కడప అర్బన్, న్యూస్‌లైన్: కడప కేంద్ర కారాగారంలో ఖైదీలకు గురువారం ఫోన్ సౌకర్యం కల్పించారు. ఖైదీల ఫోన్ సౌకర్యం యూనిట్‌ను జైళ్లశాఖ డీఐజీ జయవర్ధన్ కేంద్ర కారాగార సూపరింటెండెంట్ గోవిందరాజులు చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. అనంతరం ఫోన్ క్యాబిన్‌ను డీఐజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారానికి రెండుసార్లు ఖైదీలకు తమ బంధువులతో ఒక్కొక్కసారి ఐదు నిముషాల చొప్పున ఫోన్‌లో మాట్లాడే సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.
ఖైదీలు మాట్లాడుకునే సమయంలో కారాగార సిబ్బంది పర్యవేక్షిస్తుంటారన్నారు. జీవిత ఖైదు, రిమాండు అనుభవిస్తున్న వారికి మాత్రమే ఈ ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. తీవ్రవాదులు, దేశద్రోహ, మావోయిస్టు, దోపిడీలు, స్మగ్లింగ్ కేసులలో శిక్ష అనుభవిస్తున్న వారికి ఫోన్‌లో మాట్లాడే అవకాశం ఉండదన్నారు. ఈ అవకాశాన్ని ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కేంద్ర కారాగార సూపరింటెండెంట్ గోవిందరాజులు, డిప్యూటీ సూపరింటెండెంట్ వెంకట్రాజు, జైలర్లు, డిప్యూటీ జైలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆనందంగా ఉంది
కేంద్ర కారాగారానికి మూడేళ్ల క్రితం శిక్ష అనుభవించేందుకు వచ్చాను. అప్పటి నుంచి మా బంధువులు అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటారు. ఫోన్‌లో మా బిడ్డలతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది.
- వెంకట నారాయణరెడ్డి, జీవితఖైదీ, కడప
మా విజ్ఞప్తి ఫలించింది
నాలుగేళ్లుగా కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాను. మా ఊరి నుంచి బిడ్డలు, బంధువులు వచ్చి వెళ్లేందుకు ఎంతో ఖర్చవుతోంది. ఎన్నోసార్లు జైలు అధికారులకు త మగోడు విన్నవించుకున్నాం. చివరకు ప్రభుత్వం అంగీకరించి ఫోన్ సౌకర్యాన్ని కల్పించడం ఎంతో ఆనందంగా ఉంది.
- పూల లక్ష్మిదేవి, జీవిత ఖైదీ, ప్రకాశం జిల్లా
ఖైదీలకు ఫోన్ సౌకర్యం
Published Fri, May 9 2014 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 7:05 AM
Advertisement
Advertisement