jayavardhan
-
మాయలో పడ్డారు
అరుణ్ గుప్తా, సావేరి, జయవర్థన్ ముఖ్య తారలుగా రూపొందుతోన్న లవ్ ఎంటర్టైనర్ ‘పడిపోయా నీ మాయలో’. ఆర్.కె. కాంపల్లి దర్శకత్వంలో మహేశ్ పైడ, భరత్ అంకతి నిర్మిస్తున్నారు. జయవర్ధన్ స్వరపరచిన ఈ సినిమా పాటలను తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ రిలీజ్ చేశారు. తొలి సీడీని దర్శకుడు ఎన్.శంకర్ అందుకున్నారు. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ– ‘‘సినిమా రంగం కొన్ని కుటుంబాలకే పరిమితమైపోతున్న ఈరోజుల్లో తెలంగాణ యువత సినిమా తీయడానికి ముందుకు రావడం గొప్ప పరిణామం. తెలంగాణ వారికి తపన ఉన్నప్పటికీ గతంలో అవకాశాలు అరుదుగా ఉండేవి. ఇప్పుడా పరిస్థితులు లేవు. అంతటా ఆదరణ లభిస్తోంది’’ అన్నారు. ‘‘నాకు పూరిగారంటే పిచ్చి. ఆయనలా సినిమా తీయాలనేది నా కల. ఇదే బ్యానర్లో నా రెండో సినిమా కూడా చేస్తా’’ అన్నారు ఆర్.కె. కాంపల్లి. ‘‘వినోదాత్మక ప్రేమకథా చిత్రమిది. సినిమా పూర్తయింది. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. సంగీత దర్శకుడు జయవర్థన్, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పూరి జగన్నాథ్ అంటే పిచ్చి
‘‘డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారంటే నాకు పిచ్చి. ఆయన్ను దృష్టిలో పెట్టుకునే ‘పడిపోయా నీ మాయలో’ సినిమా డిజైన్ చేసుకున్నా. ఆయనలా సినిమా తీయాలనేది నా కల’’ అని దర్శకుడు ఆర్.కె. కాంపల్లి అన్నారు. అరుణ్ గుప్తా, సావేరి, జయవర్ధన్ ముఖ్యపాత్రల్లో మహేశ్ పైడ, భరత్ అంకతి నిర్మించిన ‘పడిపోయా నీ మాయలో’ సినిమా ఫస్ట్‌లుక్, టీజర్ లాంచ్ హైదరాబాద్‌లో జరిగింది. కాంపల్లి మాట్లాడుతూ– ‘‘భరత్‌గారు నాకు పదేళ్లుగా పరిచయం. నేను చెప్పిన లైన్ నచ్చి, ఆయన సినిమా చేద్దామన్నారు. తర్వాత మహేశ్‌గారు మాతో జత కలిశారు. ముందుగా ఈ సినిమాకు వేరే టైటిల్ అనుకున్నాం. కానీ, కథానుగుణంగా ‘పడిపోయా నీ మాయలో’ యాప్ట్ అవుతుందని పెట్టాం. త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. ఇదే బ్యానర్లో నా రెండో సినిమా కూడా చేస్తా. ’’ అన్నారు. ‘‘ఆర్.కె.గారి ప్రతిభ గుర్తించాం. ఆయన చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేశాం. అరుణ్, సావేరి చక్కగా నటించారు’’ అన్నారు మహేశ్ పైడ, భరత్ అంకతి. -
జయవర్ధన్ అజేయ సెంచరీ
దయానంద్ క్రికెట్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఆర్. దయానంద్ అండర్-16 క్రికెట్ టోర్నమెంట్లో భవన్స ఆర్కే స్కూల్ బ్యాట్స్‌మన్ జయవర్ధన్ (127 బంతుల్లో 143 నాటౌట్; 14 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. బౌండరీలతో బౌలర్లను బెంబేలెత్తించాడు. దీంతో డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టుతో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భవన్స స్కూల్ 221 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భవన్స ఆర్కే స్కూల్ (సైనిక్‌పురి) జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 345 పరుగులు చేసింది. జయవర్ధన్‌తో పాటు అకీబ్ (71) అర్ధసెంచరీతో రాణించాడు. అనంతరం 346 పరుగుల లక్ష్యఛేదనలో డీఆర్ఎస్ స్కూల్ జట్టు తడబడింది. బ్యాట్స్‌మెన్ వెంటవెంటనే వెనుదిరగడంతో 23.3 ఓవర్లలో 124 పరుగులకే కుప్పకూలింది. అక్షయ్ రెడ్డి (45) పోరాడాడు. భవన్స బౌలర్లలో శ్రీకాంత్ రెడ్డి 4, ప్రతీక్ 3 వికెట్లతో రాణించారు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు సెయింట్ జోసెఫ్ పీఎస్: 196 (రోహన్ 4/22); లిటిల్ ఫ్లవర్ హెచ్ఎస్ (అబిడ్స): 200/5 (కుశ్ అగర్వాల్ 45, శిరీష్ రెడ్డి 54, ఆదిత్య సాయి 45నాటౌట్). క్రీసెంట్ మోడల్ స్కూల్: 263/9 (అనిరుధ్ కపిల్ 52, ఠాకూర్ తిలక్ వర్మ 105; వినయ్ రావు 3/49, నిమిష్ 4/49), శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్: 192 (గ్రాహం 44, ఎస్. రోహిత్ 48, నందన్ 30; విష్ణు 4/29). -
ఖైదీలకు ఫోన్ సౌకర్యం
కడప అర్బన్, న్యూస్‌లైన్: కడప కేంద్ర కారాగారంలో ఖైదీలకు గురువారం ఫోన్ సౌకర్యం కల్పించారు. ఖైదీల ఫోన్ సౌకర్యం యూనిట్‌ను జైళ్లశాఖ డీఐజీ జయవర్ధన్ కేంద్ర కారాగార సూపరింటెండెంట్ గోవిందరాజులు చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. అనంతరం ఫోన్ క్యాబిన్‌ను డీఐజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారానికి రెండుసార్లు ఖైదీలకు తమ బంధువులతో ఒక్కొక్కసారి ఐదు నిముషాల చొప్పున ఫోన్లో మాట్లాడే సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఖైదీలు మాట్లాడుకునే సమయంలో కారాగార సిబ్బంది పర్యవేక్షిస్తుంటారన్నారు. జీవిత ఖైదు, రిమాండు అనుభవిస్తున్న వారికి మాత్రమే ఈ ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. తీవ్రవాదులు, దేశద్రోహ, మావోయిస్టు, దోపిడీలు, స్మగ్లింగ్ కేసులలో శిక్ష అనుభవిస్తున్న వారికి ఫోన్లో మాట్లాడే అవకాశం ఉండదన్నారు. ఈ అవకాశాన్ని ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కేంద్ర కారాగార సూపరింటెండెంట్ గోవిందరాజులు, డిప్యూటీ సూపరింటెండెంట్ వెంకట్రాజు, జైలర్లు, డిప్యూటీ జైలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఆనందంగా ఉంది కేంద్ర కారాగారానికి మూడేళ్ల క్రితం శిక్ష అనుభవించేందుకు వచ్చాను. అప్పటి నుంచి మా బంధువులు అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటారు. ఫోన్లో మా బిడ్డలతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. - వెంకట నారాయణరెడ్డి, జీవితఖైదీ, కడప మా విజ్ఞప్తి ఫలించింది నాలుగేళ్లుగా కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాను. మా ఊరి నుంచి బిడ్డలు, బంధువులు వచ్చి వెళ్లేందుకు ఎంతో ఖర్చవుతోంది. ఎన్నోసార్లు జైలు అధికారులకు త మగోడు విన్నవించుకున్నాం. చివరకు ప్రభుత్వం అంగీకరించి ఫోన్ సౌకర్యాన్ని కల్పించడం ఎంతో ఆనందంగా ఉంది. - పూల లక్ష్మిదేవి, జీవిత ఖైదీ, ప్రకాశం జిల్లా