నిర్భయ కేసు నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ, వారికి మరణశిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చిన తర్వాత రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దోషులకు మరణదండన సరైందా, కాదా అన్న చర్చ సంగతలా ఉంచి ఆ కేసులో నిందితుల తరఫున వాదించిన న్యాయవాది ఒకరు ఆ తీర్పుపై నిప్పులు కక్కిన తీరు, ఆ సందర్భంగా మాట్లాడిన మాటలు అందర్నీ దిగ్భ్రాంతిపరిచాయి. దాన్నుంచి దేశం ఇంకా తేరుకోకముందే కర్ణాటక ప్రభుత్వం సెక్రటేరియట్‌లో పనిచేస్తున్న సిబ్బందికి ‘డ్రెస్ కోడ్’ విధిస్తూ వెలువరించిన సర్క్యులర్ అలజడి సృష్టించింది.
తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ సర్క్యులర్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించిందిగానీ... అసలు అలాంటి సర్క్యులర్ జారీచేయడం వెనకున్న ధోరణి ప్రమాదకరమైనది. నిర్భయ కేసు నిందితుల తరఫున వాదించిన న్యాయవాది ఆలోచనలకూ, ఈ సర్క్యులర్ రచయిత ఆలోచనాధోరణికి మధ్య పెద్దగా తేడా ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది. లైంగిక నేరాలు నానాటికీ పెరిగిపోతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. నిర్భయ ఉదంతానికి ముందూ, ఆ తర్వాత కూడా ఎన్నో అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయి. గత ఏడాది మొత్తంగా మహిళలపై 2,45,000 నేరాలు జరిగాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఆ సంఖ్య చాలా ఎక్కువ. పోలీసులు శ్రద్ధపెట్టక పోవడం వల్లా, దర్యాప్తు సంవత్సరాల తరబడి సాగుతుండటంవల్లా న్యాయ స్థానాల్లో నేరనిరూపణ అవకాశాలు తగ్గిపోయి నిందితులు తేలిగ్గా తప్పించుకో గలుగుతున్నారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖే ఆమధ్య తెలియజేసింది. ఇలాంటి లోపాల నివారణకు మార్గం సూచిస్తే ఈ దుస్థితిని సరిదిద్దినవారవుతారు.
కానీ, నిర్భయ తరఫు న్యాయవాదైనా, కర్ణాటక ప్రభుత్వం జారీచేసిన సర్క్యులర్ అయినా చేసింది అది కాదు. నేరం జరిగినప్పుడల్లా బాధితులనే దోషులుగా చూసే సాధారణ మనస్తత్వమే అందులో కనబడుతుంది. న్యాయవాది ఏపీ సింగ్ తన క్లయింటులకు ఉరిశిక్ష విధించడంపై తీవ్రంగా స్పందించారు. ‘నా కూతురే గనుక వివాహానికి ముందు మగ స్నేహితుడితో తిరిగితే నిలువునా తగలబెట్టేవాడిన’ని నోరుపారేసుకున్నారు. నిర్భయకు జరిగినలాంటిది తన బిడ్డకు జరగనివ్వనని, అలా వెళ్లినట్టు తెలిసిన వెంటనే తానే చంపేస్తానని చెప్పారు. దేశంలో తల్లిదండ్రులందరూ అలాగే చేయాలని కూడా ఆయన కోరారు. అంతక్రితం తీర్పు వెలువడిన రోజున కూడా ఆయన మాటల తీరు ఇలాగే ఉంది. ‘ఈ కేసులో అప్పీల్‌కు రెండు నెలలు వేచిచూస్తా... ఈ తీర్పు ప్రభావంతో అప్పటివరకూ దేశంలో ఎక్కడా అత్యాచారాలు జరగకుండా ఉంటే అసలు అప్పీలే చేయను’ అంటూ నిప్పులు కక్కారు. సమాజం అభివృద్ధి చెందుతున్నదని, మహిళలకు అన్నిరంగాల్లోనూ సమానావకాశాలు లభిస్తున్నాయని... చదువు ల్లోనూ, ఉద్యోగాల్లోనూ వారు రాణిస్తున్నారని అందరూ అనుకుంటున్నా వివక్ష కొత్త కొత్త రూపాల్లో విస్తరిస్తోంది. మహిళలకు సంబంధించి పురుషుల ఆలోచనాధోరణిలో ఉన్న వెనకబాటుతనం పెరుగుతున్నదే కానీ తగ్గటం లేదు.
సుప్రీంకోర్టులో న్యాయవాదిగా దీర్ఘకాలంనుంచి తన వృత్తిలో ఉంటున్న వ్యక్తి నుంచే అలాంటి మాటలు వెలువడ్డాయంటే అది సాధారణ విషయం కాదు. ఆయన దృష్టిలో ఈ కేసులో నిర్భయే నేరస్తురాలు. ఆమె ఆరోజు ‘ఎవరితోనో’ సినిమాకు వెళ్లడంవల్లా, ఆ ఆరుగురి వ్యక్తుల కంటబడటంవల్ల వారు నేరం చేయాల్సివచ్చిందని ఆయన భావన. గెలిచితీరగలమన్న కేసు ఓడిపోవడంవల్ల కలిగిన నిరాశా నిస్పృహల్లోంచి మాట్లాడిన మాటలు కావవి... మగ దురహంకారంతో, పితృస్వామిక భావజాలం నరనరానా జీర్ణించుకోవడంవల్ల పలికిన పలుకులవి. కర్ణాటక ప్రభుత్వం గత గురువారం ఇచ్చిన సర్క్యులర్ వెనకున్న ధోరణి కూడా ఇదే. కాకపోతే, మహిళలకు మాత్రమే డ్రస్‌కోడ్ చెబితే వివాదం తలెత్తుతుందనుకున్నారో, ఏమోగానీ పురుషులకు కూడా డ్రస్ కోడ్ విధించారు.
మహిళలు ‘రెచ్చగొట్టే తరహా’ దుస్తులు వేసుకోకూడదని చెబుతూ, అవేమిటో ఏకరువు పెట్టారు. అందులో డిజైనర్ బ్లౌజుల నుంచి రకరకాలవి ఉన్నాయి. చీర లేదా సల్వార్ కమీజ్ మాత్రమే ధరించాలని సూచించారు. పురుషులు జీన్స్, టీషర్టులు వేసుకోవడం నిషిద్ధమన్నారు. అత్యాచార ఘటనలు జరిగినప్పుడల్లా వినవచ్చే వాదనే ఇది. ఆమధ్య ఒక టీవీ చానెల్ సర్వే చేసినప్పుడు మహిళలు ధరించే దుస్తులవల్లే వారిపై అత్యాచారాలు జరుగుతున్నాయని 53 శాతం మంది పురుషులు అభిప్రాయపడ్డారు. అయితే, వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. మూడు, నాలుగేళ్ల పసిపిల్ల నుంచి పెద్ద వయసువారి వరకూ అందరిపైనా ఇలాంటి నేరాలు జరిగాయి. ధరించిన దుస్తులను బట్టి నేరం జరిగిందనడానికి ఎలాంటి దాఖలా లభించలేదు.
ధరించే దుస్తులనుబట్టే నేరం జరుగుతున్నదనడమంటే నేరానికి అసలు కారకులు మహిళలని చెప్పడమే కాదు... పురుషులందరూ తమను తాము అదుపుచేసుకోలేనివారని, నేరపూరిత మనస్తత్వం కలవారని చెప్పడం కూడా. ఇంతటి మతిమాలిన సర్క్యులర్‌పై సహజంగానే మహిళల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అటుతర్వాత దాన్ని ఉపసంహరించుకున్నారు. అందుకు బదులుగా ‘ప్రభుత్వ ప్రతిష్టకు అనుగుణ మైన’ రీతిలో దుస్తులు ధరించాలని కొత్త సర్క్యులర్ విడుదలైంది. ఏ ఉద్యోగైనా ముందు వ్యక్తిత్వమున్న మనిషి. ఆ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు. వేసుకునే దుస్తులు కూడా అందులో ఒక భాగం. సమాజంలో ఉండే దురభిప్రాయాలను పారదోలడానికి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు ఆ పని చేయకపోగా వాటిని మరింత పెంచేలా వ్యవహరిస్తున్నాయన డానికి ఇలాంటి సర్క్యులర్‌లు ఉదాహరణ. ప్రభుత్వాలే ఇలా వెనకబాటుతనాన్ని ప్రదర్శిస్తుంటే సుప్రీంకోర్టు న్యాయవాది అలా మాట్లాడటంలో వింతేముంది?
ప్రమాదకర ధోరణి!
Published Tue, Sep 17 2013 11:52 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement