సోమిరెడ్డే మంత్రి
♦ పనిచేయని నారాయణ మంత్రం
♦ మూడోసారి మంత్రిగా అవకాశం
♦ సోమిరెడ్డికి కలిసొచ్చిన నారాయణ వైఫల్యాలు
♦ నేడు మంత్రిగా ప్రమాణస్వీకారం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : అనేక సమీకరణాలు, తీవ్ర ఉత్కంఠ అనంతరం ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మూడో సారి మంత్రిగా ఎంపికయ్యారు. ఆదివారం ఉదయం అమరావతిలో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంత్రి వర్గ విస్తరణపై ఆరు నెలలుగా ప్రచారం జరుగుతుండడంతో సోమిరెడ్డి అప్పటి నుంచే మంత్రి పదవి సాధించడం కోసం తన సర్వశక్తులూ ఒడ్డారు. 2వ తేదీ మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఖరారుకావడంతో జిల్లా నుంచి సోమిరెడ్డికి పదవి ఖాయమనే ప్రచారం గట్టిగా జరిగింది.
అయితే జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అనూహ్యంగా బీసీ కోటాలో మంత్రి పదవి కోసం తెరమీదకొచ్చారు. దీంతో ఇద్దరిలో ఎవరిది పై చేయి అవుతుందోనని తెలుగుదేశం పార్టీతో పాటు జిల్లా రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చాయి. జిల్లాకు రెండో మంత్రి పదవి రాకుండా చూడటానికి మంత్రి నారాయణ తీవ్రంగానే ప్రయత్నం చేశారు. తప్పనిసరిగా పదవి ఇవ్వాల్సి వస్తే రవిచంద్రకు ఇవ్వాలని ఆయన సిఫారసు చేశారు. అయితే మూడేళ్లుగా మంత్రి పదవిలో ఉన్న నారాయణ జిల్లాలో పార్టీని, అధికార యంత్రాంగాన్ని గాడిలో పెట్టలేకపోయారు.
దీనికి తోడు ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తనకు అత్యంత సన్నిహితుడైన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని గెలిపించుకోలేకపోవడం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వాసుదేవనాయుడు కూడా ఓటమి పాలు కావడంతో చంద్రబాబు వద్ద నారాయణ పరపతి తగ్గింది. మంత్రి పదవి కోసం అన్ని రకాల మార్గాల్లో ప్రయత్నిస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి నారాయణ వైఫల్యాలు సానుకూలంగా మారాయి. కాగా, 1996లో చంద్రబాబునాయుడు చేపట్టిన మంత్రి వర్గ విస్తరణలో చంద్రమోహన్‌రెడ్డికి తొలిసారి మంత్రి పదవి దక్కింది. 2001లో చంద్రబాబు నాయుడు జరిపిన మంత్రి వర్గ విస్తరణలో సోమిరెడ్డికి రెండోసారి మంత్రి పదవి దక్కింది. 2001 నుంచి 2004 వరకు ఆయన సమాచార, ప్రసారశాఖ మంత్రిగా పదవీబాధ్యతలు నిర్వర్తించారు.
మళ్లీ సోమిరెడ్డి హవా..
2014 ఎన్నికల్లో ఓటమి అనంతరం నారాయణకు మంత్రి పదవి దక్కడంతో జిల్లా రాజకీయాల్లో సోమిరెడ్డి ఆధిపత్యం ముగిసినట్లేనని టీడీపీ వర్గాలు భావిస్తూ వచ్చాయి. సీఎం చంద్రబాబునాయుడు మంత్రి నారాయణకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం.. జిల్లా పార్టీ వ్యవహారాలు, అధికారుల నియామకాలు, ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో సైతం నారాయణకు పెద్ద పీట వేశారు. దీంతో మూడేళ్లుగా నారాయణ ఆధిపత్యం కొనసాగుతూ చంద్రమోహన్‌రెడ్డి పట్టు తగ్గింది.అయితే చంద్రబాబుతో ఉన్న సన్నిహిత సంబంధాలు, పార్టీ పట్ల విధేయత కారణంగా ఏడాది క్రితం సోమిరెడ్డి ఎమ్మెల్సీ పదవి సాధించగలిగారు.
ఎన్నికలకు ముందు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందనే అంచనాతో అప్పటి నుంచి సోమిరెడ్డి తన సహజ వ్యవహారశైలిని మార్చుకొని జిల్లా పార్టీ నాయకులందరితో స్నేహితంగా మెలుగుతూ వస్తున్నారు. వివాదాస్పద వ్యవహారాల జోలికి పోకుండా జాగ్రత్తగా అడుగులేస్తున్నారు. చంద్రబాబు పురమాయించే రాజకీయ కార్యక్రమాలను పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ కారణాలన్నింటి రీత్యా మరోసారి చంద్రమోహన్‌రెడ్డి మంత్రి పదవికి మార్గం సుగమమైంది. సోమిరెడ్డికి మంత్రి పదవి ఖరారైనట్లు సమాచారం అందడంతో జిల్లాలోని ఆయన మద్దతుదారులు శనివారం రాత్రి అమరావతికి బయలుదేరి వెళ్లారు.