Nanavati Commission
-
నాటి మోదీ ప్రభుత్వానికి క్లీన్చిట్
గాంధీనగర్: 2002 నాటి గుజరాత్ అల్లర్ల విషయంలో అప్పటి ఆరాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తప్పేమీ లేదని జస్టిస్ నానావతి కమిషన్ స్పష్టం చేసింది. గుజరాత్ హోం శాఖ మంత్రి ప్రదీప్ సిన్హ్ జడేజా బుధవారం నానావతి కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కమిషన్ ఈ నివేదికను ఐదేళ్ల క్రితమే ప్రభుత్వానికి సమర్పించింది . 2002 అల్లర్ల సమయంలో కొన్ని చోట్ల తగినంత సిబ్బంది లేక పోలీసులు మూకలను నియంత్రించడంలో విఫలమయ్యారని, సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ నానావతి, గుజరాత్ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ అక్షయ్ మెహతాల కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. రాష్ట్ర మంత్రుల స్ఫూర్తితోగానీ, రెచ్చగొట్టడం వల్లకానీ, ప్రోత్సహించడం వల్లగానీ 2002లో ఒక వర్గంపై దాడులు జరిగాయనేందుకు ఆధారాలు లేవని పేర్కొంది. అందుబాటులో ఉన్న సమాచారం మొత్తాన్ని పరిశీలించాక... గోద్రా సంఘటన తరువాత చెలరేగిన మతఘర్షణలు ఆ ఘటన తాలూకూ ప్రతిస్పందనగా మాత్రమే జరిగాయని భావిస్తున్నట్లు కమిషన్ తెలిపింది. విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్‌లకు చెందిన స్థానిక సభ్యులు వారి నివాసప్రాంతాల్లో జరిగిన గొడవల్లో పాల్గొన్నారని వివరించింది. అహ్మదాబాద్ నగరంలో జరిగిన మత ఘర్షణలను ప్రస్తావిస్తూ.. ఆ సమయంలో అత్యవసరమైన చొరవ, సామర్థ్యాన్ని పోలీసులు చూపలేదని అభిప్రాయపడింది. తప్పు చేసిన పోలీసు అధికారులపై విచారణ, చర్యలపై విధించిన స్టేను కమిషన్ ఎత్తివేయడం గమనార్హం. 2002లో మత ఘర్షణల తరువాత ఏర్పాటైన నానావతి కమిషన్ తన తొలి నివేదికను 2009 సెప్టెంబరులో సమర్పించగా తుది నివేదిక 2014 నవంబరు 18న ప్రభుత్వానికి అందించింది. -
రాజీవ్ ఆదేశాలతోనే సిక్కుల ఊచకోత
న్యూఢిల్లీ: 1984లో సిక్కులను ఊచకోత కోయాలని రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నపుడు ప్రధాని కార్యాలయం(పీఎంవో) నుంచి ఆదేశాలు వచ్చాయని బీజేపీ గురువారం సంచలన ఆరోపణ చేసింది. ఈ విషయం నానావతి కమిషన్ దృష్టికి వచ్చిందని తెలిపింది. అయితే నానావతి కమిషన్ రిపోర్టు మాత్రం బీజేపీ ఆరోపణలకు భిన్నంగా ఉండటం గమనార్హం. ప్రధాని ఇందిరాగాంధీని 1984 అక్టోబర్ 31న ఆమె అంగరక్షకులైన ఇద్దరు సిక్కులు కాల్చిచంపడంతో ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. దాదాపు 3,000 మంది అమాయక సిక్కులు ప్రాణాలు కోల్పోయారు. ‘నానావతి’ రిపోర్టులో ఏముంది? సిక్కుల ఊచకోతపై 2000లో ఎన్డీయే ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ జీటీ నానావతి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. 2005లో సమర్పించిన ఈ నివేదికలో నానావతి కమిషన్ స్పందిస్తూ.. ‘సిక్కులకు గుణపాఠం చెప్పాలని రాజీవ్ అన్నట్లు వచ్చిన ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యం లేదు. ఢిల్లీలో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు రాజీవ్ కృషి చేశారు. ఇందిర హత్య అనంతరం ప్రజలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు’ అని తెలిపింది. దమ్ముంటే ప్రజాసమస్యలపై పోరాడండి: కాంగ్రెస్ బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ప్రస్తుతం 2019 ఎన్నికలు జరుగుతున్నాయే తప్ప 1951, 1966, 1984 లోక్‌సభ ఎన్నికలు జరగడం లేదు. దమ్ముంటే నిజమైన ప్రజా సమస్యలపై పోరాడండి. మోదీ పెద్ద అబద్దాలకోరుగా మారిపోయారు’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. సిక్కు వ్యతిరేక అల్లర్లలో దోషిగా తేలిన కాంగ్రెస్ నేత సజ్జన్‌కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు గతేడాది డిసెంబర్లో యావజ్జీవ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. -
గుజరాత్ అల్లర్లపై ‘నానావతి’ నివేదిక
గాంధీనగర్: గుజరాత్ అల్లర్లపై దర్యాప్తునకు నియమించిన జస్టిస్ నానావతి కమిషన్ మంగళవారం తన రెండో, తుది నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్‌కు అందజేసింది. కమిషన్ ఏర్పాటైన 12 ఏళ్ల తర్వాత, 24 పొడిగింపుల అనంతరం దీన్ని సమర్పించారు. దర్యాప్తునకు రూ. 7 కోట్లు ఖర్చయ్యాయి. క మిషన్‌కు సాక్షుల వాంగ్మూలాలతో కూడిన 45 వేల అఫిడవిట్లు అందాయి. కమిషన్ సారథి, సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ జీటీ నానావతి, సభ్యుడైన హైకోర్టు రిటెర్డ్ జడ్జి అక్షయ్ మెహతాలు సీఎం ఇంటికి చేరుకుని 2 వేల పేజీల నివేదికను సమర్పించారు. అయితే అందులోని అంశాలను వెల్లడించడానికి నానావతి నిరాకరించారు. వాటిని బయటపెడితే తమ కమిషన్‌కు రాష్ట్ర అసెంబ్లీ నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుందని విలేకర్లతో అన్నారు. నివేదికను బహిర్గతం చేయాలో, వద్దో నిర్ణయించుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు. నివేదికకు ఎందుకు జాప్యం జరిగిందో చెప్పడానికి నిరాకరించారు. తమ విచారణలో చాలామంది సాక్ష్యం ఇవ్వటానికి ముందుకు రాలేదని తెలిపారు. 2002 నాటి గుజరాత్ అల్లర్లలో అత్యధికంగా మైనారిటీలు సహా వెయ్యిమందికిపైగా బలవటం తెలిసిందే. నాటి హింసకు సంబంధించి అప్పటి సీఎం, నేటి ప్రధాని నరేంద్ర మోదీ, నాటి రాష్ట్ర మంత్రులతోపాటు ప్రభుత్వ యంత్రాంగం పాత్ర, మతఛాందసవాద సంస్థల పాత్రను నిగ్గుదేల్చడానికి 2002లో రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిషన్‌ను నియమించింది. ఇది 2008లో ఇచ్చిన తొలి నివేదికలో.. గోధ్రారైలు దహనం పథకం ప్రకారం జరిగిందని పేర్కొంటూ, మోదీకి, అప్పటి రాష్ట్ర మంత్రులకు క్లీన్చిట్ ఇచ్చింది.