గోద్రా దుర్ఘటన; మరో ఇద్దరికి జీవిత ఖైదు | Godhra Train Carnage Two Others Get Life Imprisonment BY Special Court | Sakshi
Sakshi News home page

గోద్రా దుర్ఘటన; మరో ఇద్దరికి జీవిత ఖైదు

Published Mon, Aug 27 2018 3:38 PM | Last Updated on Mon, Aug 27 2018 4:26 PM

Godhra Train Carnage Two Others Get Life Imprisonment BY Special Court - Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అల్లర్లకు కారణమైన గోద్రా రైలు దహనం కేసులో సిట్‌ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం మరో ఇద్దరికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. 2002 ఫిబ్రవరి 27న గోద్రా రైల్వే స్టేషన్‌ సమీపంలో అల్లరిమూకలు సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రెండు బోగీలు పూర్తిగా దగ్దమవ్వగా.. అందులో ప్రయాణిస్తున్న 59 మంది కరసేవకులు సజీవ దహనం అయ్యారు. దీంతో గుజరాత్‌ వ్యాప్తంగా ఒక్కసారిగా మత ఘర్షణలు చెలరేగాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల్లో దాదాపు వెయ్యి మంది మరణించారు.

ఈ కేసులో సుదీర్ఘ కాలం విచారణ చేపట్టిన సిట్‌ ప్రత్యేక న్యాయస్థానం 2011 మార్చి 1న ఈ కేసులో 31 మందిని దోషులుగా తేల్చింది. వారిలో 11 మందికి మరణశిక్ష, 20 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో వారు ప్రత్యేక న్యాయస్థానం తీర్పును గుజరాత్‌ హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన గుజరాత్‌ హైకోర్టు 2017 అక్టోబర్‌లో మరణశిక్ష ఖరారైన 11 మంది శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ తీర్పు వెలువరించింది. మిగతా 20 మందికి ప్రత్యేక న్యాయస్థానం విధించిన జీవిత ఖైదును హైకోర్టు సమర్ధించింది.

కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న ఫరూఖ్‌ బానా, ఇమ్రాన్‌ షేరు, హుస్సేన్‌ సులేమాన్‌, ఫరూఖ్‌ ధాంతియా, కసమ్‌ బమేదీలను పోలీసులు 2015-16 మధ్య కాలంలో అరెస్ట్‌ చేశారు. వీరిలో ఫరూఖ్‌ బానా, ఇమ్రాన్‌ షేరులకు కోర్టు జీవిత ఖైదు విధించగా, మరో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో మరో 8 మంది నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement