న్యూఢిల్లీ: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని ఒక షెల్టర్ హోంలో బాలికలపై జరిగిన లైంగిక దాడికి సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడు బ్రజేశ్ ఠాకూర్‌ను ఢిల్లీలోని పోక్సో కోర్టు సోమవారం దోషిగా తేల్చింది. ఠాకూర్, మరో 18 మంది దోషులేనని స్పష్టం చేసింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, లైంగిక దాడి, లైంగిక వేధింపులు, బాలికలకు డ్రగ్స్ ఇవ్వడం, సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వకపోవడం.. తదితర నేరారోపణలపై బ్రజేశ్ ఠాకూర్, ఆ వసతి గృహం సిబ్బంది, బిహార్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లోని పలువురు ఉద్యోగులపై ఈ కేసు నమోదైంది.
ముజఫర్‌పూర్‌లో ఠాకూర్ నిర్వహిస్తున్న వసతి గృహంలో జరిగిన ఈ దారుణాన్ని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెన్ 2018లో వెలుగులోకి తెచ్చింది. బాలికలపై అత్యాచారం, సామూహిక అత్యాచారం తదితర నేరాలకు సంబంధించి పోక్సో (లైంగిక నేరాల నుంచి చిన్నారులను రక్షించే చట్టం), భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని పలు సెక్షన్ల కింద ఆయనను న్యాయమూర్తి సౌరభ్ కులశ్రేష్ట దోషిగా నిర్ధారించారు. ఏ శిక్ష విధించాలనే విషయమై ఈ నెల 28న వాదనలు వింటామని న్యాయమూర్తి ప్రకటించారు.
పైన పేర్కొన్న నేరాలకు యావజ్జీవం పడే అవకాశముంటుంది. ముజఫర్‌పూర్‌లోని చైల్డ్ ప్రొటెక్షన్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ రోజీ రాణిని కూడా కోర్టు దోషిగా పేర్కొంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా చైర్మన్ దిలీప్ కుమార్ వర్మ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రవి రోషన్ సహా మిగతా 17 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ తీర్పును పై కోర్టులో సవాలు చేస్తామని ఠాకూర్ తరఫు న్యాయవాదులు తెలిపారు. ఈ కేసులో సీబీఐ హాజరుపర్చిన 69 మంది సాక్ష్యులను కోర్టు విచారించింది.
వేధింపులకు గురైన 44 మంది బాలికల వాంగ్మూలాలను తీసుకుంది. ఆ బాలికల్లో 13 మంది మానసికంగా సరైన ఎదుగుదల లేనివారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోజువారీ విచారణ చేపట్టి ఆర్నెల్లలో విచారణను కోర్టు ముగించింది. బ్రజేశ్‌తో తన భర్తకు సంబంధాలున్నాయన్న ఆరోపణ రావడంతో బిహార్ మంత్రి మంజు వర్మ పదవికి రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2019లో ఈ కేసును ముజఫర్‌పూర్ కోర్టు నుంచి ఢిల్లీలోని పోక్సో కోర్టుకు బదిలీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment