న్యూఢిల్లీ: దేశ రాజధానిలో 2013లో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఇద్దరు నిందితులను పోక్సో కోర్టు శనివారం దోషులుగా నిర్ధారించింది. ఈ ఘటన సమాజానికే తలవంపులు తెచ్చిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ దారుణ సంఘటన 2012 డిసెంబర్‌లో నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు తర్వాత నాలుగు నెలలకు చోటుచేసుకుంది. నిందితులు మనోజ్ షా, ప్రదీప్ కుమార్ బాధితురాలిని లైంగికంగా హింసించారు. అనంతరం బాలిక చనిపోయిందనుకుని వదిలేసి వెళ్లారు. 40 గంటల తరువాత ఏప్రిల్ 17న బాలికను రక్షించారు.
ప్రస్తుతం ఈ కేసులో అదనపు సెషన్స్ జడ్జి నరేశ్‌కుమార్ మల్హోత్రా ఇద్దరినీ దోషులుగా నిర్ధారించారు. బాలికను వారు క్రూరంగా హింసించారని వ్యాఖ్యానించారు. ‘మన సమాజంలో మైనర్ బాలికలను దేవతలుగా ఆరాధిస్తారు. కానీ ఈ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది’ అని పోక్సో కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, తన కుమార్తెకు న్యాయం లభించినందుకు బాలిక తండ్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ‘విచారణ రెండేళ్ళలో పూర్తి కావాలి, కానీ ఆరేళ్ల తరువాతైనా మాకు న్యాయం లభించినందుకు సంతోషం’ అని అన్నారు. దోషులకు శిక్షల విధింపుపై జనవరి 30న విచారిస్తామని కోర్టు తెలిపింది. 2013లో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మే 24 చార్జిషీట్ దాఖలు చేశారు. జూలై 11న అభియోగాలు మోపుతూ హాజరుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment