చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నికలో మరోసారి డబ్బు పంపిణీ కలకలం రేగింది. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న క్రమంలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 12.6 లక్షలను వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
కొరుక్కుపేట్‌లోని ఓ సైకోథెరపీ సెంటర్‌లో డబ్బు దాచారన్న సమచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కొందరికి డబ్బులు ఇస్తున్నప్పుడు పట్టుకున్నారు. ఇక ఇది దినకరన్ వర్గం పనేనంటూ అధికార పార్టీ ఆరోపణలు దిగటం.. ఇరు వర్గాల ఘర్షణకు దారితీయటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే యత్నం చేస్తున్నారు.
ఇంతకు ముందు ఏప్రిల్ 12న జరగాల్సిన ఎన్నిక ఓటుకు నోటు నేపథ్యంలోనే రద్దైన విషయం తెలిసిందే. ఆ సమయంలో దినకరన్ పై తీవ్ర ఆరోపణలు రాగా, ఆ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ఇప్పుడు మరోసారి ఇలాంటి పరిస్థితులే కనిపిస్తుండటంతో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందోనన్న చర్చ మొదలైంది. ఇప్పటిదాకా సుమారు 20 లక్షల దాకా డబ్బు పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, డిసెంబర్ 21న ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుండగా.. 59 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment