అమలాపురంలో మళ్లీ వక్ఫ్ భూముల కలకలం
- మొత్తం 147 ఎకరాల భూములను గుర్తించిన వక్ఫ్ బోర్డు
- తమ భూములని నిర్థారణతో కలెక్టర్కు నివేదిక
- ఆ భూముల్లో రిజస్ట్రేషన్లు నిలిపివేత
- ఏళ్ల తరబడి భూములను అనుభవిస్తున్న ప్రస్తుత యాజమానుల్లో గుబులు
అమలాపురం టౌన్:
అమలాపురం పట్టణం... పరిసర గ్రామాల్లో వక్ఫ్ భూముల కలకలం మళ్లీ మొదలైంది. గతంలో కేవలం అమలాపురం పట్టణంలోని వడ్డిగూడెం ప్రాంతంలో 25 ఎకరాలు భూములు తమవేనని వక్ఫ్ బోర్డు గుర్తించంటంతో వాటిని రెవెన్యూ అధికారుల సర్వేతో నిర్థారించిన సంగతి తెలిసిందే. అప్పట్లో వివాదం తలెత్తడంతో అధికారులు ఆ భూముల క్రయ విక్రయాలకు సంబంధించి రిజస్ట్రేషన్లు నిలిపి వేశారు. తాజాగా వక్ఫ్ అధికారులు పట్టణంలోనే కాదు అమలాపురం రూరల్ మండల పరిధిలో పలు గ్రామాల్లో కూడా 147 ఎకరాల భూములున్నట్లు గుర్తించి ఆ భూములను కూడా బోర్డుకు అప్పగించాల్సిందేనని వక్ఫ్ అధికారులు పట్టుపడుతున్నారు. అంతేకాదు అలా గుర్తించిన భూముల సర్వే నెంబర్లు, విస్తీర్ణాల జాబితాను తయారు చేసి జిల్లా కలెక్టర్కు నివేదిక కూడా సమర్పించారు. జిల్లా వక్ఫ్ ఇన్స్పెక్టర్ ఆడిటర్ సులేమాన్ బాషా పలుమార్లు ఈ వివాదంపై అమలాపురం ఆర్డీవో జి.గణేష్కుమార్తో చర్చించారు. గతంలోని 25 ఎకరాలతో కలుపుకుని తాజాగా మొత్తం 147 ఎకరాల్లో క్రయ విక్రయాలకు సంబంధించి వక్ఫ్ అభ్యంతరాలతో రిజస్ట్రేషన్లను అధికారులు నిలిపివేశారు. గత మూడు నెలలుగా ఈ భూముల్లో ఎలాంటి రిజస్ట్రేషన్ లావాదేవీలు జరగటంలేదు. దీంతో ఈ 147 ఎకరాల్లో ఎవరైనా తమ స్థలాన్ని అమ్ముకోవాలన్నా... కొనాలన్నా రిజస్ట్రేషన్ నిలిపివేత ఆంక్షలతో 300కు పైగా యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
తప్పు ఎవరిది..? శిక్ష ఎవరికి...?:
పూర్వీకంలో ప్రస్తుతం వక్ఫ్ భూములని నిర్థారిస్తున్న వాటిలో కొన్ని మసీదులుండి, వాటి నిర్వహణ కోసం భూముల కేటాయింపు ఉన్నట్లు ఆధారాలు ఇప్పుడు వక్ఫ్ బోర్డు శోధనలో వెలుగు చూశాయి. అయితే దాదాపు వందేళ్ల కిందట బహుమతులు, ఆక్రమణలు, ఆలనా పాలనా లేక వదిలేయటంతో క్రమేపీ పరాధీనమయ్యాయని తెలుస్తోంది. తర్వాత ఆ పూర్వీకంలోనే కొందరు పట్టాలు, దస్తావేజులు పొంది అనుభవించసాగారు. కాలక్రమంలో అవి క్రయ విక్రయాలతో చేతులు మారుతూ నేడు పట్టణ, గ్రామాల విస్తరణతో అత్యంత ఖరీదైన భూములుగా మారి ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్లు, ఇంటిపన్నుల చెల్లింపులతో సొంత ఆస్తులై స్థిరపడ్డాయి. అప్పట్లో మసీదు కమిటీల పర్యవేక్షణ సరిగా లేకో... మసీదు భూముల నుంచి రూపాంతరం చెందినప్పుడు అప్పట్లో రెవెన్యూ శాఖ ఆ భూములను సబ్ డివిజన్ చేయకపోవటం వల్లో క్రమేపీ అవి మసీదు భూములుగా చెలామణిని కోల్పోయాయి. మసీదు భూముల పరిరక్షణకు ఉన్న వక్ఫ్ బోర్డు అధికారులు ఆది నుంచీ కాపాడుకోకుండా ఇప్పుడు ఉన్నఫళంగా మావి అంటే ఏళ్ల తరబడి లక్షలు పోసి కొనుగోలు చేసుకున్న తాము ఏమైపోవాలని ప్రస్తుత భూముల యాజమానులు ప్రశ్నిస్తున్నారు. ఆదిలో రెవెన్యూ, మధ్యలో వక్ఫ్ ఆ భూములపై సరైన పర్యవేక్షణ చేసి ఉంటే ఇంతటి వివాదానికి తావు ఉండేది కాదని న్యాయ నిపుణులు అంటున్నారు.
అత్యంత ఖరీదైన భూములే నేడు వక్ఫ్ భూములుగా...:
పట్టణంలోపాటు రూరల్ మండలం సమనస, నడిపూడి గ్రామాల్లో కూడా ఖరీదైన వక్ఫ్ భూములని ఇప్పుడు బయట పడ్డాయి. స్థానిక కిమ్స్ వైద్య కళాశాల వెనుక, ఆ కళాశాలలో కొంత భూమి వక్ఫ్ పరిధిలోకి వస్తున్నాయి. నడిపూడి గ్రామంలో అయితే దాదాపు 80 ఎకరాల వరకూ వెలుగు చూశాయి. పట్టణంలో అయితే ఓ ప్రముఖ ఆస్పత్రితోపాటు ఓ ప్రముఖ విద్యా సంస్థకు చెందిన స్థలాలు వక్ఫ్లోకి చూపిస్తున్నాయి. అమలాపురం ముల్లా ముస్తాఫా మసీదుకు చెందిన ముమ్మిడివరం మండలం అయినాపురంలో 21.15 ఎకరాల భూములను ఇటీవలే వక్ఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అమలాపురం పట్టణం, పరిసర గ్రామాల్లో కూడా తమ భూములను స్వాధీనం చేసుకునేందుకు బోర్డు సన్నాహాలు చేస్తోంది.