జైలులో ‘తీహార్ ఐడల్’ | Sonu Nigam fights to hold back tears at launch of 'Tihar idol' | Sakshi
Sakshi News home page

జైలులో ‘తీహార్ ఐడల్’

Published Wed, Nov 12 2014 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM

జైలులో ‘తీహార్ ఐడల్’

జైలులో ‘తీహార్ ఐడల్’

న్యూఢిల్లీ: ఇండియన్ ఐడల్ తరహాలో తీహార్ జైలు అధికారులు ఖైదీల కోసం ‘తీహార్ ఐడల్’ రెండో సీజన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోను నిగమ్ మాట్లాడుతూ ఖైదీల ప్రదర్శన చూసిన తాను కంటి నుంచి నీరు కారకుండా తీవ్రంగా ప్రయత్నించానని చెప్పారు. వారి గానం ఆలకించిన తాను చలించి పోయానన్నారు. తన గాన మాధుర్యంతో అటు ఖైదీలను, ఇటు అధికారులను మైమరిపించిన సోను నిగమ్ ఖైదీలు కూడా అద్భుతంగా పాడారని ప్రశంసించారు. పాడాలన్న వారి తపన, అంకిత భావం తన కళ్లను చెమర్చకుండా ఆపలేకపోయిందని అన్నారు.

ఓ జైలులో ప్రదర్శన ఇవ్వడం తనకు ఇదే మొదటిసారి అని, ఇక్కడ ఇటువంటి అనుభవాన్ని ఎదుర్కొంటానని తానెప్పుడూ ఊహించలేదని చెప్పారు. ఇకపై తీహార్ ఐడల్ 3, 4, ఐదుతో పాటు భవిష్యత్తులో కూడా అన్ని పాటల పోటీలకు హాజరవుతానని సోను జైలు అధికారులకు హామీ ఇచ్చారు. ప్రముఖ గాయకులు రాజా హసన్, నందినీ దేవ్, నటి ఆకృతి భారతి, సోను నిగమ్ తండ్రి ఆగమ్ నిగమ్ కూడా ఇక్కడ ప్రదర్శనలిచ్చారు.

వచ్చే మే నెల వరకూ జైలు ఆవరణలోనే ఈ పోటీలు కొనసాగనున్నాయి. ఢిల్లీ జైళ్ల డీఐజీ ముఖేశ్ ప్రసాద్, ఒకటో నంబరు జైలు సూపరింటెండెంట్ రాజేశ్ చౌహాన్ ఇతర జైలు ఉన్నతాధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ మిషన్‌కు తన మద్దతు తెలిపిన సోను నిగమ్ ముందుగా ప్రభుత్వం తన విధి నిర్వహించాలని, ఆ తరువాత పరిశుభ్రత పాటించని వారికి జరిమానాలు విధించాలన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement