త్వరలో అధికారంలోకి డీఎంకే!
- ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- తమిళ రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్
- 20 మంది ఎమ్మెల్యేలు కీలకం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? శశికళనా... పన్నీర్ సెల్వమా? అని అందరూ బుర్రబద్దలు కొట్టుకుంటున్న తరుణంలో వీరిద్దరూ కాదు తామని డీఎంకే తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో త్వరలో డీఎంకే ప్రభుత్వం వికసిస్తుందని పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా శనివారం కొత్త చర్చకు తెరదీశారు.
అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాశ్రేయస్సును కోరుకోవడం తమ పార్టీ కర్తవ్యంగా భావిస్తామని స్టాలిన్ పార్టీ శ్రేణులతో చెప్పారు. సుపరిపాలనతో ప్రజలను తమవైపు తిప్పుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు. అయితే శశికళ, పన్నీర్‌సెల్వం మధ్య బలపరీక్ష అనివార్యమైన పక్షంలో ప్రజాస్వామ్య పరిరక్షణ దృష్ట్యా తమ ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని స్టాలిన్ రెండు రోజుల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే.
అసెంబ్లీలో బలాబలాలు...
తమిళనాడులో మొత్తం 235 అసెంబ్లీ స్థానాలు ఉండగా వాటిల్లో ఒక స్థానాన్ని ఆంగ్లో ఇండియన్‌ను నామినేట్ చేస్తారు. గత ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికలు కలుపుకుని మొత్తం 136 స్థానాలను అన్నాడీఎంకే గెలుచుకుంది. జయలలిత మరణంతో ప్రస్తుతం 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 89 స్థానాలతో డీఎంకే ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. డీఎంకే మిత్రపక్షాలైన కాంగ్రెస్‌కు 8, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌కు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. అధికారానికి మ్యాజిక్ ఫిగర్ 117 కాగా మిత్రపక్షాలను కలుపుకుని అసెంబ్లీలో డీఎంకే బలం 98. ఈ నేపథ్యంలో బలపరీక్షలో నెగ్గి పన్నీర్‌సెల్వం సీఎం కాలేరని భావించే, శశికళ వద్ద ఇమడలేని 20 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను చేరదీసి డీఎంకే అధికారంలోకి రావచ్చు. ఈ ఆలోచనతోనే స్టాలిన్ వ్యాఖ్యానించారనే అంశంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.
తమిళ సీఎం ఎన్నికలో బీజేపీ పాత్ర లేదు: వెంకయ్యనాయుడు
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు రాజకీయా ల్లో బీజేపీ జోక్యం చేసుకోదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని.. ప్రభుత్వ ఏర్పాటులో, సీఎం ఎన్నిక విషయంలో తమ పార్టీ కి ఎలాంటి పాత్రా లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళనా డులో జరుగుతున్నది ఏఐఏడీఎంకే అంతర్గత వ్యవహారమన్నారు. నియమ, నిబంధనలకు అనుగుణంగా, రాష్ట్రపతి ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఆ రాష్ట్ర గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని కేశవ స్మారక విద్యాలయంలో ఆయన విలేక రులతో మాట్లాడారు.
తమిళనాడులో పరిణా మాలు బాధాకరమని.. జయలలిత ఆశయాలకు అనుగుణంగా పనిచేసే ప్రభు త్వం రావాలని అక్కడి ప్రజలు కోరుకుంటు న్నారని వెంకయ్య చెప్పారు. జయలలిత తర్వాత కూడా ఏఐఏడీఎంకేతో సంబంధాలు కొనసా గించాలనే అభిప్రాయంతో ఉన్నామని తెలిపారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నం దున.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై మోదీతో తెలంగాణ ప్రభుత్వ అఖిలపక్ష భేటీ వాయిదా పడిందన్నారు.
ప్రజలు కాంగ్రెస్‌ను బహిష్కరిస్తారు: మన్మోహన్పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తా మంటోందని.. ఆ విధంగా చేస్తే ఆ పార్టీని ప్రజలు బహిష్కరిస్తారని వెంకయ్య నాయు డు వ్యాఖ్యానించారు.