Pokso law
-
బ్రజేశ్ ఠాకూర్ దోషే
న్యూఢిల్లీ: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని ఒక షెల్టర్ హోంలో బాలికలపై జరిగిన లైంగిక దాడికి సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడు బ్రజేశ్ ఠాకూర్‌ను ఢిల్లీలోని పోక్సో కోర్టు సోమవారం దోషిగా తేల్చింది. ఠాకూర్, మరో 18 మంది దోషులేనని స్పష్టం చేసింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, లైంగిక దాడి, లైంగిక వేధింపులు, బాలికలకు డ్రగ్స్ ఇవ్వడం, సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వకపోవడం.. తదితర నేరారోపణలపై బ్రజేశ్ ఠాకూర్, ఆ వసతి గృహం సిబ్బంది, బిహార్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోని పలువురు ఉద్యోగులపై ఈ కేసు నమోదైంది. ముజఫర్‌పూర్‌లో ఠాకూర్ నిర్వహిస్తున్న వసతి గృహంలో జరిగిన ఈ దారుణాన్ని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెన్ 2018లో వెలుగులోకి తెచ్చింది. బాలికలపై అత్యాచారం, సామూహిక అత్యాచారం తదితర నేరాలకు సంబంధించి పోక్సో (లైంగిక నేరాల నుంచి చిన్నారులను రక్షించే చట్టం), భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని పలు సెక్షన్ల కింద ఆయనను న్యాయమూర్తి సౌరభ్ కులశ్రేష్ట దోషిగా నిర్ధారించారు. ఏ శిక్ష విధించాలనే విషయమై ఈ నెల 28న వాదనలు వింటామని న్యాయమూర్తి ప్రకటించారు. పైన పేర్కొన్న నేరాలకు యావజ్జీవం పడే అవకాశముంటుంది. ముజఫర్‌పూర్‌లోని చైల్డ్ ప్రొటెక్షన్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ రోజీ రాణిని కూడా కోర్టు దోషిగా పేర్కొంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా చైర్మన్ దిలీప్ కుమార్ వర్మ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రవి రోషన్ సహా మిగతా 17 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ తీర్పును పై కోర్టులో సవాలు చేస్తామని ఠాకూర్ తరఫు న్యాయవాదులు తెలిపారు. ఈ కేసులో సీబీఐ హాజరుపర్చిన 69 మంది సాక్ష్యులను కోర్టు విచారించింది. వేధింపులకు గురైన 44 మంది బాలికల వాంగ్మూలాలను తీసుకుంది. ఆ బాలికల్లో 13 మంది మానసికంగా సరైన ఎదుగుదల లేనివారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోజువారీ విచారణ చేపట్టి ఆర్నెల్లలో విచారణను కోర్టు ముగించింది. బ్రజేశ్‌తో తన భర్తకు సంబంధాలున్నాయన్న ఆరోపణ రావడంతో బిహార్ మంత్రి మంజు వర్మ పదవికి రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2019లో ఈ కేసును ముజఫర్‌పూర్ కోర్టు నుంచి ఢిల్లీలోని పోక్సో కోర్టుకు బదిలీ చేశారు. -
జిల్లాల్లో 2 పోక్సో కోర్టులు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను రక్షించేందుకు ఉద్దేశించిన పోక్సో(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్) చట్టం కింద 300 పైగా ఎఫ్ఐఆర్లు పెండింగ్‌లో ఉన్న ప్రతీ జిల్లాలో రెండు ప్రత్యేక పోక్సో కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సోమవారం రాష్ట్రాలను ఆదేశించింది. 100కు పైగా పొక్సొ కేసులు పెండింగ్‌లో ఉన్న జిల్లాల్లో ప్రత్యేకంగా ఒక పొక్సొ కోర్టును ఏర్పాటు చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం స్పష్టతనిచ్చింది. ‘పోక్సో కేసులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోక్సో కోర్టుల్లోనే విచారించాలి. ఈ కోర్టులు వేరే కేసులను విచారించకూడదు. జిల్లాల్లో పోక్సో పెండింగ్ కేసులు 100కు పైగా ఉంటే ఒక ప్రత్యేక కోర్టు, 300కు పైగా ఉంటే 2 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలి’ అని పేర్కొంది. అయితే, జిల్లాలో 100 కన్నా తక్కువ పోక్సో కేసులు పెండింగ్‌లో ఉంటే.. ఇతర అత్యాచార కేసులను ఆ కోర్టులు విచారించవచ్చని వివరించింది. -
కామాంధుడికి మరణశిక్ష .
