
రాజీవ్ హంతకులకు విముక్తి !
మూడు రోజుల్లోగా విడుదల చేయాలని నిర్ణయించిన తమిళనాడు సర్కారు
కేంద్రానికీ అదే గడువు.. లేదంటే తామే విడుదల చేస్తామన్న జయ
{పభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన తమిళనాడు ప్రతిపక్షాలు
ఈలం మద్దతుదారుల సంబరాలు
సాక్షి, చెన్నై/న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషులకు 23 ఏళ్ల జైలు జీవితాన్నుంచి విముక్తి లభించనుంది. ముగ్గురు ఖైదీలకు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 24 గంటల్లోపే ఖైదీలందర్నీ విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం బుధవారం అనూహ్యంగా నిర్ణయం తీసుకుంది.
దీంతో ఉరిశిక్ష నుంచి యావజ్జీవ శిక్షకు మారిన శంతనన్, మురుగన్ (ఈ ఇద్దరూ శ్రీలంకకు చెందిన తమిళులు), పెరారివాలన్‌లతో పాటు వేలూరు జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న నళిని, రాబర్ట్ పయస్, జయకుమార్, రవిచంద్రన్‌ల విడుదలకు మార్గం సుగమమైంది. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి జయలలిత కేబినెట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి రాజీవ్ హంతకులను మూడు రోజుల్లో విడుదల చేయాలనే డెడ్‌లైన్ విధించుకోవడంతో పాటు కేంద్రానికి కూడా అదే గడువునిస్తూ తీర్మానించారు. దీనిపై జయ అసెంబ్లీలో మాట్లాడుతూ.. సీఆర్‌పీసీ సెక్షన్ 435 ప్రకారం కేంద్ర అనుమతి కోసం తీర్మానాన్ని పంపుతున్నామని, మూడు రోజుల్లోగా కేంద్రం అనుమతివ్వకపోతే సెక్షన్ 432 ప్రకారం రాష్ట్రానికి ఉన్న అధికారాల్ని వినియోగించి ఖైదీలందర్నీ విడుదల చేస్తామన్నారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ మినహా డీఎంకే, సీపీఐ, ఎండీఎంకే పార్టీలు స్వాగతించాయి. ప్రకటన అనంతరం తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఈలం మద్దతు దారులు సంబరాలు చేసుకున్నారు.
అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి, కాంగ్రెస్ నేత జ్ఞానదేశికన్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది ఆందోళన చెందాల్సిన విషయమేనని రాజ్యసభలో బీజేపీ డిప్యూటీ నేత రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. కాగా, ఖైదీల విడుదలపై లోక్‌సభలో డీఎంకే నేత టీఆర్ బాలు మాట్లాడుతున్నపుడు.. ఏఐఏడీఎంకే సభ్యుడు తంబిదురై కలగజేసుకుని ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున దీనిపై చర్చ అనవసరం అని చెప్పారు.
‘అమ్మ’కు అభివందనం: అమ్మాళ్
ఖైదీలందర్నీ విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఖైదీ పెరారివాలన్ తల్లి అర్పుతమ్మాళ్ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘నిన్న నాకు కొంత సంతోషం కలిగింది. ప్రభుత్వ నిర్ణయం తర్వాత పట్టలేని ఆనందంతో ఉన్నాను. మరో తల్లి అనుభవిస్తున్న బాధని అమ్మ (జయలలిత) పరిగణనలోకి తీసుకున్నారు. నా బాధకు ఆమె ముగింపు పలికా రు’’ అని పీటీఐ వార్తా సంస్థకు అమ్మాళ్ చెప్పారు.
అదో వికృత నిర్ణయం: కాంగ్రెస్
రాజీవ్ హంతకుల విడుదలపై జయలలిత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ప్రజాకర్షణ కోసం బాధ్యతారాహిత్యంతో కూడిన వికృత నిర్ణయమని ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి మండిపడ్డారు. హోం మంత్రి షిండే మాట్లాడుతూ.. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని క్షుణ్నంగా పరిశీలించాలన్నారు. మరో మంత్రి చిదంబరం మాట్లాడుతూ.. తాను సంతోషంగా ఉన్నానో, విచారంగా ఉన్నానో చెప్పలేనని అన్నారు. రాజీవ్ లేని లోటు పూడ్చలేనిదన్నారు.
దోషులు అమాయకులు అని సుప్రీంకోర్టు చెప్పలేదన్నారు. అయితే శిక్ష తగ్గిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పుకు కేంద్రం కట్టుబడి ఉంటుందని న్యాయమంత్రి కపిల్ సిబల్ చెప్పారు. ఈ విషయంలో బీజేపీ మౌనం పాటిస్తోందంటూ మండిపడ్డారు. రాజీవ్ హత్య దుర్ఘటనలో గాయాలతో బయటపడ్డ కాంగ్రెస్ నేత సులేమాన్ మాట్లాడుతూ.. దోషులను విడుదల చేయడంలో తప్పు లేదన్నారు.
సామాన్యుడు న్యాయాన్ని ఆశించగలడా?: రాహుల్
తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం పట్ల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. ‘‘ మా తండ్రి బలయ్యారు. మేము ఉరిశిక్షకు వ్యతిరేకులం. అయినా మాజీ ప్రధానిని చంపిన వాళ్లు విడుదల అవుతుంటే.. సామాన్యులు ఎలాంటి న్యాయాన్ని ఆశించాలి’’ అని రాహుల్ ప్రశ్నించారు. దోషులను ఉరి తీసినా తన తండ్రి తిరిగిరాడన్నారు. ఇది తన తండ్రికో, కుటుంబానికో సంబంధించిన విషయం కాదని, దేశానికి సంబంధించినదని ఉత్తర్‌ప్రదేశ్‌లోని జగ్‌దీష్‌పూర్‌లో చెప్పారు.