Phone facility
-
సబ్‌జైలులోని ఖైదీలకు ఫోన్ సౌకర్యం
సబ్‌జైళ్ల జిల్లా అధికారి రామ్‌గోపాల్ మార్కాపురం : సబ్ జైలులోని ఖైదీలకు ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నామని జిల్లా జైళ్ల అధికారి ఎం.రామ్‌గోపాల్ తెలిపారు. స్థానిక సబ్ జైలులో బుధవారం ఏర్పాటు చేసిన ఎస్టీడీ కాయిన్ బాక్స్ టెలిఫోన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తమ శాఖ డెరైక్టర్ జనరల్ తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాలో మొదటిసారిగా మార్కాపురం సబ్‌జైలుకు ఈ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. జైలులో ఉన్న ఖైదీలు కుటుంబ సభ్యులతో, న్యాయవాదులతో మాట్లాడుకోవచ్చన్నారు. ఈ సౌకర్యం ప్రస్తుతం రాష్ట్రంలోని జిల్లా జైళ్లలో, సెంట్రల్ జైళ్లలో అమలవుతుందన్నారు. గిద్దలూరులో సబ్‌జైలు నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80 కోట్లు మంజూరు చేసిందని ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా త్వరలో నిర్మాణ పనులు చేపడతామన్నారు. చీరాలలో సబ్‌జైలు నిర్మాణానికి ఎకరా స్థలాన్ని కేటాయించామన్నారు. జిల్లాలోని జైళ్లలో ఉన్న ఖైదీలకు వారంలో ఒక రోజు మాంసాహారం, కోడిగుడ్డు, అరటి పండు అందిస్తున్నామన్నారు. ప్రతి రోజు ఉదయం పూట ఖైదీలకు టిఫిన్ ఇస్తున్నామని చెప్పారు. ఆయన వెంట మార్కాపురం జైలు పర్యవేక్షణాధికారి అప్పలనాయుడు ఉన్నారు. -
జైల్లో హలో..హలో
ఖైదీలకు ఫోన్ సౌకర్యం నెల్లూరు(క్రైమ్) : చెముడుగుంటలోని జిల్లా కేంద్రకారాగారంలో ఉంటున్న ఖైదీలకు ఫోన్ సౌకర్యాన్ని జైళ్లశాఖ ఐజీ బి.సునీల్‌కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ ఖైదీల్లో మానిసిక బాధను తగ్గించడంతో పాటు మానసిక పరివర్తన పెంపొందించేందుకు ఈ సౌకర్యం దోహదపడుతుందన్నారు. వొడాఫోన్ నెట్‌వర్క్‌తో ఒప్పందం ఏర్పాటు చేసుకుని రెండు ల్యాండ్లైన్లను కారాగారంలో ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఖైదీ నెలకు ఎనిమిదిసార్లు తమ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుకోవచ్చన్నారు. ఖైదీలు తాము మాట్లాడే ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఫోను నంబర్లను జైలు సిబ్బందికి అందించాలన్నారు. వారు ఆ నంబర్లను రిజిస్టర్ చేసుకుంటారన్నారు. ఖైదీలు మాట్లాడే ప్రతి మాటా ఆటోమెటిక్‌గా రికార్డు అవుతుందన్నారు. ఇప్పటికే చర్లపల్లి, చెంచల్‌గూడ, రాజమండ్రితో పాటు పలు కేంద్ర కారాగారాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అనంతరం ఖైదీలు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఫోన్ సౌకర్యం కల్పించడంపై ఖైదీలు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన కారాగారంలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరలోనే ఆ శాఖ డీజీ కృష్ణంరాజు పర్యటన ఉన్న దృష్ట్యా పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు సూచిం చారు. ఖైదీలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుంచి ఆయన పాతజైలును సందర్శించారు. పాతజైలును త్వరలోనే సీకా (స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్)గా మార్చనున్నారు. ఆంధ్రరాష్ట్రంలోని జైలుశాఖ అధికారులకు, సిబ్బందికి ఇకపై నెల్లూరులోని సికాలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన అంశాలపై ఆయన జైలు సూపరింటెండెంట్ ఎంఆర్ రవికిరణ్‌తో మాట్లాడారు. ఐజీ పర్యటన ఆద్యంతం గోప్యంగా సాగింది. -
సేమ్... షేమ్!
కడప అర్బన్, న్యూస్‌లైన్ : కడప కేంద్ర కారాగారంలో రోజుకో సంఘటన వెలుగుచూస్తోంది.. ఖైదీలకు ఫోన్ సౌకర్యం కల్పించినా సెల్ఫోన్లు లభ్యమవుతున్నాయి. తీవ్రవాదులుగా అభియోగం మోపబడి శిక్షను అనుభవిస్తున్న వారి వద్దనే సెల్ఫోన్లు లభ్యమవుతున్నాయంటే కొందరు అధికారుల, సిబ్బంది నిర్లక్ష్య వైఖరి ఏ మేరకుఉందో తెలుస్తోంది. కేంద్ర కారాగారం బయట, లోపల అధికారుల పర్యవేక్షణా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సీసీ కెమెరాల వ్యవస్థ ఉన్నప్పటికీ ఖైదీలకు సెల్ ఫోన్లు ఎలా అందుతున్నాయో ప్రశ్నార్థకంగా ఉంది. గతంలో కిలోల కొద్ది గంజాయి బయట నుంచి విసిరేస్తే వార్డన్లు పట్టుకున్నారు. ఆ గంజాయి ఎలా వచ్చిందనేది ఇప్పటి వరకు నిగ్గుతేల్చలేని పరిస్థితి నెలకొంది. కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌గా పని చేసిన ఆకుల నరసింహ ఖైదీలను ఆశ్రమ వాసులుగా పిలుస్తూ గౌరవ ప్రదంగా చూస్తూ వారిలోసత్ప్రవర్తనకు కృషి చే శారు. కేంద్ర కారాగారం లోపల, బయట కూరగాయలు, ఆకుకూరల తోటలను పెంచారు. కొందరు ఈ విధానాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుని సెల్ఫోన్లను వాడుతూ ఆ తోటలలో భద్రపరుచుకునే వారు. తర్వాత కేంద్ర కారాగార సూపరింటెండెంట్‌గా వచ్చిన డాక్టర్ ఇండ్ల శ్రీనివాసరావు హయాంలో సెల్ఫోన్లు విపరీతంగా వాడుతున్నారనే సమాచారం బయటికి పొక్కింది. ఆ సమయంలో పతాక శీర్షికన సెల్ఫోన్ల వ్యవహారంపై, గంజాయి విసరడంపై కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుత కేంద్ర కారాగార సూపరింటెండెంట్ గోవిందరాజులు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సీసీ కెమెరాల వ్యవస్థను ప్రవేశపెట్టారు. సెల్ఫోన్ల ద్వారాగానీ, ల్యాండ్‌లైన్ ద్వారాగానీ ఖైదీలు మాట్లాడుకునే అవకాశం కల్పించారు. ఈ క్రమంలో మరలా సెల్ఫోన్లు లభ్యం కావడం అనేది చర్చనీయాంశమైంది. ఐఎస్ఐ తీవ్రవాదుల వద్ద సెల్ఫోన్లు లభ్యం కడప కేంద్ర కారాగారం నుంచి వరంగల్ కేంద్ర కారాగారానికి ఈనెల 29వ తేదీన భారీ బందోబస్తు మధ్య ఐదుగురు ఐఎస్ఐ తీవ్రవాదులను తరలించారు. వీరిలో జహీర్, సలీం, విశ్వాస్, రియాజ్, రియాద్ ఉన్నారు. వీరిని కడపకేంద్ర కారాగారం వద్ద తనిఖీ చేసి పంపించారు. అయినప్పటికీ వరంగల్ కేంద్ర కారాగారానికి చేరుకునే సమయానికి ఐదుగురి వద్ద ఐదు సెల్ఫోన్లు లభ్యం కావడం గమనార్హం. కట్టుదిట్టమైన చర్యలకు ప్రయత్నిస్తున్నాం కడప కేంద్ర కారాగారంలో ఫోన్ సౌకర్యాన్ని ఖైదీలకు కల్పించడం వల్ల సెల్ఫోన్లు లభ్యమయ్యే వ్యవహారాన్ని తగ్గించగలిగాం. ఐఎస్ఐ తీవ్రవాదులను వరంగల్‌కు తరలించగా అక్కడి తనిఖీలలో సెల్ఫోన్లు లభించాయని సమాచారం వచ్చింది. సెల్ఫోన్ల నిరోధానికి తమవంతు బాధ్యతగా కృషి చేస్తున్నాం. సీసీ కెమెరాల వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. - గోవిందరాజులు, కేంద్ర కారాగార సూపరింటెండెంట్ -
ఖైదీలకు ఫోన్ సౌకర్యం
కడప అర్బన్, న్యూస్‌లైన్: కడప కేంద్ర కారాగారంలో ఖైదీలకు గురువారం ఫోన్ సౌకర్యం కల్పించారు. ఖైదీల ఫోన్ సౌకర్యం యూనిట్‌ను జైళ్లశాఖ డీఐజీ జయవర్ధన్ కేంద్ర కారాగార సూపరింటెండెంట్ గోవిందరాజులు చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. అనంతరం ఫోన్ క్యాబిన్‌ను డీఐజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారానికి రెండుసార్లు ఖైదీలకు తమ బంధువులతో ఒక్కొక్కసారి ఐదు నిముషాల చొప్పున ఫోన్లో మాట్లాడే సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఖైదీలు మాట్లాడుకునే సమయంలో కారాగార సిబ్బంది పర్యవేక్షిస్తుంటారన్నారు. జీవిత ఖైదు, రిమాండు అనుభవిస్తున్న వారికి మాత్రమే ఈ ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. తీవ్రవాదులు, దేశద్రోహ, మావోయిస్టు, దోపిడీలు, స్మగ్లింగ్ కేసులలో శిక్ష అనుభవిస్తున్న వారికి ఫోన్లో మాట్లాడే అవకాశం ఉండదన్నారు. ఈ అవకాశాన్ని ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కేంద్ర కారాగార సూపరింటెండెంట్ గోవిందరాజులు, డిప్యూటీ సూపరింటెండెంట్ వెంకట్రాజు, జైలర్లు, డిప్యూటీ జైలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఆనందంగా ఉంది కేంద్ర కారాగారానికి మూడేళ్ల క్రితం శిక్ష అనుభవించేందుకు వచ్చాను. అప్పటి నుంచి మా బంధువులు అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటారు. ఫోన్లో మా బిడ్డలతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. - వెంకట నారాయణరెడ్డి, జీవితఖైదీ, కడప మా విజ్ఞప్తి ఫలించింది నాలుగేళ్లుగా కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాను. మా ఊరి నుంచి బిడ్డలు, బంధువులు వచ్చి వెళ్లేందుకు ఎంతో ఖర్చవుతోంది. ఎన్నోసార్లు జైలు అధికారులకు త మగోడు విన్నవించుకున్నాం. చివరకు ప్రభుత్వం అంగీకరించి ఫోన్ సౌకర్యాన్ని కల్పించడం ఎంతో ఆనందంగా ఉంది. - పూల లక్ష్మిదేవి, జీవిత ఖైదీ, ప్రకాశం జిల్లా -
ఖైదీలకు ఫోన్ సౌకర్యం
విశాఖ కేంద్ర కారాగారంలో జిల్లా న్యాయమూర్తి ప్రారంభం రిమాండ్ ఖైదీలకూ త్వరలో అందుబాటు విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఖైదీల కల నెరవేరింది. తమవారి కష్టసుఖాలు తెలుసుకునే భాగ్యం కలిగింది. విశాఖ కేంద్ర కారాగారంలో వీరికి గురువారం నుంచి ఫోన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ ఏర్పాటు చేసినరెండు ల్యాండ్ ఫోన్లను జిల్లా న్యాయమూర్తి జయసూర్య ప్రారంభించారు. వెంటనే శిక్షపడిన ఖైదీతో అతని కుటుంబీకులతో మాట్లాడించారు. డీపిజా టెలికమ్యూనికేషన్స్‌కు ఈ ఫోన్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. జైలు సూపరింటెండెంట్ ఇండ్ల శ్రీనివాస్, డెప్యూటీ సూపరింటెండెంట్ సన్యాసినాయుడు, డెప్యూటీ జైలర్ శివ ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం ఫోన్ సౌకర్యంపై జైలు సూపరింటెండెంట్ విలేకరులకు వివరించారు. వారానికి రెండు సార్లే... ఖైదీలు తమ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏవైనా రెండు ఫోన్ నంబర్లను ముందుగా జైలు అధికారుల రికార్డుల్లో నమోదు చేయించుకోవాలి. ఆయా నంబర్లకు మాత్రమే వారానికి రెండుసార్లు చొప్పున నెలలో ఎనిమిదిసార్లు మాట్లాడవచ్చు. ప్రతి కాల్లో అయిదు నిమిషాలు మాత్రమే ఖైదీ మాట్లాడాలి. డయిల్ చేసిన అయిదు నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా అదే ఆగిపోతుంది. ప్రతి నిమిషానికి రూ.4 బిల్లు పడుతుంది. ఖైదీలకు ముందుగానే ఈ టోకెన్లను అధికారులు విక్రయిస్తారు. ఈ సౌకర్యం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఖైదీలు కుటుంబ సభ్యులతో ఏం మాట్లాడుతున్నారో సిబ్బంది దగ్గరుండి పరిశీలిస్తారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో రాజమండ్రి, చెర్లపల్లి కారాగారాల్లో ఉండగా, ఇప్పుడు విశాఖ కారాగారంలోకి అందుబాటులోకి వచ్చింది. రిమాండ్ ఖైదీలకు కూడా కొద్ది రోజుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది.