నాటి మోదీ ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ | Nanavati panel gives clean chit to then CM Modi in Gujarat riots | Sakshi
Sakshi News home page

నాటి మోదీ ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌

Published Thu, Dec 12 2019 1:59 AM | Last Updated on Thu, Dec 12 2019 8:31 AM

Nanavati panel gives clean chit to then CM Modi in Gujarat riots - Sakshi

గుజరాత్‌లో అల్లర్ల దృశ్యం (ఫైల్‌)

గాంధీనగర్‌: 2002 నాటి గుజరాత్‌ అల్లర్ల విషయంలో అప్పటి ఆరాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తప్పేమీ లేదని జస్టిస్‌ నానావతి కమిషన్‌ స్పష్టం చేసింది. గుజరాత్‌ హోం శాఖ మంత్రి ప్రదీప్‌ సిన్హ్‌ జడేజా బుధవారం నానావతి కమిషన్‌ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కమిషన్‌ ఈ నివేదికను ఐదేళ్ల క్రితమే ప్రభుత్వానికి సమర్పించింది . 2002 అల్లర్ల సమయంలో కొన్ని చోట్ల తగినంత సిబ్బంది లేక పోలీసులు మూకలను నియంత్రించడంలో విఫలమయ్యారని, సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ నానావతి, గుజరాత్‌ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ అక్షయ్‌ మెహతాల కమిషన్‌ తన నివేదికలో స్పష్టం చేసింది. రాష్ట్ర మంత్రుల స్ఫూర్తితోగానీ, రెచ్చగొట్టడం వల్లకానీ, ప్రోత్సహించడం వల్లగానీ 2002లో ఒక వర్గంపై దాడులు జరిగాయనేందుకు  ఆధారాలు లేవని పేర్కొంది.

అందుబాటులో ఉన్న సమాచారం మొత్తాన్ని పరిశీలించాక... గోద్రా సంఘటన తరువాత చెలరేగిన మతఘర్షణలు ఆ ఘటన తాలూకూ ప్రతిస్పందనగా మాత్రమే జరిగాయని భావిస్తున్నట్లు కమిషన్‌ తెలిపింది. విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్‌లకు చెందిన స్థానిక సభ్యులు వారి నివాసప్రాంతాల్లో జరిగిన గొడవల్లో పాల్గొన్నారని వివరించింది. అహ్మదాబాద్‌ నగరంలో జరిగిన మత ఘర్షణలను ప్రస్తావిస్తూ.. ఆ సమయంలో అత్యవసరమైన చొరవ, సామర్థ్యాన్ని పోలీసులు చూపలేదని అభిప్రాయపడింది. తప్పు చేసిన పోలీసు అధికారులపై విచారణ, చర్యలపై విధించిన స్టేను కమిషన్‌ ఎత్తివేయడం గమనార్హం. 2002లో మత ఘర్షణల తరువాత ఏర్పాటైన నానావతి కమిషన్‌ తన తొలి నివేదికను 2009 సెప్టెంబరులో సమర్పించగా తుది నివేదిక 2014 నవంబరు 18న ప్రభుత్వానికి అందించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement