Tihar Jail authorities
-
నిర్భయ కేసు: చివరి కోరికల్లేవ్ కానీ ఉరి తర్వాత!
సాక్షి, న్యూఢిల్లీ: ఉరి అమలుకు ముందు నిర్భయ దోషులు చివరి కోరిక చెప్పలేదని తీహార్ జైలు అధికారులు వెల్లడించారు. అయితే ఇద్దరు దోషులు తాము చనిపోయాక చేయాల్సిన పనుల గురించి జైలు సిబ్బందికి చెప్పినట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టరు నెహాల్ బన్సాల్ ఉరికి గంట ముందు జైలుకి వెళ్లి దోషుల చివరి కోరికల గురించి తెలుసుకున్నారు. దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ మరణానంతరం అవయవాలను దానం చేయాలని కోరాడు. అవయదానానికి అవసరమైన పత్రంపై కూడా సంతకాలు చేశాడని అధికారులు వెల్లడించారు. (చదవండి: జైల్లో నిర్భయ దోషుల సంపాదనెంతో తెలుసా..!) అయితే ఉరి తీసిన అనంతరం అరగంటపాటు వారి శరీరాలను అలానే వేలాడదీయడంతో కీలక అవయవాలు దానానికి పనికిరావని తెలుస్తోంది. ముఖేష్ సింగ్ ఉరికి ముందు తనను ఉరి తీయొద్దంటూ బతిమాలాడుతూ, తీవ్ర మనోవేదనకు గురయ్యాడని తెలుస్తోంది. మరో దోషి వినయ్ శర్మ కూడా తన మరణానంతరం.. జైల్లో ఉన్నప్పుడు తాను వేసిన పెయింటింగులను సూపరింటెండెంట్‌కు ఇవ్వాలని కోరాడు. తాను చదివిన హనుమాన్ చాలీసా పుస్తకాన్ని, తన ఫొటోగ్రాఫ్‌ను కుటుంబానికి అందించాలి కోరాడు. మిగతా ఇద్దరు పవన్ గుప్తా, అక్షయ్ సింగ్ మాత్రం ఎలాంటి కోరికా కోరలేదని సమాచారం. (చదవండి: నిర్భయ కేసు: 30 నిమిషాలపాటు ఉరి తీశాం!) -
‘తీహార్’ అధికారులు సహకరించట్లేదు!
న్యూఢిల్లీ: తీహార్ జైలు అధికారులు తమకు సహకరించడం లేదంటూ నిర్భయ దోషులు ఢిల్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. క్యూరేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు వేసేందుకు అవసరమైన పత్రాలను అధికారులు ఇవ్వడం లేదని ఉరిశిక్ష పడిన నలుగురిలో ముగ్గురు శుక్రవారం కోర్టులో పిటిషన్లు వేశారు. వినయ్ కుమార్ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌కు అవసరమైన 70 పేజీల డైరీ ప్రతితోపాటు అక్షయ్‌కుమార్ సింగ్, పవన్ సింగ్ క్యూరేటివ్ పిటిషన్లకు జైలు అధికారులు కొన్ని పత్రాలను ఇవ్వాల్సి ఉందని అందులో తెలిపారు. అవి లేనందున వెంటనే దరఖాస్తు చేయలేకపోయామని, వాటిని వెంటనే ఏర్పాటు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఇందుకోసం ఈ పిటిషన్‌ను అత్యవసరంగా భావించి విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పటియాలా హౌస్ కోర్టులో వేసిన ఈ పిటిషన్లు శనివారం విచారణకు వచ్చే అవకాశాలున్నాయి. కాగా, వినయ్, ముకేశ్ సింగ్‌లు ఆఖరిప్రయత్నంగా వేసిన క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. దీంతోపాటు ముకేశ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఉరిశిక్ష అమలును పలు విధాలుగా సవాలు చేస్తూ కాలం గడిపేయొచ్చనే అభిప్రాయం దోషుల్లో ఏర్పడరాదంటూ గురువారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
జైలులో ‘తీహార్ ఐడల్’
న్యూఢిల్లీ: ఇండియన్ ఐడల్ తరహాలో తీహార్ జైలు అధికారులు ఖైదీల కోసం ‘తీహార్ ఐడల్’ రెండో సీజన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోను నిగమ్ మాట్లాడుతూ ఖైదీల ప్రదర్శన చూసిన తాను కంటి నుంచి నీరు కారకుండా తీవ్రంగా ప్రయత్నించానని చెప్పారు. వారి గానం ఆలకించిన తాను చలించి పోయానన్నారు. తన గాన మాధుర్యంతో అటు ఖైదీలను, ఇటు అధికారులను మైమరిపించిన సోను నిగమ్ ఖైదీలు కూడా అద్భుతంగా పాడారని ప్రశంసించారు. పాడాలన్న వారి తపన, అంకిత భావం తన కళ్లను చెమర్చకుండా ఆపలేకపోయిందని అన్నారు. ఓ జైలులో ప్రదర్శన ఇవ్వడం తనకు ఇదే మొదటిసారి అని, ఇక్కడ ఇటువంటి అనుభవాన్ని ఎదుర్కొంటానని తానెప్పుడూ ఊహించలేదని చెప్పారు. ఇకపై తీహార్ ఐడల్ 3, 4, ఐదుతో పాటు భవిష్యత్తులో కూడా అన్ని పాటల పోటీలకు హాజరవుతానని సోను జైలు అధికారులకు హామీ ఇచ్చారు. ప్రముఖ గాయకులు రాజా హసన్, నందినీ దేవ్, నటి ఆకృతి భారతి, సోను నిగమ్ తండ్రి ఆగమ్ నిగమ్ కూడా ఇక్కడ ప్రదర్శనలిచ్చారు. వచ్చే మే నెల వరకూ జైలు ఆవరణలోనే ఈ పోటీలు కొనసాగనున్నాయి. ఢిల్లీ జైళ్ల డీఐజీ ముఖేశ్ ప్రసాద్, ఒకటో నంబరు జైలు సూపరింటెండెంట్ రాజేశ్ చౌహాన్ ఇతర జైలు ఉన్నతాధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ మిషన్‌కు తన మద్దతు తెలిపిన సోను నిగమ్ ముందుగా ప్రభుత్వం తన విధి నిర్వహించాలని, ఆ తరువాత పరిశుభ్రత పాటించని వారికి జరిమానాలు విధించాలన్నారు.