దొండపర్తి(విశాఖదక్షిణ)/ఆరిలోవ(విశాఖ తూర్పు)/కొవ్వూరు: ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ డెవలప్‌మెంట్, ఏపీ జైళ్లశాఖ సంయుక్తంగా విశాఖపట్నంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న అన్ని రాష్ట్రాల జైళ్ల అధిపతుల 8వ జాతీయ సదస్సు మంగళవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జైళ్ల శాఖలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని తెలిపారు.
ప్రధానంగా వర్చువల్ విధానంలో కోర్టు కేసుల విచారణను ప్రారంభించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందిందని చెప్పారు. ఖైదీలను దండించడానికే కాకుండా జైళ్లలో వారి సంక్షేమానికి కూడా చర్యలు తీసుకోవడం మంచి పరిణామమని ప్రశంసించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఖైదీలకు కార్పొరేట్ వైద్యంతోపాటు శిక్ష పూర్తయిన అనంతరం వారి జీవనోపాధికి ఉపయోగపడేలా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుండటం మంచి ఆలోచన అని అన్నారు.
ఇటువంటి సంస్కరణలతో ఖైదీల్లో పరివర్తనతోపాటు పునరావాసానికి అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ జనరల్ బాలాజీ శ్రీవాత్సవ్, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీ‹Ùకుమార్ గుప్తా, అన్ని రాష్ట్రాల జైళ్ల అధిపతులు పాల్గొన్నారు.
జైలులో చంద్రబాబుకు పూర్తి భద్రత: హోంమంత్రి వనిత
రాజమండ్రి కేంద్ర కారాగారంలో చంద్రబాబుకు పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. జైలులో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు ఉన్నాయని, అక్కడ చంద్రబాబుకు ఎలాంటి ప్రాణహాని లేదని స్పష్టంచేశారు. ఆయన భద్రత పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు.
చంద్రబాబు కుంభకోణాలు వరుసగా బయటపడుతున్నప్పటికీ ఇంకా ఆయన నిప్పు అంటూ ప్రజలను నమ్మించాలని టీడీపీ నేతలు, పచ్చమీడియా అష్టకష్టాలు పడుతున్నట్లు ఎద్దేవా చేశారు. ఇన్ని కుంభకోణాలకు పాల్పడిన బాబు నిప్పా? అని ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. స్కామ్‌లన్నీ బయటపడితే టీడీపీ ఉనికి కోల్పోతుందనే భయంతో లోకేశ్, బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment