సాక్షి, న్యూఢిల్లీ : సరిగ్గా ఐదేళ్ల క్రితం. దేశ రాజధాని నడిబొడ్డున దాష్టీకం. 23 ఏళ్ల విద్యార్థినిపై ఆరు మృగాల చేతిలో చిత్రవధలకు గురయిన రోజు. చెప్పుకోటానికి కూడా వీల్లేని రీతిలో కిరాతకంగా అనుభవించి.. నగ్నంగా రోడ్డు పైకి విసిరేశాయి. ఆ వార్తతో యావత్ దేశం ఉలిక్కి పడింది.
తల మరియు పేగులకు తగిలిన గాయాలతో 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రిలో 2012, డిసెంబర్ 29 న బాధితురాలు తుదిశ్వాస విడిచారు. ‘‘అమానత్, దామిని, నిర్భయ’’ పేర్లతో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నలుమూలల నుంచి హస్తినకు చేరిన యువత గర్జించటంతో ఢిల్లీ పీఠం కదిలింది. దేశం యావత్తునూ నిర్ఘాంతపరచిన ఢిల్లీ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులైన ముఖేష్ (26), అక్షయ్‌ఠాకూర్ (28), పవన్‌గుప్తా (19), వినయ్‌శర్మ (20) లకు ఢిల్లీ కోర్టు విధించిన మరణ శిక్షను సుప్రీం కోర్టు కూడా సమర్థించింది.
ఈ కేసును అరుదైన కేసుల్లోకెల్లా అరుదైన కేసుగా నిలుపుతోందని కోర్టు అభివర్ణించింది. ఒళ్లు గగుర్పొడిచే రీతిలో ఒక నిస్సహాయ మహిళపై దోషుల అమానవీయ, భయానక చర్యలు జాతి అంతరాత్మను నిర్ఘాంతపరచాయని.. మహిళలపై నేరాలను సహించబోమనే సందేశం పంపటానికి వీరికి తీవ్రమైన శిక్ష అవసరమని న్యాయమూర్తి తీర్పులో స్పష్టంచేశారు. కానీ, ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వారికి శిక్ష అమలు కాలేదు.
ఐదేళ్ల తర్వాత న్యాయం... మరి శిక్ష అమలు?
ఘటన తర్వాత సీసీ పుటేజీ ఆధారంగా బస్సు డ్రైవర్ రామ్ సింగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తర్వాత అతని తమ్ముడు ముకేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ వినయ్ గుప్తా, అక్షయ్ ఠాకూర్‌లను అరెస్ట్ చేశారు. చివరి నిందితుడు, మైనర్ అయిన రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు జువైనల్ హోంకు తరలించి చివరకు విడిచిపెట్టారు. రామ్ సింగ్ ఆత్మహత్య చేసుకోగా.. మిగిలిన నలుగురికి మరణ శిక్షలు ఖరారు అయ్యాయి. ‘దోషులు చనిపోయే వరకూ ఉరితీయాలి’ అంటూ కిక్కిరిసిన కోర్టు గదిలో జడ్జి శిక్షను ప్రకటించారు. నిస్సహాయురాలైన బాధితురాలిని చనిపోవటానికి గురిచేసిన చిత్రహింసలు, గాయాల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కోర్టు దోషులకు మరణశిక్ష విధించింది. సుమారు నాలుగేళ్ల తర్వాత మే 5, 2017న అత్యున్నత న్యాయస్థానం ఢిల్లీ కోర్టు తీర్పుతో ఏకీభవించింది.
8 నెలలు గడుస్తున్నా తీర్పు ఇప్పటిదాకా అమలు కాలేదు. జైలు అధికారుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవటంతో మధ్యలో ఓసారి ఆశా దేవీ ఢిల్లీ మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో మహిళా సంఘం జైలు అధికారులకు నోటీసులు జారీ చేసింది. అయినా ఇంత వరకు స్పందన లేదు. ఇదిలా ఉండగా.. దోషులు వినయ్ శర్మ, పవన్ కుమార్ గుప్తాలు తాజాగా మరణశిక్ష తీర్పుపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై విచారణ వచ్చే నెల(జనవరి 2018) 22వ తేదీకి వాయిదా వేసింది.
నిర్భయపై అత్యంత హేయంగా అత్యాచారం చేసి, కిరాతకంగా హింసించి చంపిన నరరూప రాక్షసులను చనిపోయేవరకూ ఉరితీయటమే సరైందన్న వాదన నేడు మరోసారి తెరపైకి వచ్చింది.
కాలంలో ఇరుక్కున్నాం.. ఆశాదేవి
కిరాతకానికి బలైనా నిర్భయ కొన ఊపిరి ఉన్నంతవరకు కూడా మొక్కవోని ధైర్యం ప్రదర్శించింది. కిరాతకులను ఎదురించింది. కాబట్టే ప్రభుత్వం, అధికారులు ఆమె పేరును దాచి పెట్టాలని చూసినా తల్లి ఆశాదేవి మాత్రం అందుకు నిరాకరించారు. ఢిల్లీ నగర బొడ్డున ఓ సమావేశంలో తమ కూతురు పేరు జ్యోతి సింగ్‌గా ప్రకటించారు.
‘‘ఘటన జరిగి ఐదేళ్లు గడుస్తున్నా ఆ రాక్షసులు ఇంకా బతికే ఉన్నారు. మా కుటుంబం ఇంకా ఆ ఘటనను, ఈ రోజునే గుర్తు చేసుకుంటూ అక్కడే ఆగిపోయాం. ఇలాంటి సమయాల్లో చట్టాలపై ప్రజలకు గౌరవం పోతుంది. ప్రతీ ఒక్కరి ఆలోచనా ధోరణి మారే విధంగా బలమైన చట్టాల రూపకల్పన జరగాలి. అప్పుడే నిర్భయ ఆత్మకు శాంతి కలుగుతుంది’’ అని ఆశాదేవి చెబుతున్నారు.
నిర్భయ ఘటన తర్వాత హడావుడి తప్ప పరిస్థితి ఇప్పటికీ ఏం మారలేదు. కఠిన చట్టాలు చేస్తాయన్న ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లభించటం లేదు. అందుకే ఉద్యమంలో ఇంకా నేను కొనసాగుతూనే ఉన్నా. దేశంలో ప్రతిరోజు ఏదో ఒక మూల మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, వాళ్ల భవిష్యత్ తదితర దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు ముందుకు రావటం లేదు. వారిలో అవగాహన పెరిగి.. ముందుకు వచ్చి పోరాడాల్సిన అవసరం ఉందని అని ఆమె అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment