Godhra case
-
Bilkis Bano Case: సుప్రీంను ఆశ్రయించిన దోషులు
ఢిల్లీ: బిల్కిస్ బానో కేసులో తాము లొంగిపోయే గడువును పెంచాలని కోరుతూ దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నాలుగు నుంచి ఆరు వారాల పాటు పొడిగించాలని కోరుతూ ముగ్గురు దోషులు పిటిషన్ దాఖలు చేశారు. వారి పిటిషన్లను శుక్రవారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దోషులలో ఒకరైన గోవింద్‌భాయ్.. తన 88 ఏళ్ల తండ్రి, 75 ఏళ్ల తల్లిని చూసుకునే బాధ్యతను పేర్కొంటూ గడువు పొడిగింపును కోరాడు. తల్లిదండ్రులకు ఏకైక సంరక్షకుడనని ఆయన పేర్కొన్నాడు. మరో దోషి రమేష్ రూపాభాయ్ చందనా తన కుమారుడి పెళ్లికి సమయం కావాలని, ఆరు వారాల పొడిగింపును కోరాడు. మూడవ దోషి మితేష్ చిమన్లాల్ భట్ కూడా ఆరు వారాల పొడిగింపును అభ్యర్థించాడు. శీతాకాల పంట కోతకు సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు. 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అఘాయిత్యం చోటు జరిగింది. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. ఈ శిక్ష కాలాన్ని తగ్గిస్తూ గతేడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగానే వీళ్లను విడుదల చేసింది. అయితే.. ఈ అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. దోషులు మళ్లీ జైలులో జనవరి 21లోగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
గోద్రా కేసు..దోషులకు సుప్రీంకోర్టులో ఊరట
ఢిల్లీ: గోద్రా రైలు దహనం కేసులో దోషులకు ఎట్టకేలకు ఊరట లభించింది. గుజరాత్ అల్లర్లకు కారణమైన గోద్రా సబర్మతి రైలు దహనం కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఎనిమిది మందికి శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. అయితే మరో నలుగురికి మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు శుక్రవారం బెయిల్ ఆదేశాలు జారీ చేసింది. ఎనిమిది మంది 17 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవించిన కారణంగా వాళ్లు బెయిల్‌కు అర్హులేనని ప్రకటించింది ధర్మాసనం. అయితే ఈ నేరంలో మరో నలుగురి పాత్ర తీవ్రత దృష్ట్యా వాళ్లకు బెయిల్ అభ్యర్థలనలను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. 👉 2002, ఫిబ్రవరి 27వ తేదీన గుజరాత్ గోద్రా రైల్వే స్టేషన్ వద్ద సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లోని కొన్ని కోచ్‌లను తగలబెట్టారు. ఈ దుర్ఘటనలో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అయోధ్య కరసేవకు వెళ్లి తిరిగి వస్తున్నవాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఆ మరుసటి రోజు నుంచి గుజరాత్ భగ్గుమంది. ఈ పరిణామం.. గుజరాత్ అల్లర్లకు కారణమైంది. 👉 2011లో స్థానిక కోర్టు(ట్రయల్ కోర్టు) గోద్రా ఘటనకు సంబంధించి కేసులో.. 31 మందిని నిందితులుగా, 63 మంది నిర్దోషులుగా ప్రకటించింది. పదకొండు మందికి మరణశిక్ష, 20 మందికి జీవిత ఖైదు విధించింది ట్రయల్ కోర్టు. 👉 ఈ తీర్పును సవాల్ చేస్తూ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. గుజరాత్ హైకోర్టు 31 మందినీ దోషులుగానే ప్రకటించింది. కానీ, ట్రయల్ కోర్టు విధించిన 11 మంది మరణశిక్షను మాత్రం జీవిత ఖైదుగా మారుస్తూ తీర్పు ఇచ్చింది. 👉 గుజరాత్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. 2018లో సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయ్యింది. అది అప్పటి నుంచి పెండింగ్‌లో ఉంది. 👉 ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన బెయిల్ కోసం దోషులు పిటిషన్లు వేసుకోగా.. కొందరి బెయిల్ పిటిషన్లను(ట్రయల్ కోర్టు మరణ శిక్ష ఖరారు చేసిన దోషులకు) సుప్రీం కోర్టు తిరస్కరించింది. అయితే.. జీవిత ఖైదు పడిన వాళ్లకు మాత్రం బెయిల్ అభ్యర్థనలను పరిశీలిస్తామని పేర్కొంది. అంతకు ముందు.. 👉 సోమవారం ఏప్రిల్ 17వ తేదీన సుప్రీం కోర్టులో దోషుల బెయిల్ అభ్యర్థనలపై విచారణ సందర్భంగా.. గుజరాత్ ప్రభుత్వం ఈ కేసులో గట్టి వాదనలే వినిపించింది. దోషులు తీవ్ర నేరాలను పాల్పడ్డారని, బోగీలకు బయటి నుంచి డోర్లను బిగించి మరీ మారణకాండకు పాల్పడ్డారని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలను వినిపించారు. అయితే ఇప్పటికే పదిహేడేళ్ల శిక్షఅనుభవించిన విషయాన్ని గుర్తు చేస్తూ దోషుల తరపు న్యాయవాది వాదనల్ని వినిపించారు. 👉 ఇక ఇవాళ్టి వాదనల తర్వాత ఎనిమిది మందికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది సీజేఐ నేతృత్వంలోని బెంచ్. ఇదీ చదవండి: గుజరాత్ అల్లర్ల కేసు.. బీజేపీ నేతను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు -
గోద్రా దోషికి బెయిల్
న్యూఢిల్లీ: 2002 నాటి గోద్రా రైలు దహనం కేసులో దోషి, యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఫరూఖ్‌కు సుప్రీంకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. అతడు గత 17 ఏళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్నాడని, అందుకే బెయిల్ ఇస్తున్నట్లు వెల్లడించింది. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఫరూఖ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసులోని కొన్ని వాస్తవాలు, పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అతడి బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. 2002 ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోద్రా స్టేషన్లో ఆగిన సబర్మతి ఎక్స్‌ప్రెస్‌పై దుండుగులు నిప్పు పెట్టారు. ఎస్56 కోచ్ పూర్తిగా దహనమయ్యింది. అందులోని 59 మంది ప్రయాణికులు మరణించారు. రాళ్లు రువ్విన ఘటనలో ఫరూఖ్‌సహా కొందరు దోషులుగా తేలారు. -
నాటి మోదీ ప్రభుత్వానికి క్లీన్చిట్
గాంధీనగర్: 2002 నాటి గుజరాత్ అల్లర్ల విషయంలో అప్పటి ఆరాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తప్పేమీ లేదని జస్టిస్ నానావతి కమిషన్ స్పష్టం చేసింది. గుజరాత్ హోం శాఖ మంత్రి ప్రదీప్ సిన్హ్ జడేజా బుధవారం నానావతి కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కమిషన్ ఈ నివేదికను ఐదేళ్ల క్రితమే ప్రభుత్వానికి సమర్పించింది . 2002 అల్లర్ల సమయంలో కొన్ని చోట్ల తగినంత సిబ్బంది లేక పోలీసులు మూకలను నియంత్రించడంలో విఫలమయ్యారని, సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ నానావతి, గుజరాత్ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ అక్షయ్ మెహతాల కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. రాష్ట్ర మంత్రుల స్ఫూర్తితోగానీ, రెచ్చగొట్టడం వల్లకానీ, ప్రోత్సహించడం వల్లగానీ 2002లో ఒక వర్గంపై దాడులు జరిగాయనేందుకు ఆధారాలు లేవని పేర్కొంది. అందుబాటులో ఉన్న సమాచారం మొత్తాన్ని పరిశీలించాక... గోద్రా సంఘటన తరువాత చెలరేగిన మతఘర్షణలు ఆ ఘటన తాలూకూ ప్రతిస్పందనగా మాత్రమే జరిగాయని భావిస్తున్నట్లు కమిషన్ తెలిపింది. విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్‌లకు చెందిన స్థానిక సభ్యులు వారి నివాసప్రాంతాల్లో జరిగిన గొడవల్లో పాల్గొన్నారని వివరించింది. అహ్మదాబాద్ నగరంలో జరిగిన మత ఘర్షణలను ప్రస్తావిస్తూ.. ఆ సమయంలో అత్యవసరమైన చొరవ, సామర్థ్యాన్ని పోలీసులు చూపలేదని అభిప్రాయపడింది. తప్పు చేసిన పోలీసు అధికారులపై విచారణ, చర్యలపై విధించిన స్టేను కమిషన్ ఎత్తివేయడం గమనార్హం. 2002లో మత ఘర్షణల తరువాత ఏర్పాటైన నానావతి కమిషన్ తన తొలి నివేదికను 2009 సెప్టెంబరులో సమర్పించగా తుది నివేదిక 2014 నవంబరు 18న ప్రభుత్వానికి అందించింది. -
బానోకు 50 లక్షలు కట్టండి
న్యూఢిల్లీ: 2002లో గుజరాత్లో గోద్రా అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానోకు రూ.50 లక్షల పరిహారం, ఉద్యోగం, వసతి కల్పించాలని సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు విషయంలో నిర్లక్ష్యం చూపిన అధికారులపై చర్యలు తీసుకోవాలని గుజరాత్ సర్కార్‌ను ఆదేశించింది. ఆ అధికారులకు పెన్షన్ ప్రయోజనాలు నిలిపివేయాలని.. బాంబే హైకోర్టు దోషిగా తేల్చిన ఐపీఎస్ అధికారికి రెండు ర్యాంకులు తగ్గించాలని (డిమోట్) ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడినధర్మాసనం మంగళవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. బానోకు పరిహారంగా రూ.5 లక్షలు ఇవ్వాలన్న గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమె తిరస్కరించింది. తనకు జరిగిన నష్టానికి తగిన పరిహారం చెల్లించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బానో తరఫున అడ్వొకేట్ శోభా గుప్తా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. హైకోర్టు దోషులుగా ప్రకటించిన అధికారులపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. వీరిలో ఒక ఐపీఎస్ అధికారి వచ్చే ఏడాది రిటైర్ కాబోతున్నారని, మిగతా నలుగురు ఇప్పటికే రిటైర్ అయ్యారని పేర్కొన్నారు. వీరిపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టుకు నివేదించారు. ఈ దారుణ ఘటన తర్వాత బానో దుర్భర జీవితం గడిపిందని.. భయపడుతూ వివిధ ప్రాంతాల్లో తలదాచుకుందని పేర్కొన్నారు. ఆమెకు ఆమోదయోగ్యమైన పరిహారం చెల్లించాలని కోర్టును కోరారు. ఇక గుజరాత్ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వొకేట్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఆనాడు ఏం జరిగింది? గోద్రా అల్లర్ల సమయంలో 2002 మార్చి 3న అహ్మదాబాద్ దగ్గర్లోని రాధికాపూర్‌లో బానోపై గ్యాంగ్‌రేప్ జరిగింది. ఆమె కుటుంబసభ్యులు 14 మందిని అత్యంత పాశవికంగా హతమార్చారు. మృతుల్లో ఆమె తల్లి, రెండేళ్ల కూతురు ఉన్నారు. ఘటన జరిగినపుడు బానో 5నెలల గర్భిణి. అప్పటినుంచి న్యాయం కోసం పోరాడుతోంది. పోలీసులు, ఎన్జీవో సహా పలు కోర్టులను ఆశ్రయించింది. న్యాయం జరగకపోయే సరికి చివరకు సుప్రీంకోర్టులో కేసువేసింది. కేసును కోర్టు సీబీఐకి అప్పజెప్పింది. 2004లో ఈ కేసుకు సంబంధించి తగిన ఆధారాలు సేకరించిన అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని సీబీఐ అరెస్టు చేసింది. చివరికి 2008లో బిల్కిస్ బానో కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు పోలీసు అధికారులు, ఓ ప్రభుత్వ డాక్టరు సహా 19 మందిపై అభియోగాలు నమోదు చేసింది. వీరిలో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ 2008 జనవరి 11న తీర్పు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ నిందితులు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ప్రత్యేక కోర్టు విధించిన శిక్షను 2017లో ముంబై హైకోర్టు బలపరిచింది. వీరిలో ముగ్గురిని ఉరి తీయాలని సీబీఐ వాదించింది. కోర్టు సీబీఐ వాదనను తోసిపుచ్చింది. -
సబ్ర్మతి రైలు దహనం; మరో ఇద్దరికి జీవిత ఖైదు
-
గోద్రా దుర్ఘటన; మరో ఇద్దరికి జీవిత ఖైదు
అహ్మదాబాద్: గుజరాత్ అల్లర్లకు కారణమైన గోద్రా రైలు దహనం కేసులో సిట్ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం మరో ఇద్దరికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. 2002 ఫిబ్రవరి 27న గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలో అల్లరిమూకలు సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రెండు బోగీలు పూర్తిగా దగ్దమవ్వగా.. అందులో ప్రయాణిస్తున్న 59 మంది కరసేవకులు సజీవ దహనం అయ్యారు. దీంతో గుజరాత్ వ్యాప్తంగా ఒక్కసారిగా మత ఘర్షణలు చెలరేగాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల్లో దాదాపు వెయ్యి మంది మరణించారు. ఈ కేసులో సుదీర్ఘ కాలం విచారణ చేపట్టిన సిట్ ప్రత్యేక న్యాయస్థానం 2011 మార్చి 1న ఈ కేసులో 31 మందిని దోషులుగా తేల్చింది. వారిలో 11 మందికి మరణశిక్ష, 20 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో వారు ప్రత్యేక న్యాయస్థానం తీర్పును గుజరాత్ హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన గుజరాత్ హైకోర్టు 2017 అక్టోబర్‌లో మరణశిక్ష ఖరారైన 11 మంది శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ తీర్పు వెలువరించింది. మిగతా 20 మందికి ప్రత్యేక న్యాయస్థానం విధించిన జీవిత ఖైదును హైకోర్టు సమర్ధించింది. కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న ఫరూఖ్ బానా, ఇమ్రాన్ షేరు, హుస్సేన్ సులేమాన్, ఫరూఖ్ ధాంతియా, కసమ్ బమేదీలను పోలీసులు 2015-16 మధ్య కాలంలో అరెస్ట్ చేశారు. వీరిలో ఫరూఖ్ బానా, ఇమ్రాన్ షేరులకు కోర్టు జీవిత ఖైదు విధించగా, మరో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో మరో 8 మంది నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు. -
గోద్రా ప్రధాన నిందితుని అరెస్టు
ముంబై: గోద్రా రైలుకు నిప్పంటించి 56 మంది సజీవదహనానికి కారణమైన కేసులో ప్రధాన నిందితుడు,మాజీ కార్పొరేటర్ ఫరూక్ బానాను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బానా 2002 నుంచి పరారీలో ఉన్నాడు. గోద్రా నుంచి ముంబై వెళుతున్న బానాను పాంచ్ మహల్ జిల్లాలోని కరోల్ టోల్ ప్లాజా వద్ద ఆరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 2002లో ముంబై పారిపోయిన బానా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అవతారమెత్తాడు. గోద్రా ఘటన సమయంలో రైల్వే స్టేషనకు సమీపంలోని తన గెస్ట్ హౌసులో రైలుకు నిప్పంటిచిన నిందితులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారని పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. 2002 లో ఒక గుంపు సబర్మతి ఎక్సప్రెస్ కు నిప్పంటించిన ఘటనలో 60 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఇందులో నిందితులుగా ఉన్న 33 మందిలో 2011లో 11 మందికి మరణశిక్ష, 20 మందికి యావజ్జీవ కారాగార శిక్షను న్యాయస్థానం విధించింది.