్ చదవండి: ఓర్చుకోలేక.. ‘ఈనాడు’ విషపు రాతలు.. సీమను సుభిక్షం చేస్తున్నదెవ్వరు? -
త్వరలో నిర్భయ దోషులకు ఉరి అమలు ?
లక్నో: నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష అమలు త్వరలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో నిర్భయ దోషుల్ని ఉంచిన తీహార్ జైలు అధికారులు ఇద్దరు తలారుల్ని పంపవలసిందిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. దీనికి స్పందించిన యూపీ అదనపు డైరెక్టర్ జనరల్ (జైళ్లు) ఆనంద్ కుమార్ తాము తలారుల్ని పంపడానికి సిద్ధంగా ఉన్నామని గురువారం విలేకరులకు వెల్లడించారు. తీహార్ జైల్లో ఉరిశిక్ష అమలు చేయడానికి తలారులు లేరు. అందుకే అవసరమైతే అతి తక్కువ కాల వ్యవధిలో చెప్పినా తలారుల్ని పంపాలంటూ ఢిల్లీ జైళ్ల శాఖ నుంచి తమకు డిసెంబర్ 9న ఫ్యాక్స్ ద్వారా ఒక లేఖ అందిందని ఆనంద్ కుమార్ వెల్లడించారు. అయితే ఆ లేఖలో నిర్భయ దోషుల ఉరి ప్రస్తావన లేదు. తలారుల అవసరం ఉందని మాత్రమే ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, లక్నో జైళ్లలో మాత్రమే తలారులు ఉన్నారు. 17న అక్షయ్ రివ్యూ పిటిషన్‌పై విచారణ నిర్భయ దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ మరణ శిక్షను సమీక్షించాల్సిందిగా సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు 17న విచారణ జరపనుంది. ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతూ ఉండడంతో అందరి ఆయుష్షు తగ్గిపోతోందని, ఇక ఉరి తియ్యడమెందుకని అక్షయ్ ఆ పిటిషన్లో ప్రశ్నించారు. దీనిపై ఈ నెల 17, మధ్యాహ్నం ఓపెన్ కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే మిగిలిన దోషులు వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్ సింగ్‌లను ఉరి తియ్యడానికి న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. 2012 డిసెంబర్ 16 రాత్రి ఢిల్లీ బస్సులో నిర్భయను పాశవికంగా హత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ‘ఉన్నావ్’ కన్నా ఘోరంగా చంపుతా! బాగ్పత్: ‘నాకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెబితే.. ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కన్నా దారుణంగా చంపేస్తా’అని ఓ అత్యాచారం కేసులో నిందితుడు ఏకంగా బాధితురాలి ఇంటి గోడపై పోస్టర్ అతికించాడు. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో భయానికి గురైన బాధితురాలు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి, లేఖపై దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది ఢిల్లీలోని ముఖర్జీనగర్‌లో బాధితురాలు అత్యాచారానికి గురైనట్లు ఎస్పీ ప్రతాప్ గోపేంద్ర తెలిపారు. తన గ్రామానికే చెందిన నిందితుడు సోహ్రాన్ సింగ్ తన ఇంటి గోడపై బెదిరింపు లేఖ అతికించినట్లు బాధితురాలు పేర్కొన్నట్లు వివరించారు. గతేడాది ముఖర్జీనగర్‌లో బాధితురాలిని సోహ్రాన్ ఓ స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడని, పైగా వీడియో తీసి బెదిరిస్తున్నాడని తెలిపారు. ఈ కేసు ఢిల్లీ కోర్టులో శుక్రవారం విచారణకు రానుంది. ఈ కేసులో సోహ్రాన్ బుధవారమే బెయిల్‌పై బయటకు వచ్చాడు. -
జైళ్ల శాఖకు రూ.17 కోట్ల ఆదాయం: డీజీ వినయ్‌కుమార్ సింగ్
హైదరాబాద్: తెలంగాణ జైళ్ల శాఖ ఆదాయం 2014లో రూ.3 కోట్లు ఉండగా, 2018లో రూ.17 కోట్ల ఆదాయం గడించామని ఆ శాఖ డీజీ వినయ్‌కుమార్ సింగ్ చెప్పారు. గురువారం చంచల్ గూడలోని సీకా కార్యాలయంలో ఏర్పాటు చేసిన వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖైదీల ఆరోగ్యం పట్ల జైళ్ల శాఖ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుండటంతో కొన్నేళ్లుగా మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. మరణాల సంఖ్య 2014లో 56 ఉండగా, 2018లో కేవలం 8 ఉందన్నారు. ఈ ఏడాది 100 పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇటీవల రాష్ట్ర జైళ్లను సందర్శించిన బంగ్లాదేశ్, తీహార్ జైలు అధికారులు తెలంగాణ జైళ్ల శాఖ పనితీరును అభినందించారన్నారు. జైళ్ల శాఖ నిర్వహిస్తున్న పరిశ్రమలు, పెట్రోల్ బంక్‌ల ద్వారా 2018లో రూ.496 కోట్ల టర్నోవర్ సాధించామని, ఇందులో రూ.17 కోట్ల 72 లక్షల లాభం పొందినట్లు తెలిపారు. 2018లో 34 మంది ఖైదీలకు రూ.8 లక్షల రుణాల ఇచ్చినట్లు, విద్యాదానం ద్వారా 22 వేల మంది ఖైదీలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. -
ఖైదీల్లో మార్పునకు కృషిచేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఖైదీల్లో సత్ప్రవర్తన కోసం అధికారులు కృషిచేయాలని రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వినయ్‌కుమార్‌సింగ్ ఆదేశించారు. సోమవారం జిల్లా జైలును సందర్శించిన ఆయనకు సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జైలు రిజిస్ట్రర్లను పరిశీలించిన ఆయన ఖైదీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో ఆయన మాట్లాడుతూ ఖైదీలతో మృదువుగా వ్యవహరించాలని సూచించారు. తాము చేసిన తప్పును తెలుసుకుని çపశ్చతాప పడేవిధంగా వారిలో మార్పు తీసుకురావాలన్నారు. వారికి ప్రభుత్వం ప్రకటించే నాణ్యమైన భోజనం పెట్టాలన్నారు. ఖైదీల్లో దాగి ఉన్న నైపుణ్యం వెలికితీసే కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. జిల్లా జైలులో ఖైదీలకు అధికారులు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఖైదీల జీవన ప్రయోజనం కోసం మరో నూతన బారక్ను నిర్మించనున్నట్లు అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. యాచకులు, ఆయుర్వేదిక విలేజీ పబ్లిక్ కోసం ఆనంద్ ఆశ్రమాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. ఖైదీలు జైలు నుంచి బయటకు వెళ్లిన తర్వాత తమ కాళ్లపై తాము నిలబడి జీవించే విధంగా తయారు చేయాలని కోరారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ శివకుమార్‌గౌడ్, జైలర్లు శ్రీనునాయక్, వెంకటేశ్వరస్వామి, డిప్యూటీ జైలర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఏపీలో జైళ్లను ఆధునీకరిస్తాం’
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని జైళ్లన్నింటినీ ఆధునీకరిస్తామని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప చెప్పారు. విజయవాడలో రూ.1.50 లక్షలతో ఆధునీకరించిన జిల్లా జైలును ఆయన సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ నడిబొడ్డున ఉన్న జైళ్లను శివారు ప్రాంతాలకు తరలించి అన్ని సౌకర్యాలతో నిర్మిస్తామన్నారు. అలాగే ఖైదీలలో సత్ప్రవర్తన తీసుకువచ్చే బాధ్యత జైలు సిబ్బందిదేనని చెప్పారు. -
ఖైదీలకు ఫోన్ సౌకర్యం
