AP: HC Refuses Interim Order Suspend Wakf Tribunal GO - Sakshi
Sakshi News home page

కర్నూలులో వద్దని ఏ చట్టంలోనైనా ఉందా?

Published Tue, Dec 14 2021 12:03 PM | Last Updated on Tue, Dec 14 2021 5:14 PM

AP HC Refuses Interim Order Suspend Wakf Tribunal GO - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత నెల 25న జారీ చేసిన జీవో 16 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కర్నూలులో వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయకూడదని ఏ చట్టంలో ఎలాంటి నిషేధం లేదని తేల్చిచెప్పింది. ఏ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్నది ప్రభుత్వ పరిధిలోని అంశమని, అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఏ ఒక్కరి ప్రాథమిక హక్కులకు భంగం కలగడం లేదంది. విశాఖపట్నం, అనంతపురం నుంచి హైకోర్టుకు వస్తున్నారని, అలాంటప్పుడు కర్నూలుకు వెళ్లడానికి ఇబ్బంది ఏమిటని పిటిషనర్‌ను ప్రశ్నించింది.

కర్నూలులో వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు దారి తీసిన కారణంతో చిన్న అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి హైకోర్టు వెసులుబాటు కల్పించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 3కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యాజ్యాన్ని వక్ఫ్‌బోర్డు ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. జీవో 16ను సవాలు చేస్తూ విజయవాడకు చెందిన మహ్మద్‌ ఫరూక్‌ షుబ్లీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) పై సీజే ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది డీఎస్‌ఎన్‌వీ ప్రసాద్‌బాబు వాదనలు వినిపిస్తూ, సీఎం ఆదేశాల మేరకే కర్నూలులో ట్రిబ్యునల్‌ ఏర్పా టు జీవో వచ్చిందన్నారు. ఇది మైనారిటీల ప్రయోజనాలకు విరుద్ధమని చెప్పారు. దీనిని విజయవాడలో  ఏర్పాటు చేస్తూ 2016లోనే జీవో జారీ అయిందన్నా రు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ఇందులో జోక్యం చేసుకునే పరిధి తమకెక్కడిదని ప్రశ్నించింది. కర్నూలులో ట్రిబ్యునల్‌ ఏర్పాటు వల్ల పిటిషనర్‌కొచ్చిన నష్టం ఏమిటని ప్రశ్నించింది. ఈ సమయంలో అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ స్పందిస్తూ, కర్నూలులో ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు స్పష్టమైన కారణాలున్నాయన్నారు. అత్యధిక ముస్లిం జనాభా కర్నూలులో ఉందన్నారు. ఇందులో ముఖ్యమంత్రి పేరు తీసుకురావాల్సిన అవసరం లేదన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఆ వివరాలతో చిన్న అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఏజీని ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement