రాజీవ్ హంతకులకు లభించని ఊరట
విడుదలపై స్టే పొడిగించిన సుప్రీంకోర్టు
రాజ్యాంగ ధర్మాసనానికి కేసు
చీఫ్ జస్టిస్ సదాశివం తుది తీర్పు
చెన్నై మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులను జైలు నుంచి విడుదల చేయాలని నిర్ణయించిన తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. వారి విడుదలపై గతంలో ఇచ్చిన మధ్యంతర స్టేను పొడిగిస్తూ శుక్రవారం సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. శిక్ష తగ్గింపు విషయాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. దీంతో ఏడుగురు నిందితుల జైలు జీవిత విముక్తికి బ్రేక్ పడింది. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ విచారించిన చీఫ్ జస్టిస్ సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం.. దోషుల శిక్ష తగ్గింపు అంశంపై రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకుంటుందని, దాని కోసం ఏడు ప్రశ్నలను రూపొందించామని తెలిపింది. ఇలాంటి కేసును సుప్రీం విచారించడం ఇదే తొలిసారని, ప్రామాణిక తీర్పు రావాలంటే విస్తృతంగా సలహాలు తీసుకోవాల్సి ఉంటుందని చీఫ్ జస్టిస్‌గా చివరి తీర్పునిచ్చిన జస్టిస్ సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. శిక్ష తగ్గింపుపై ఆర్టికల్ 72 ప్రకారం రాష్ట్రపతి, ఆర్టికల్ 161 ప్రకారం గవర్నర్, ఆర్టికల్ 32 ప్రకారం కోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత.. మళ్లీ దానిపై పాలకులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అనే విషయాన్ని స్పష్టం చేయడానికి పిటిషన్‌ను రాజ్యాంగ ధర్మాసననానికి బదిలీ చేస్తున్నామని సుప్రీం తెలిపింది. మూడు నెలల్లోగా ఆ కేసును రాజ్యాంగ ధర్మాసనం చేపట్టాలని సుప్రీం చెప్పింది.
దోషుల కుటుంబాల్లో నిరాశ
తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంతో తమ వారు జైలు నుంచి విడుదలవుతారని ఆశపడ్డ దోషుల కుటుంబ సభ్యలకు సుప్రీం కోర్టు నిర్ణయం నిరాశ మిగిల్చింది. ఇంకెతకాలం బాధ పడాలో తెలియడం లేదని దోషుల్లో ఒకరైన పెరారివాలన్ తల్లి అర్పుదమ్మాళ్ ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ పోరాటం చేస్తానని తెలిపారు. కాగా, నిందితులను విడుదల చేయాలని ఫిబ్రవరి 19న తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రోజే తమిళ ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీం స్టే విధించింది.
బీజేపీ మౌనం వీడదెందుకు
పార్లమెంట్‌పై దాడిచేసిన అప్జల్ గురు విషయంలో మాట్లాడే బీజేపీ రాజీవ్ గాంధీ హంతకుల విషయంలో ఎందుకు మౌనం వీడడం లేదని కాంగ్రెస్ పార్టీ నేత కపిల్ సిబల్ ప్రశ్నించారు. రాజీవ్ హంతకుల్ని ఉరితీయాలని మోడీ ఎందుకు కోరడంలేదని ఆయన ప్రశ్నించారు.