కడప అర్బన్, న్యూస్‌లైన్: కడప కేంద్ర కారాగారంలో ఖైదీలకు గురువారం ఫోన్ సౌకర్యం కల్పించారు. ఖైదీల ఫోన్ సౌకర్యం యూనిట్‌ను జైళ్లశాఖ డీఐజీ జయవర్ధన్ కేంద్ర కారాగార సూపరింటెండెంట్ గోవిందరాజులు చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. అనంతరం ఫోన్ క్యాబిన్‌ను డీఐజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారానికి రెండుసార్లు ఖైదీలకు తమ బంధువులతో ఒక్కొక్కసారి ఐదు నిముషాల చొప్పున ఫోన్లో మాట్లాడే సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఖైదీలు మాట్లాడుకునే సమయంలో కారాగార సిబ్బంది పర్యవేక్షిస్తుంటారన్నారు. జీవిత ఖైదు, రిమాండు అనుభవిస్తున్న వారికి మాత్రమే ఈ ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. తీవ్రవాదులు, దేశద్రోహ, మావోయిస్టు, దోపిడీలు, స్మగ్లింగ్ కేసులలో శిక్ష అనుభవిస్తున్న వారికి ఫోన్లో మాట్లాడే అవకాశం ఉండదన్నారు. ఈ అవకాశాన్ని ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కేంద్ర కారాగార సూపరింటెండెంట్ గోవిందరాజులు, డిప్యూటీ సూపరింటెండెంట్ వెంకట్రాజు, జైలర్లు, డిప్యూటీ జైలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఆనందంగా ఉంది కేంద్ర కారాగారానికి మూడేళ్ల క్రితం శిక్ష అనుభవించేందుకు వచ్చాను. అప్పటి నుంచి మా బంధువులు అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటారు. ఫోన్లో మా బిడ్డలతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. - వెంకట నారాయణరెడ్డి, జీవితఖైదీ, కడప మా విజ్ఞప్తి ఫలించింది నాలుగేళ్లుగా కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాను. మా ఊరి నుంచి బిడ్డలు, బంధువులు వచ్చి వెళ్లేందుకు ఎంతో ఖర్చవుతోంది. ఎన్నోసార్లు జైలు అధికారులకు త మగోడు విన్నవించుకున్నాం. చివరకు ప్రభుత్వం అంగీకరించి ఫోన్ సౌకర్యాన్ని కల్పించడం ఎంతో ఆనందంగా ఉంది. - పూల లక్ష్మిదేవి, జీవిత ఖైదీ, ప్రకాశం జిల్లా -
విశాఖలో 4 రాష్ట్రాల జైళ్ల డీజీల భేటీ
ఖైదీల ప్రవర్తనలో మార్పు, సిబ్బంది సంక్షేమంపై చర్చ విశాఖపట్నం నాలుగు రాష్ట్రాలకు చెందిన ై జెళ్ల శాఖ డీజీలు సోమవారం ఇక్కడి రుషికొండలోని ఏపీ టూరిజం హోటల్ (హరితా రిసార్ట్స్)లో సమావేశమయ్యారు. అకాడెమీ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షన్ అడ్మినిస్ట్రేషన్ (ఆప్కా) ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జైళ్ల శాఖ డీజీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రతి ఏడాది ఈ రాష్ట్రాల్లో జైళ్ల శాఖకు సంబంధించిన విషయాలపై చర్చించడానికి ఏదో ఒక ప్రాంతంలో సమావేశమవుతుంటారు. ఈ ఏడాది విశాఖలోని సాగర తీరంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా తమిళనాడు రాష్ట్రం రాయవెల్లూరులో ఉన్న జైళ్ల శాఖ సిబ్బంది శిక్షణ కేంద్రం గురించి చర్చించారు. జెళ్ల శాఖలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి, సిబ్బంది శిక్షణలో కొత్త పద్ధతులు, ఖైదీల ప్రవర్తనలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి తదితర అంశాలపై చర్చించారు. సిబ్బంది సంక్షేమం, జీతభత్యాలు, పదోన్నతులపై చర్చించారు. ఈ సమావేశంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డీజీలు ఎస్.జార్జి, టి.పి సన్‌కుమార్, కె.వి గగన్‌దీప్, టి.కృష్ణంరాజుతో పాటు న్యూడిల్లీ జైళ్ల శాఖ డెరైక్టర్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్ సింగ్, రాయవెల్లూరు శిక్షణ కేంద్రం డెరైక్టర్ డాక్టర్ ఎం.ఆర్.అహ్మద్, ఏపీ కోస్తాంధ్రా డీఐజీ ఎ.నర్సింహ, విశాఖ సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ ఇండ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.