న్యూఢిల్లీ: తీహార్ జైలు అధికారులు తమకు సహకరించడం లేదంటూ నిర్భయ దోషులు ఢిల్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. క్యూరేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు వేసేందుకు అవసరమైన పత్రాలను అధికారులు ఇవ్వడం లేదని ఉరిశిక్ష పడిన నలుగురిలో ముగ్గురు శుక్రవారం కోర్టులో పిటిషన్లు వేశారు. వినయ్ కుమార్ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌కు అవసరమైన 70 పేజీల డైరీ ప్రతితోపాటు అక్షయ్‌కుమార్ సింగ్, పవన్ సింగ్ క్యూరేటివ్ పిటిషన్‌లకు జైలు అధికారులు కొన్ని పత్రాలను ఇవ్వాల్సి ఉందని అందులో తెలిపారు.
అవి లేనందున వెంటనే దరఖాస్తు చేయలేకపోయామని, వాటిని వెంటనే ఏర్పాటు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఇందుకోసం ఈ పిటిషన్‌ను అత్యవసరంగా భావించి విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పటియాలా హౌస్ కోర్టులో వేసిన ఈ పిటిషన్లు శనివారం విచారణకు వచ్చే అవకాశాలున్నాయి. కాగా, వినయ్, ముకేశ్ సింగ్‌లు ఆఖరిప్రయత్నంగా వేసిన క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. దీంతోపాటు ముకేశ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఉరిశిక్ష అమలును పలు విధాలుగా సవాలు చేస్తూ కాలం గడిపేయొచ్చనే అభిప్రాయం దోషుల్లో ఏర్పడరాదంటూ గురువారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment