ఢిల్లీ: గోద్రా రైలు దహనం కేసులో దోషులకు ఎట్టకేలకు ఊరట లభించింది. గుజరాత్ అల్లర్లకు కారణమైన గోద్రా సబర్మతి రైలు దహనం కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఎనిమిది మందికి శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. అయితే మరో నలుగురికి మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది.
చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు శుక్రవారం బెయిల్ ఆదేశాలు జారీ చేసింది. ఎనిమిది మంది 17 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవించిన కారణంగా వాళ్లు బెయిల్‌కు అర్హులేనని ప్రకటించింది ధర్మాసనం. అయితే ఈ నేరంలో మరో నలుగురి పాత్ర తీవ్రత దృష్ట్యా వాళ్లకు బెయిల్ అభ్యర్థలనలను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది.
👉 2002, ఫిబ్రవరి 27వ తేదీన గుజరాత్ గోద్రా రైల్వే స్టేషన్ వద్ద సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లోని కొన్ని కోచ్‌లను తగలబెట్టారు. ఈ దుర్ఘటనలో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అయోధ్య కరసేవకు వెళ్లి తిరిగి వస్తున్నవాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఆ మరుసటి రోజు నుంచి గుజరాత్ భగ్గుమంది. ఈ పరిణామం.. గుజరాత్ అల్లర్లకు కారణమైంది.
👉 2011లో స్థానిక కోర్టు(ట్రయల్ కోర్టు) గోద్రా ఘటనకు సంబంధించి కేసులో.. 31 మందిని నిందితులుగా, 63 మంది నిర్దోషులుగా ప్రకటించింది. పదకొండు మందికి మరణశిక్ష, 20 మందికి జీవిత ఖైదు విధించింది ట్రయల్ కోర్టు.
👉 ఈ తీర్పును సవాల్ చేస్తూ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. గుజరాత్ హైకోర్టు 31 మందినీ దోషులుగానే ప్రకటించింది. కానీ, ట్రయల్ కోర్టు విధించిన 11 మంది మరణశిక్షను మాత్రం జీవిత ఖైదుగా మారుస్తూ తీర్పు ఇచ్చింది.
👉 గుజరాత్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. 2018లో సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయ్యింది. అది అప్పటి నుంచి పెండింగ్‌లో ఉంది.
👉 ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన బెయిల్ కోసం దోషులు పిటిషన్లు వేసుకోగా.. కొందరి బెయిల్ పిటిషన్లను(ట్రయల్ కోర్టు మరణ శిక్ష ఖరారు చేసిన దోషులకు) సుప్రీం కోర్టు తిరస్కరించింది. అయితే.. జీవిత ఖైదు పడిన వాళ్లకు మాత్రం బెయిల్ అభ్యర్థనలను పరిశీలిస్తామని పేర్కొంది. అంతకు ముందు..
👉 సోమవారం ఏప్రిల్ 17వ తేదీన సుప్రీం కోర్టులో దోషుల బెయిల్ అభ్యర్థనలపై విచారణ సందర్భంగా.. గుజరాత్ ప్రభుత్వం ఈ కేసులో గట్టి వాదనలే వినిపించింది. దోషులు తీవ్ర నేరాలను పాల్పడ్డారని, బోగీలకు బయటి నుంచి డోర్లను బిగించి మరీ మారణకాండకు పాల్పడ్డారని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలను వినిపించారు. అయితే ఇప్పటికే పదిహేడేళ్ల శిక్షఅనుభవించిన విషయాన్ని గుర్తు చేస్తూ దోషుల తరపు న్యాయవాది వాదనల్ని వినిపించారు.
👉 ఇక ఇవాళ్టి వాదనల తర్వాత ఎనిమిది మందికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది సీజేఐ నేతృత్వంలోని బెంచ్.
ఇదీ చదవండి: గుజరాత్ అల్లర్ల కేసు.. బీజేపీ నేతను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
Comments
Please login to add a commentAdd a comment