
'ప్రధానిని హత్య చేసినవారిని విడిచిపెడతారా?'
న్యూఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్యకేసు దోషుల విడుదలను అడ్డుకోడానికి యుపిఏ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ కేసులో హంతకులు ఏడుగురుని విడుదల చేయడానికి సిద్ధమైన తమిళనాడు సర్కార్ నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. రాజీవ్ హత్యకేసును టాడావంటి కేంద్ర చట్టాల కింద, సిబీఐ విచారించినందున, హంతకులను విడుదల చేసే అంశంలో కేంద్రానికి తెలపకుండా, కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్ణయం తీసుకోకూడదని కేంద్రం చెబుతోంది.
ఇదే అంశం మీద భారత ప్రధాన న్యాయమూర్తి ముందు గురువారం పిటిషన్ వేయడానికి సిద్ధమయినట్లు యూపిఏ వర్గాలు చెబుతున్నాయి. ఒక ప్రధానిని హత్య చేసిన వారిని ఎలా విడిచిపెడతారు? న్యాయం ఇలా ఉంటే ఇక సామాన్యులకు దిక్కేంటి అంటూ రాజీవ్‌గాంధీ తనయుడు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన వెంటనే మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం.. హంతకుల విడుదలను అడ్డుకునేందుకు సిద్ధమయింది. రాజీవ్ హంతకులను విడుదల చేయకూడదని ప్రధాని కూడా పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు దోషుల బంధువులు రాహుల్ ను క్షమాభిక్ష కోరేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.