
నిర్భయ కేసు : ఆ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ కేసులో దోషులను రెండు వారాల్లో ఉరితీయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం తోసిపుచ్చింది. నిర్భయ కేసులో నలుగురు దోషులు ముఖేష్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్‌లను ఉరితీయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసులో ముగ్గురు దోషుల మరణ శిక్షపై వారు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌లను కోర్టు తిరస్కరించి నాలుగున్నర మాసాలైనా వారికి మరణ శిక్ష ఇంతవరకూ అమలు కాలేదని తన పిటిషన్‌లో శ్రీవాస్తవ అభ్యంతరం వ్యక్తం చేశారు. హత్యాచార కేసుల్లో నిందితుడిపై ఎనిమిది నెలల్లోనే దిగువ కోర్టు నుంచి సర్వోన్నత న్యాయస్ధానం వరకూ చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
మరణ శిక్ష అమలులో జాప్యం చెడు సంకేతాలు పంపుతుందని, ఫలితంగా దేశంలో రోజూ నిత్యం లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నీచమైన నేరాలకు పాల్పడితే తమకు ఎలాంటి హాని జరగదనే తప్పుడు సంకేతాలు రేపిస్టుల మనసులో చెలరేగుతాయని పిటిషన్ పేర్కొంది. హత్యాచార కేసుల్లో మరణ శిక్ష విధించబడ్డ నిందితులను సత్వరమే ఉరితీసేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కూడా పిటిషన్ కోరింది.
2012 డిసెంబర్ 16 అర్ధరాత్రి దేశరాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో 23 సంవత్సరాల పారామెడికల్ విద్యార్ధినిపై సామూహిక లైంగిక దాడి జరిపిన ఆరుగురు వ్యక్తులు ఆమెను బస్సు నుంచి తోసివేయడంతో తీవ్ర గాయాలతో బాదితురాలు అదే నెల 29వ తేదీన సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. నిర్భయ ఘటనగా పేరొందిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.