స్పీకర్ కు లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయా..?
చెన్నై: విశ్వాసపరీక్ష నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీలో నేటి ఉదయం నుంచి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ సీఎం పన్నీర్ సెల్వం, డీఎంకే అధినేత స్టాలిన్ మద్ధతుదారులు సభ సజావుగా సాగకుండా యత్నిస్తుండటంతో సభను స్పీకర్ ధన్ పాల్ పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. తమిళనాడు తాజా రాజకీయ పరిస్థితులపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సాధారణంగా అసెంబ్లీ స్పీకర్ కు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. వాస్తవంగా అసెంబ్లీలో నేడు పళనిస్వామి ప్రభుత్వానికి అజెండా అంటూ ఏదీ లేదన్నారు. తమ ప్రభుత్వానికి మద్ధతు ఉందని పళనిస్వామి సభలో నిరూపించుకుంటే.. దానిపై సభాపతి గవర్నర్ విద్యాసాగర్ రావుకు నివేదిక అందించాల్సి ఉంటుందని సురేష్ రెడ్డి తెలిపారు. తమిళనాడు అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు ఎంతో బాధాకరమన్నారు. విశ్వాసపరీక్ష రహస్య ఓటింగ్ ప్రకారమే జరిపించాలన్న కచ్చితమైన నిబంధనలేమీ లేవన్నారు.
సభలోకి పోలీసులు ఎలా వస్తారంటూ డీఎంకే ఎమ్మెల్యేలు, అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.. కానీ మార్షల్స్ వచ్చినా, నేతలు వచ్చినా, ఇతర ఏ సిబ్బంది వచ్చినా సభాపతి ఆదేశాల మేరకు ఇలా జరుగుతుందన్నారు. సభ సజావుగా సాగకుండా, ఇబ్బందులకు గురిచేస్తూ.. తీవ్ర ఆటంకం కలిగించిన నేపథ్యంలో సభాపతి మార్షల్స్ కు కొన్ని ఆదేశాలు జారీచేస్తారు. సభాపతి ఆదేశాల మేరకు ఆయా ఎమ్మెల్యేలను సభ నుంచి బయటకు లాక్కెళ్తారని చెప్పారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తి రాజ్యాంగ పరంగా విశ్వాస పరీక్ష లేదా బలనిరూపణలో నెగ్గాల్సి ఉంటుందని, అప్పటినుంచీ పూర్తిస్థాయి ప్రభుత్వం కార్యరూపం దాల్చినట్లని వివరించారు. మరోవైపు డీఎంకే ఎమ్మెల్యేలు సభలో అలాగే కూర్చొని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.