సంపాదకీయం: దేశం నలుమూలలా ఆగ్రహావేశాలు రగిలించిన, ఆందోళన కలిగించిన ఢిల్లీ అత్యాచార ఉదంతంలో దోషులుగా నిర్ధారించిన నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ ఢిల్లీ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. పట్టుబడిన మరో నిందితుడు విచారణ కాలంలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, ఇంకొక నిందితుడిని బాలనేరస్థుడిగా పరిగణించి జువైనల్ బోర్డు మూడేళ్ల శిక్ష విధించింది. నిరుడు డిసెంబర్ 16 రాత్రి ఢిల్లీ వీధుల్లో నడుస్తున్న బస్సులో 23 ఏళ్ల యువతిపై వీరంతా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటించిన యువతిపై అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. ఆమెతోపాటు ఆమె స్నేహితుణ్ణి కూడా తీవ్రంగా గాయపరిచారు. నెత్తురోడుతున్న ఆ ఇద్దరినీ ఒంటిపై దుస్తులు కూడా మిగల్చకుండా నడుస్తున్న బస్సులో నుంచే బయటకు నెట్టేశారు. ఆ నిశిరాతిరి వణికించే చలిలో ఆ ఇద్దరూ అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు. ఢిల్లీలో అత్యాచారాలు కొత్త కాదు. ఈ ఘటన తర్వాత కూడా అవి నిత్యమూ కొనసాగుతూనే ఉన్నాయి. కానీ, ఈ కేసులో నిందితులందరూ ఆ ఇద్దరిపై, ప్రత్యేకించి ఆమెపై సాగించిన దుర్మార్గం అందరినీ కలచివేసింది. కేవలం క్రూరమృగాలతో మాత్రమే పోల్చగల ప్రవర్తనతో నిందితులందరూ సమాజం మొత్తాన్ని దిగ్భ్రాంత పరిచారు. అందువల్లే ఈ ఘటనపై దేశమంతటా నిరసనలు వెల్లువెత్తాయి.
వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ప్రతిచోటా ధర్నాలు, ర్యాలీలు జరిగాయి. దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజలంతా ముక్తకంఠంతో డిమాండు చేశారు. దోషులకు ఉరిశిక్ష విధించాలన్న డిమాండు వచ్చింది. ఈ కేసులో ఒకరిని బాలనేరస్థుడిగా నిర్ధారించి మూడేళ్ల శిక్షతో సరిపెట్టడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే వెలుపల ఆనందోత్సాహాలు వ్యక్తం కావడమైనా, మిఠాయిలు పంచుకోవడమైనా చూస్తే ఇన్ని నెలలు గడిచినా ఆ ఘటన ప్రభావం ఏ స్థాయిలో ఉన్నదో అర్ధమవుతుంది.
నిర్భయ ఉదంతం తర్వాత ప్రభుత్వం చురుగ్గానే కదిలింది. వెనువెంటనే జస్టిస్ జేఎస్ వర్మ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని నియమించడం, దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచీ వచ్చిన సుమారు 80,000 సూచనలను క్రోడీకరించి వారు సవివరమైన నివేదికను సమర్పించడం చకచకా పూర్తయ్యాయి. వాటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. అటు తర్వాత జరిగిన పార్లమెంటు సమావేశాల్లో దాని స్థానంలో బిల్లు ప్రవేశపెట్టి చట్టం కూడా చేశారు. దేశ రాజధాని నగరంలో ఎడతెగకుండా జరిగిన ఆందోళనవల్లా, దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబకడంవల్లా ఇదంతా సాధ్యమైంది. ఈ అత్యాచారం కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగించడం, పోలీసులు కూడా దర్యాప్తును వేగవంతం చేయడం, సాక్ష్యాధారాలను సేకరించి న్యాయస్థానం ముందు పెట్టి విచారణ సాధ్యమైనంత త్వరగా ముగిసేందుకు దోహదపడటం వంటివన్నీ ఆ నిరసనల పర్యవసానమే.
కింది నుంచి మీది వరకూ ఇలా ఎవరికి వారు తమ తమ పనుల్ని చురుగ్గా చేయడమనేది మహిళలకు సంబంధించిన అన్ని కేసుల్లోనూ సాధ్యమైతే ఆ తరహా నేరాలు చాలా వరకూ తగ్గిపోతాయి. దురదృష్టవశాత్తూ ఆ పరిస్థితి లేదు. ఢిల్లీ ఘటనకు మీడియాలో వచ్చిన విస్తృత ప్రచారం వల్లా, ఆ ఘటన ప్రపంచ దేశాలన్నిటా మన దేశ పరువు ప్రతిష్టలను దిగజార్చడం వల్లా ప్రభుత్వ విభాగాలన్నీ ఒక్కటై కదిలాయి. దేశాన్ని ఏలుతున్నవారు వాటినలా కదిలించారు. మిగిలిన కేసుల విషయంలో అంతటి శ్రద్ధ లేదు. నిర్భయ ఉదంతానికి ముందూ, తర్వాతా దేశవ్యాప్తంగా జరిగిన వేలాది అత్యాచార ఘటనలు యథాప్రకారం నత్తనడక నడుస్తున్నాయి. నిరుడు వివిధ కోర్టుల్లో అత్యాచారం ఘటనలకు సంబంధించిన కేసులు లక్ష పెండింగ్‌లో ఉండగా ఈ ఎనిమిది నెలల్లో శిక్ష పడినవి 14.5 శాతం మాత్రమే. అంటే కేవలం 14,700 కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయి.
వీటిలో 11,500 మంది నిర్దోషులుగా బయటికొస్తే... కేవలం 3,563 మందికి మాత్రమే శిక్షపడింది. నిర్భయ ఉదంతం జరిగిన ఢిల్లీలో ఆ ఏడాది 2,007 కేసులు నమోదైతే 1,404 పెండింగ్‌లో ఉన్నాయి. 15 శాతం కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షపడింది. మిగిలిన రాష్ట్రాల పరిస్థితి మరీ ఘోరం. ఉదాహరణకు పశ్చిమబెంగాల్‌లో 0.7 శాతం కేసుల్లోనూ, మహారాష్ట్రలో 1.1 శాతం కేసుల్లోనూ నిందితులకు శిక్షలు పడ్డాయి. ఇవన్నీ కింది కోర్టులకు సంబంధించిన లెక్కలు. వీటిలో అత్యధికం అప్పీల్‌కు వెళ్తాయి. అవి తేలడానికి మరిన్ని సంవత్సరాలు పడతాయి. మన రాష్ట్రంలో నిరుడుతో పోలిస్తే తొలి ఆరు నెలల్లోనూ అత్యాచారాలు 19.62 శాతం పెరిగాయి. నిర్భయ చట్టం అమల్లోకి తేవడంలో చూపిన వేగం... దాన్ని అమలు చేయడంలో ఇంకా కనబరచడంలేదని, సంబంధిత వ్యవస్థలను అవసరమైనంతగా కదిలించడంలేదని దీన్నిబట్టి అర్ధమవుతుంది. ఇలాంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి నిర్భయ కేసు తీర్పు దోహదపడుతుందనుకునేవారికి ఈ స్థితి విచారం కలిగిస్తుంది. దోషులను దండించడం, చట్టమంటే అందరిలోనూ భయం కలిగేలా చేయడం అవసరమే. కానీ, అలాంటి నేరాలకు దోహదం చేస్తున్న పరిస్థితులను మార్చకుండా, అందుకవసరమైన చైతన్యాన్ని ఏ స్థాయిలోనూ కలిగించకుండా... నేరాలను అరికట్టడం సాధ్యమవుతుందా? జస్టిస్ వర్మ కమిటీ ఆ అంశాల్లో ఇచ్చిన సిఫార్సులపైనా ప్రభుత్వం దృష్టిపెట్టాలి. మహిళలపై నేరాల విషయంలో పోలీసులు, అధికార యంత్రాంగం సున్నితంగా ఆలోచించేలా, చురుగ్గా కదిలేలా, బాధితులకు సత్వర న్యాయం లభించేలా చూడాలి. అప్పుడు మాత్రమే పరిస్థితులు చక్కబడటానికి మార్గం సుగమం అవుతుంది.
ఆ నలుగురికీ ఉరికంబం!
Published Sat, Sep 14 2013 12:14 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement