సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించామని రాష్ట్ర జైళ్ల శాఖ పేర్కొంది. ఆయనకు భద్రతకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టంచేసింది. సెంట్రల్ జైల్లో తనకు భద్రత, ఆరోగ్యపరమైన ప్రమాదం ఉన్నందున హౌస్ రిమాండ్‌కు అనుమతించాలని కోరుతూ చంద్రబాబు న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబుకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో కల్పించిన భద్రత, వైద్య ఏర్పాట్లను వివరిస్తూ రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ హరీశ్‌కుమార్ గుప్తా లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాచారాన్ని అదనపు అడ్వొకేట్ జనరల్ విజయవాడ ఏసీబీ న్యాయస్థానానికి సమర్పించారు. ఆ వివరాల ప్రకారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు కల్పించిన భద్రత, వైద్యపరమైన ఏర్పాట్లు ఇలా ఉన్నాయి.
♦ రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు ప్రత్యేకంగా ఒక బ్లాక్‌లో వార్డ్ (గది) కేటాయించారు. ఆ బ్లాక్ ప్రధాన జైలుకు విడిగా ప్రత్యేకంగా ఉంటుంది.
♦ ఆ బ్లాక్‌ను, చంద్రబాబు ఉండే గదిని పూర్తిగా శానిటైజ్ చేసి శుభ్రపరిచారు.
♦ చంద్రబాబు ఉండే గది బయట సాయుధులైన సిబ్బందితో భద్రత కల్పించారు. 24 గంటలు భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ ప్రాంతానికి అనుమతి లేకుండా ఎవరినీ అనుమతించడం లేదు.
♦ చంద్రబాబు సమ్మతిస్తేనే ఆయన్ని కలిసేందుకు ఎవరినైనా అనుమతిస్తున్నారు.
♦ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌తోపాటు సీనియర్ అధికారులు భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
♦ ఆ గది బయట, చుట్టూ సీసీటీవీలు ఏర్పాటు చేసి 24 గంటలు భద్రతను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
♦ ఆ ప్రత్యేక గదికి సమీపంలోనే వైద్యబృందం 24 గంటలు అందుబాటులో ఉంది.
♦ న్యాయస్థానం ఆదేశాలమేరకు చంద్రబాబుకు పూర్తి భద్రత కల్పించి, తగిన వైద్యసేవలను అందుబాటులో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment