‘యావజ్జీవం’పై స్పష్టత | controversy over rajiv gandhi killers imprisonment | Sakshi
Sakshi News home page

‘యావజ్జీవం’పై స్పష్టత

Published Sat, Dec 5 2015 1:32 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

‘యావజ్జీవం’పై స్పష్టత - Sakshi

‘యావజ్జీవం’పై స్పష్టత

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసు దోషుల విడుదల వ్యవహారంలో కేంద్రానికీ, తమిళనాడు ప్రభుత్వానికీ మధ్య తలెత్తిన వివాదంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం బుధవారం ఇచ్చిన తీర్పు ఆ మాదిరి కేసులన్నిటి విషయంలో ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన తీరుతెన్నులపై స్పష్టత నిచ్చింది. ఇన్నాళ్లుగా ఆ తరహా కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగిస్తున్న అధికారాలకు కళ్లెం వేసింది. యావజ్జీవ శిక్ష పడిన ఖైదీల, వారి కుటుంబసభ్యుల ఆశలపై చన్నీళ్లు చల్లిన ఈ తీర్పు అనేక ప్రశ్నలు కూడా లేవనెత్తింది. ఈ తీర్పునకు కారణమైన రాజీవ్ హత్య కేసు తిరిగిన మలుపులు అన్నీ ఇన్నీ కాదు.

 

తమిళ టైగర్లు 23 ఏళ్లక్రితం జరిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్‌గాంధీ బలయ్యారు. ఆ కేసులో నలుగురు దోషులు-శాంతన్, మురుగన్, నళిని, పేరరివలన్‌లకు మరణశిక్ష పడింది. నలుగురికి యావజ్జీవ శిక్ష పడింది. నళిని మరణశిక్షను తమిళనాడు గవర్నర్ యావజ్జీవ శిక్షగా మార్చారు. మిగిలిన ముగ్గురు దోషుల క్షమాభిక్ష పిటిషన్లనూ తోసిపుచ్చడంతో వారు రాష్ట్రపతికి విన్నవించుకున్నారు. అక్కడ సైతం తిరస్కరణ ఎదురైంది. అయితే దీనంతటికీ 11 ఏళ్ల సమయం తీసుకోవడాన్ని ప్రశ్నిస్తూ వారు సుప్రీంకోర్టు గడప తొక్కారు. అలవిమాలిన జాప్యం జరిగినందున ఈ ముగ్గురి శిక్షనూ యావజ్జీవ శిక్షగా మారుస్తూ నిరుడు సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.

 

ఆ తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే అన్నాడీఎంకే నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వ కేబినెట్ హుటాహుటీన సమావేశమై మొత్తం ఏడుగురు దోషుల్నీ విడుదల చేయాలని తీర్మానించింది. మూడురోజుల్లోగా అందుకు అనుమతించాలని, ఆలోగా స్పందించకపోతే తామే విడుదల చేస్తామని స్పష్టంచేసింది. ఇంత వేగంగా తీసుకున్న నిర్ణయం వెనక ఆ రాష్ట్రంలో అన్నా డీఎంకే, డీఎంకేల మధ్య ఏర్పడిన రాజకీయ పోటీ.... మరికొన్నాళ్లలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలు ప్రధానకారణాలని వేరే చెప్పనవసరం లేదు. రాజకీయంగా లబ్ధిపొందాలని జయలలిత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సరిగ్గా ఆ ఉద్దేశంతోనే కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం దానికి అడ్డుపడింది. 

 

యావజ్జీవ శిక్ష పడిన ఖైదీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకూ, కేంద్ర ప్రభుత్వానికీ ఉండే అధికారాలు ఎలాంటివో...అనుసరించాల్సిన మార్గమేమిటో తాజా తీర్పులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నిర్దేశించింది. అయిదుగురు న్యాయమూర్తులున్న ధర్మాసనం 3-2 మెజారిటీతో ఈ తీర్పునిచ్చింది.  అయితే రెండు తీర్పులూ యావజ్జీవ శిక్ష అంటే జీవితాంతం జైల్లో ఉండటమేనన్న అంశంలోనూ, ఆ శిక్షలో మినహాయింపూ లేదా వెసులుబాటు కోరడానికి రాజ్యాంగంలోని అధికరణలకింద ఖైదీలకుండే హక్కుల విషయంలోనూ ఏకీభావం ప్రకటించాయి. కానీ ఒకసారి మరణశిక్ష పడి, అది యావజ్జీవశిక్షగా మారిన ఖైదీలను జస్టిస్ దత్తు నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులూ ప్రత్యేక కేటగిరీగా పరిగణించి...అలాంటివారికి యావజ్జీవ శిక్షలో మినహాయింపు కోరే హక్కు ఇక ఉండబోదని తేల్చి చెప్పారు.

 

మిగిలిన ఇద్దరు న్యాయమూర్తులు మాత్రం అలాంటి విచక్షణను ప్రదర్శించే అధికారం న్యాయస్థానాలకు ఉండదని అభిప్రాయపడ్డారు.  అయితే రాజీవ్‌గాంధీ హంతకుల విషయంలో జయలలిత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలోని గుణదోషాల జోలికి న్యాయమూర్తులు వెళ్లలేదు. ఆ అంశాన్ని ముగ్గురు న్యాయమూర్తుల నేతృత్వంలోని మరో ధర్మాస నం వేరేగా విచారిస్తున్నది. కానీ ఇప్పుడిచ్చిన తీర్పు జయ ప్రభుత్వానికి విఘాతమనే చెప్పాలి. వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఏడుగురి విడుదలనూ తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకునే పక్షంలో వారి విడుదలకు సహకరించాలని ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని  కోరే అవకాశం ఉంది.

 

ఇక నేర శిక్షాస్మృతిలోని నిబంధనల కింద ఖైదీల శిక్షలో మినహాయింపునిచ్చేందుకు ప్రభుత్వాలకుండే అధికారానికి పరిమితులు విధించడం సబబుకాదని ఇద్దరు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. అంతేకాదు...శిక్షలో మినహాయింపు ఇచ్చే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానిదేనన్న మెజారిటీ అభిప్రాయంతోనూ వారు విభేదించారు.  నేర శిక్షాస్మృతిలోని 432(7) నిబంధన ప్రకారం కేంద్ర సంస్థలు దర్యాప్తు జరిపిన కేసుల విషయంలో ఖైదీలకు మినహాయింపు ఇవ్వాలో లేదో నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని సొలిసిటర్ జనరల్ వాదనకే మెజారిటీ న్యాయమూర్తులు మొగ్గుచూపారు. 

 

శిక్షాకాలానికి ముందే విడుదల కావొచ్చునన్న ఖైదీల ఆశలపై న్యాయస్థానాలు నీళ్లు చల్లరాదని తమిళనాడు ప్రభుత్వం తరఫు న్యాయవాది చేసిన వాదనను తోసిపుచ్చుతూ దోషుల చేతుల్లో హత్యకు గురైనవారిపై ఆధారపడిన వ్యక్తులకు కూడా అలాంటి ఆశలుంటాయని, వారి మాటేమిటని ధర్మాసనం ప్రశ్నించింది. ఇలా రెండు ప్రయోజనాలమధ్య పోటీ పెట్టే పక్షంలో ఖైదీల ముందస్తు విడుదల ఎప్పుడూ తప్పే అవుతుంది. అయితే నేరస్తులను సమాజంనుంచి వేరుపరిచి ఖైదు చేయడంలోని ఉద్దేశం వారిలో పరివర్తన తీసుకురావడం, వారిని సంస్కరిం చడం. అందువల్లే మారారనుకునేవారికి శిక్ష తగ్గింపునిచ్చే అధికారాన్ని మన రాజ్యాంగమూ, చట్టాలూ ప్రభుత్వాలకు కల్పించాయి.

 

ఈ అధికారాలు దుర్వి నియోగమవుతున్నాయనే విషయంలో వేరే వాదనకు తావులేదు. ప్రస్తుత కేసులో ఖైదీల పరివర్తన అంశంకాక వారి ముందస్తు విడుదలవల్ల కలిగే ప్రయో జనాలే పాలకులకు ముఖ్యమయ్యాయి. ఇలాంటి రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఖైదీల ముందస్తు విడుదలపై తటస్థంగా వ్యవహరించగల యంత్రాంగాన్ని ఏర్పరిచి, దాని సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వాలు తుది నిర్ణయం తీసుకునే విధానం అమల్లో పెడితే బాగుంటుంది. సుప్రీంకోర్టు తాజా తీర్పు వెలుగులో దీనిపై కేంద్రం ఆలోచించాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement