పళని గూటికి దినకరన్ గ్రూప్ ఎంపీ
సాక్షి, చెన్నై: తన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు దినకరన్‌తో కలిసి చేతులు కలిపి గవర్నర్‌ను పదే పదే కలుస్తున్న తిరుగుబాటు వర్గానికి అనర్హత వేటుతో పెద్ద దెబ్బే వేశారు ముఖ్యమంత్రి పళని సామి. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు బలనిరూపణ నిర్వహించకూడదన్న మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో తమిళ రాజకీయాల్లో సందిగ్ధం నెలకొంది.
ఇదిలా ఉంటే దినకరన్ మద్ధతుదారులలో కంగారు మొదలైనట్లు సంకేతాలు అందుతున్నాయి. ఈ క్రమంలోనే తెంకసి ఎంపీ వసంతి మురుగేశన్ దినకరన్‌కు హ్యాండిస్తూ పళని గ్రూప్ లోకి చేరిపోయారు. శుక్రవారం పళని ఇంటికి వెళ్లిన ఆమె తన మద్ధతు సీఎం పళనిసామికేనని ప్రకటించారు. దినకరన్ డీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా మీడియాతో ఆమె తెలిపారు.
కీలక మహిళానేత అయిన వసంతి దినకరన్‌కు మొదటి నుంచి విశ్వసనీయురాలిగా ఉంటూ వస్తున్నారు. అలాంటి నేత తిరిగి తమ గూటికి చేరుకోవటంతో పళని-పన్నీర్ శిబిరంలో ఆనందం నెలకొంది. మరికొంత మంది నేతలు కూడా క్యూ కట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.