'పదిమందికి పైగా జువెనైల్స్ను ఉరి తీస్తున్నారు'
దుబాయ్: వివిధ నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణల కింద పదుల సంఖ్యలో బాల నేరస్తులను ఇరాన్లో ఉరి తీయనున్నారని ఆమ్నేస్టి ఇంటర్నేషనల్(అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ) ఆందోళన వ్యక్తం చేసింది. వారంతా కూడా త్వరలోనే పద్దెనిమిదేళ్లలోకి అడుగుపెట్టనున్నారని చెప్పింది. గతంతో కూడా బాల నేరస్తులను ఇరాన్ ఏమాత్రం జాలి లేకుండా మరణ శిక్ష అమలు చేసిందని తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఆమ్నేస్టి ఒక ప్రకటన విడుదల చేసింది.
2005 నుంచి 2015 మధ్యకాలంలో 73మంది బాల నేరస్తులను ఇరాన్ ఉరి తీసినట్లు తమ వద్ద సమాచారం ఉందని తెలిపింది. ఇరాన్ పాశ్యాత్య దేశాలతో అణు ఒప్పందం చేసుకుంటున్న సమయంలోనే తాము ఈ విషయంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు చెప్పారు. అయితే, ఆ సందర్భంగా కొన్ని తీర్మానాలు ప్రతిపాదించగా వాటిని అంగీకరిస్తున్నట్లు తెలిపిన ఇరాన్ ప్రస్తుతం ఆ తీర్మానాలను నిర్లక్ష్యం చేస్తూ మరోసారి పదిమందికి పైగా ఉరి తీసేందుకు సిద్ధమైందని తెలిపింది.