నా భర్తకు ప్రాణభిక్ష పెట్టండి
* కువైట్‌లో డ్రగ్స్ కేసులో ఇరికించారు
* నిందితులపై చర్యలు తీసుకోండి
* పోలీసులకు బాధితురాలి అభ్యర్థన
రొంపిచెర్ల: ‘నా భర్తను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించడంతో కువైట్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది, ప్రభుత్వం, పోలీసులు రంగప్రవేశం చేసి ప్రాణభిక్ష పెట్టాల’ని శుక్రవారం ఓ మహిళ పోలీసులను అభ్యర్థిం చింది. బాధితురాలి కథనం మేరకు రొంపిచెర్ల మండలం పెద్దమల్లెల గ్రామ పంచాయతీ దుస్సావాండ్లపల్లెకు చెందిన సుధారాణి, ఎర్రావారిపాళెం మండలం మెదరపల్లెకు చెందిన పొంతల మహేష్ 8 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు.
వీరికి పిల్లలు రీతూ(6), పవన్(4) ఉన్నారు. కుటుంబ జీవనం కష్టంగా ఉండటంతో మూడు సంవత్సరాల క్రితం రొంపిచెర్ల మండలం దుస్సావాండ్లపల్లెకు వచ్చి నివాసం వచ్చారు. కూలి పనులు చేసుకుంటూ జీవించేవారు. ఆశించిన మేరకు పనులు లేక పోవడంతో బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం మహేష్ కువైట్‌కు వెళ్లాడు. అక్కడ వ్యవసాయుక్షేత్రంలో పనిచేస్తూ కిడ్నీల జబ్బు బారిన పడ్డాడు. దీంతో 11 నెలల క్రితం వుళ్లీ కువైట్ నుంచి రొంపిచెర్ల మండలం దుస్సావారిపల్లెకు వచ్చారు.
వైద్య పరీక్షలు చేసుకోని వుళ్లీ 9 నెలల క్రితం కువైట్‌కు బయలుదేరాడు. అ సమయంలో ఎర్రావానిపాళెం మండలం మెదరపల్లెకు చెందిన అతని పిన్నమ్మ చిట్టెమ్మ కుమారులు బాలసుబ్రమణ్యం, కిరణ్ కలిశారు. కువైట్‌లో ఉన్న వారి అమ్మకు నూతన వస్త్రాలు తీసుకెళ్లాలని ఒక బాక్స్ తెచ్చి ఇచ్చారు. దాన్ని మహేష్ కువైట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ విమానాశ్రయంలో పోలీసుల తనిఖీచేయగా ఆ బాక్స్‌లో డ్రగ్స్ ఉన్నట్లు బయట పడింది.
ఈ కేసులో మహేష్‌కు వారం రోజుల క్రితం వురణశిక్ష విధించింది. ఈ విషయూన్ని అతడు భార్య సుధారాణికి ఫోన్ ద్వారా తెలియజేశారు. దీంతో ఆమె, అత్తమామలు వెంకట్రామ్మయ్య, పద్మావతమ్మ కలిసి అతనికి ప్రాణబిక్ష పెట్టాలని పీలేరు రూరల్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ మహేష్‌కు శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అజ్ఞాతంలో చిట్టెమ్మ ?
డ్రగ్స్ కేసులో మహేష్ కువైట్‌లో పోలీసులకు పట్టుబడడంతో అక్కడ ఉన్న చిట్టెమ్మ గుట్టు చప్పుడు కాకుండా ఇండియాకు బయలుదేరి వచ్చిందని సమాచారం. ఆమె ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో తలదాచుకుంటోందని తెలిసింది. పోలీసులు తప్పనిసరిగా చిట్టెమ్మ కుటుంబంపై దాడి చేస్తారని భావించిన ఆమె అజ్ఞాతంలోకి వెళ్లారని తెలిసింది. అలాగే ఆమె కుమారులు కూడ ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారని గ్రామస్తుల ద్వారా తెలిసింది.
ఎర్రావారిపాళెం మండలంలో డ్రగ్స్ ముఠా?
ఎర్రావారిపాళెం మండలంలో విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేసే ముఠా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎర్రావారిపాళెం వుండలానికి చెందిన ముఠా తిరుపతిలోని పలు కళాశాలల్లో విద్యార్థులకు సైతం డ్రగ్స్‌ను విక్రయించినట్లు తెలిసింది.