ఇండోర్: మధ్యప్రదేశ్‌లో నాలుగు నెలల చిన్నారిపై అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా హత్యచేసిన కేసులో దోషిగా తేలిన నవీన్ గడ్కే(26)కు ఇండోర్ జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసును విచారించిన అదనపు సెషన్స్ జడ్జి వర్షా శర్మ రికార్డుస్థాయిలో 23 రోజుల్లోనే నవీన్‌ను దోషిగా నిర్ధారిస్తూ శనివారం తీర్పు ఇచ్చారు. పోక్సో చట్టంతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద నవీన్ దోషిగా తేలినట్లు న్యాయమూర్తి శర్మ తీర్పులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శర్మ 51 పేజీల తీర్పును వెలువరిస్తూ.. ‘ఇలాంటి హేయమైన, క్రూరమైన చర్యలకు పాల్పడే వ్యక్తి సమాజానికి పట్టిన చీడ లాంటివాడు. రోగి శరీరంలో కుళ్లిపోయిన భాగాలను ఆపరేషన్ ద్వారా డాక్టర్లు తొలగించినట్లే.. ఇలాంటి నేరస్తులను సమాజం నుంచి దూరంగా ఉంచాలి. ఇలాంటి వ్యక్తులు సమాజానికి చాలా ప్రమాదకరం’ అని వ్యాఖ్యానించారు. ఏడ్వడం తప్ప మరొకటి తెలియని చిన్నారితో నేరస్తుడు అత్యంత క్రూరంగా ప్రవర్తించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండోర్‌లోని రజ్వాడా ప్రాంతంలో తల్లిదండ్రులతో నిద్రపోతున్న చిన్నారిని ఏప్రిల్ 20న కిడ్నాప్ చేసిన నవీన్.. ఓ వాణిజ్య భవనం బేస్మెంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత చిన్నారి ఏడుస్తుండటంతో ఆమె తలను నేలపై మోది కిరాతకంగా హత్యచేశాడు. -
చిన్నారులపై అత్యాచారాలకు ఉరి శిక్ష!
న్యూఢిల్లీ: 12 ఏళ్లలోపు వయస్సున్న చిన్నారులపై లైంగిక దాడులకు ఒడిగట్టే వారికి మరణ శిక్షను విధించేలా కేంద్రం ఆర్డినెన్స్‌ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆర్డినెన్స్ శనివారమే కేంద్ర మంత్రివర్గం ముందుకు వచ్చే అవకాశం ఉందని ఓ అధికారి చెప్పారు. యూపీ, కశ్మీర్‌లోని కఠువా సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో మైనర్ బాలికలపై పెరిగిపోతున్న అత్యాచారాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో కేంద్రం ఈ దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు పోక్సో (లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ) చట్టాన్ని సవరిస్తూ ఓ ఆర్డినెన్స్‌ను తీసుకురానుందని న్యాయ మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు. ప్రస్తుతం ఈ చట్టం కింద కేసు నమోదై దోషులుగా తేలిన వారికి గరిష్టంగా జీవితకాలం జైలు శిక్ష విధించేలా నిబంధనలు ఉన్నాయి. అత్యాచారం కారణంగా మహిళ చనిపోయినా లేదా జీవచ్ఛవంగా మారిన సందర్భాల్లో దోషులకు మరణ శిక్ష విధించేలా ప్రభుత్వం చట్టం తెచ్చింది. రేప్ బాధిత బంధువున్నారా మీకు?: సుప్రీం ఉన్నావ్ అత్యాచార ఘటనపై వచ్చిన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా ఓ న్యాయవాదిపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘క్రిమినల్ కేసుల్లో ప్రజాహిత వ్యాజ్యం ఎలా వేస్తారు? అత్యాచారానికి గురైన బంధువున్నారా మీకు?. ఉదారంగా ఉండకండి’ అంటూ ఎంఎల్ శర్మ అనే న్యాయవాదిపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. -
ఉరి తీసినా పాపం లేదు
కుషాయిగూడ: ఐదేళ్ల చిన్నారిపై వృద్ధుడు లైంగికదాడికి యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వృద్ధుడికి దేహశుద్ధి చేశారు. కుషాయిగూడ పోలీసుల కథనం ప్రకారం... ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూర గ్రామానికి చెందిన కృష్ణయ్య(65) భార్య రెండేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. కృష్ణయ్య ఏడాది కాలంగా కుమారుడితో పాటు నగరానికి వచ్చి చక్రిపురంలో ఉంటూ వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. చర్లపల్లిలో ఉంటున్న కూతురు ఇంటికి ఆదివారం వెళ్లాడు. సాయంత్రం ఎవరు లేని సమయంలో పక్క పోర్ష¯ŒSలో ఉండే ఐదేళ్ల చిన్నారిని ఆడిస్తున్నట్టు నటించి లైంగిక దాడికి యత్నించాడు. ఇది గమనించిన బాలిక తల్లిదండ్రులు అతడిని చితకబాదడంతో తప్పించుకొని పారిపోయి చక్రిపురంలోని ఇంట్లో తలదాచుకున్నాడు. ఇదిలా ఉండగా... సోమవారం ఉదయం బాలికను తల్లిదండ్రులు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. యాధృచ్ఛకంగా నిందితుడు కృష్ణయ్య కూడా అదే సమయంలో వైద్యం చేయించుకొనేందుకు అదే ఆసుపత్రికి వచ్చాడు. గమనించి చిన్నారి బంధువులు ఆవేశం ఆపుకోలేక మళ్లీ అతడిని చితకబాదారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కృష్ణయ్యను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అత్యాచార యత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇ¯ŒSస్పెక్టర్ ఎ¯ŒS.వెంకటరమణ తెలిపారు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించామన్నారు. కాగా, చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన కృష్ణయ్యను ఉరి తీయాలని రాష్ట్ర బాలల హక్కుల సంఘం ప్రతినిధులు అచ్యుతరావు, అనురాధారావు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. పోక్సో చట్టం కింద బాధిత చిన్నారికి ఆర్థిక సహాయం అందించాలని వారు కలెక్టర్‌ను కోరారు.