ఖైదీలకు ఫోన్ సౌకర్యం
- విశాఖ కేంద్ర కారాగారంలో జిల్లా న్యాయమూర్తి ప్రారంభం
- రిమాండ్ ఖైదీలకూ త్వరలో అందుబాటు
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఖైదీల కల నెరవేరింది. తమవారి కష్టసుఖాలు తెలుసుకునే భాగ్యం కలిగింది. విశాఖ కేంద్ర కారాగారంలో వీరికి గురువారం నుంచి ఫోన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ ఏర్పాటు చేసినరెండు ల్యాండ్ ఫోన్‌లను జిల్లా న్యాయమూర్తి జయసూర్య ప్రారంభించారు. వెంటనే శిక్షపడిన ఖైదీతో అతని కుటుంబీకులతో మాట్లాడించారు. డీపిజా టెలికమ్యూనికేషన్స్‌కు ఈ ఫోన్‌ల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. జైలు సూపరింటెండెంట్ ఇండ్ల శ్రీనివాస్, డెప్యూటీ సూపరింటెండెంట్ సన్యాసినాయుడు, డెప్యూటీ జైలర్ శివ ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం ఫోన్ సౌకర్యంపై జైలు సూపరింటెండెంట్ విలేకరులకు వివరించారు.
వారానికి రెండు సార్లే...
ఖైదీలు తమ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏవైనా రెండు ఫోన్ నంబర్లను ముందుగా జైలు అధికారుల రికార్డుల్లో నమోదు చేయించుకోవాలి.
ఆయా నంబర్లకు మాత్రమే వారానికి రెండుసార్లు చొప్పున నెలలో ఎనిమిదిసార్లు మాట్లాడవచ్చు.
ప్రతి కాల్‌లో అయిదు నిమిషాలు మాత్రమే ఖైదీ మాట్లాడాలి. డయిల్ చేసిన అయిదు నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా అదే ఆగిపోతుంది.
ప్రతి నిమిషానికి రూ.4 బిల్లు పడుతుంది. ఖైదీలకు ముందుగానే ఈ టోకెన్లను అధికారులు విక్రయిస్తారు.
ఈ సౌకర్యం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉంటుంది.
ఖైదీలు కుటుంబ సభ్యులతో ఏం మాట్లాడుతున్నారో సిబ్బంది దగ్గరుండి పరిశీలిస్తారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో రాజమండ్రి, చెర్లపల్లి కారాగారాల్లో ఉండగా, ఇప్పుడు విశాఖ కారాగారంలోకి అందుబాటులోకి వచ్చింది.
రిమాండ్ ఖైదీలకు కూడా కొద్ది రోజుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది.