సరైన సమయంలో కీలక నిర్ణయం
- డీఎంకే నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్
- అన్నాడీఎంకే ఎప్పుడూ మా ప్రత్యర్థే
సాక్షి, చెన్నై: తమిళనాట రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సరైన సమ యంలో కీలక నిర్ణయం తీసుకుంటామని డీఎంకే నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. అన్నాడీఎంకే ఎప్పుడూ డీఎంకేకు ప్రత్యర్థేనని స్పష్టం చేశారు. ఎవ్వరికీ మద్దతిచ్చే ప్రసక్తే లేదన్నారు. స్టాలిన్ అధ్యక్ష తన, ప్రధానకార్యదర్శి అన్బళగన్ నేతృత్వంలో సోమవారం చెన్నై తేనాం పేటలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో డీఎంకే ఉన్నతస్థాయి కమిటీ భేటీ జరిగింది. కమిటీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలతో గంట సేపు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై స్టాలిన్ చర్చించారు. 11 తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఆ వివరాలను మీడియాకు స్టాలిన్ వివరించారు.
రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం లేని కారణంగా పలు సమస్యలతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర సంకట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా నీట్ పరీక్షల గందరగోళం విద్యార్థుల్ని ఆందోళనలో పడేస్తున్నదన్నారు. రైతు ఆత్మహత్యల పర్వం సాగుతున్నా, కరువుతో ప్రజలు తల్లడిల్లుతున్నా పట్టించుకునేవాళ్లు కరువయ్యారని ధ్వజ మెత్తారు. ఆపద్ధర్మ సీఎం పన్నీరు సెల్వం తానే పదవిలో కొనసాగాలని తీవ్ర ప్రయత్నాల్లో పడి పాలనను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ఇకనైనా రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు చర్యల్ని వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీని సమావేశపరిచి మెజారిటీ ఉన్నవారిని అధికార పగ్గాలు చేపట్టే విధంగా ఆహ్వానించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
డీఎంకేపై శశికళ చేస్తున్న వ్యాఖ్యలపై తాను స్పందించబోనని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పదవీ వ్యామోహంతో వారి మధ్య పోటీ సాగుతోందని, దొడ్డిదారిన వారిలో ఎవరికో ఒకరికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం డీఎంకేకు లేదని స్పష్టం చేశారు. బల పరీక్ష తప్పనిసరైతే, డీఎంకే మద్దతు ఎవరికి? అని ప్రశ్నించగా... వేచి చూడండి, సరైన సమయంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంటామని బదులిచ్చారు. ఉదయం పది గంటల సమయంలో స్టాలిన్ శాసనసభకు వెళ్లడంతో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. గంట పాటుగా తన చాంబర్‌లో ఉన్న స్టాలిన్ మీడియాతో కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు. మరికాసేపట్లో ఆపద్ధర్మ సీఎం పన్నీరుసెల్వం సచివాలయంలోకి వస్తారన్న సమయంలో హఠాత్తుగా స్టాలిన్ ప్రత్యక్షం కావడంతో చర్చ బయల్దేరింది.