సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్
న్యూఢిల్లీ, చెన్నై: రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వారిని విడుదల చేయడాన్ని అడ్డుకోవాలన్న కేంద్రం పిటిషన్‌ను స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం.. 27న దీనిపై విచారణ చేస్తామని తెలిపింది. క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో తీవ్ర జాప్యం కారణంగా రాజీవ్ హంతకులకు విధించిన ఉరిశిక్షను.. యావజ్జీవ శిక్షగా మారుస్తూ సుప్రీం నిర్ణ యం తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్ర చట్టాల కింద శిక్షపడిన వారిని విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కేంద్రం తన పిటిషన్‌లో పేర్కొం ది. దాంతోపాటు మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్పు చేయడంపై రివ్యూ పిటిషన్ విచారణలో ఉండగా.. వారిని విడుదల చేయడం తగదంది.
ఖైదీల విడుదలకు సంబంధించి కేంద్రం పిటిషన్‌పై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తమిళనాడు సీఎం జయలలిత పేర్కొన్నారు. ‘ఈ విషయం లో మేం అప్రమత్తంగా ఉన్నాం. చట్టపరంగానే ఎదుర్కొంటాం. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున చర్చించదలచుకోలేదు’ అని ఆమె చెన్నైలో చెప్పారు.